లాటరైట్ పరిశ్రమ నెలకొల్పాలి
ఇల్లెందు అర్బన్, న్యూస్‌లైన్: మండలంలోని మామిడిగుండాల గ్రామంలో లాటరైట్ పరిశ్రమ నెలకొల్పి స్థానికులకు ఉపాధి కల్పించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మామిడిగుండాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి భూస్వామి రాఘవేంద్రరావు ఆక్రమించుకున్న భూముల పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్త మూతి కృష్ణ పేదల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం సరికాదన్నారు.
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ పేదలపక్షాన పోరాడేది న్యూడెమోక్రసీ మాత్రమేనని అన్నారు. ఎన్డీపై తప్పుడు ఆరోపణలు చేయడం కృష్ణకు తగదన్నారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు నర్సింహరావు మాట్లాడుతూ ఉద్యమకారులు ప్రజలకు న్యాయం చేయాలే తప్ప కీడు తలపెట్టవద్దని కోరారు. పేదల భూములను కబ్జా చేస్తే సహించేంది లేదని హెచ్చరించారు. లాటరైట్ ఖనిజ పరిశ్రమ వల్ల ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. సభలో నాయకులు నాయిని రాజు, తుపాకుల నాగేశ్వరరావు, బండారి ఐలయ్య, సక్రు, సారంగపాణి, సూర్ణపాక పార్వతి, కల్తీసుభద్ర పాల్గొన్నారు.