బోరుబావిలో మరో బాలుడు
భోపాల్ : దేశంలో బోరుబావి ఉదంతాలు విషాదాన్ని మిగులుస్తున్నా.. నిర్లక్ష్యం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో మరో బోరు బావి ప్రమాదం ఆందోళన రేపింది. ముండ్ల గ్రామానికి చెందిన బాలుడు ఆయుష్ (5) బోరుబావిలో ప్రమాదవశాత్తూ పడిపోయాడు. బాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది.
మహేష్ అనే వ్యక్తి తన భార్య, కుమారుడితో పొలంపనులు చేసుకుంటూ స్థానికంగా జీవిస్తున్నాడు.ఈ క్రమంలో పనుల నిమిత్తం వెళ్ళినపుడు అక్కడే ఆడుకుంటున్న బాలుడు సుమారు 200 అడుగుల లోతు బోరు బావిలోపడిపోయాడు.
సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. బాలుడిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. 30 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్లు గుర్తించారు. ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నారు. బావికి సమాంతరంగా గొయ్యి తవ్వి బాలుడిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారి గోపాల్ పార్మర్ తెలిపారు. మొదట శనివారం సాయంత్రానికి బాలుడు రక్షిస్తామని చెప్పిన అధికారులు ..సహాయ చర్యల్ని మరింత వేగవంతం చేశారు.