laxmi narasimha swamy
-
భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి సన్నిధి (ఫొటోలు)
-
Yadadri: రాజగోపురం దిగువభాగంలో ఆధ్యాత్మిక రూపాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాభివృద్ధిలో భాగంగా ప్రధానాలయం పడమటి రాజగోపురం దిగువభాగంలో నిర్మించిన రిటైనింగ్ వాల్‌పై ఆధ్యాత్మిక రూపాలతో కూడిన ప్యానల్స్ ఏర్పాటు చేసేందుకు వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే బిగించిన ఏనుగుల ప్యానల్స్ మధ్యలో నృసింహుడితో పాటు శంఖు, చక్రనామాలు, వివిధ దేవతామూర్తులు కొలువైన ప్యానల్స్‌ను బిగించనున్నారు. కాకతీయతోరణం మాదిరిగా ఉన్న ఈ ప్యానల్స్‌ను రాజస్తాన్ నుంచి తెప్పించారు. ఇండోర్ నుంచి ద్వారక కంపెనీ ఆధ్వర్యంలో తెప్పించిన విద్యుత్ దీపాలను పుష్కరిణి చుట్టూ వాల్‌పై ఏర్పాటు చేస్తున్నారు. సీతాకోక చిలుక రెక్కల ఆకారంలో ఉన్న ఈ ఆర్నమెంటల్ విద్యుత్ దీపాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ధర్మదర్శనానికి గంట! యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. హైదరాబాద్ జంటనగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20వేలమంది భక్తులు వచ్చి స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి గంట, అతిశీఘ్ర దర్శనాలకు 20 నిమిషాల సమయం పట్టింది. భక్తుల రద్దీ దృష్ట్యా వాహనాలను కొండపైకి అనుమతించలేదు. పాతగుట్టలో సైతం భక్తుల రద్దీ కొనసాగింది. వివిధ పూజల ద్వారా ఆలయానికి రూ.16,58,864 ఆదాయం వచి్చనట్లు అధికారులు వెల్లడించారు. -
అంతర్వేది రధానికి ఫిబ్రవరి 13న సంప్రోక్షణ
సాక్షి, కాకినాడ: అంతర్వేదిలో నూతనంగా నిర్మించిన రధానికి ఫిబ్రవరి 13వ తేదీన సంప్రోక్షణ కార్యక్రమం చేపడతామని ఆలయ అధికారులు వెల్లడించారు. సంప్రోక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విశాఖ శారదా పీఠాధిపతులను ఆహ్వానించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 11 నుంచి మూడు రోజుల పాటు సంప్రోక్షణ ప్రక్రియ చేపట్టనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. సంప్రోక్షణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా, ఆగమానుసారం చేపట్టాలని స్వామి స్వరూపానందేంద్ర సూచించారు. కాగా, 62 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రధం గతేడాది సెప్టెంబర్ 6న అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. -
మహిమాన్విత మూర్తి మల్లూరు నరసింహ స్వామి
హిరణ్య కశిపుడి ఆగడాలను అంతమొదించడానికి భక్త ప్రహ్లాదుడికి ముక్తిని ప్రసాదించడానికి శ్రీహరి ఎత్తిన అవతారమే నరసింహావతారం. ఆ నృసింహ దేవుడు తన ఉనికిని చాటుకోవడానికి అనేక క్షేత్రాలలో అవతరించాడు. అలాంటి పుణ్య క్షేత్రాలు తెలుగు రాష్ట్రాలలో తొమ్మిది ఉన్నాయి. వాటకే నవ నరసింహ క్షేత్రాలని పేరు. ఆ నవ నరసింహ క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రంగా మల్లూరు హేమాచల లక్ష్మి నరసింహ క్షేత్రం ప్రసిద్ధి గాంచింది. వరంగల్ జిల్లా మంగ పేట మండలంలో ఉన్న ఈ క్షేత్రంలో స్వామి హేమాచల లక్ష్మీనరసింహ స్వామిగా పూజాదికాలు అందుకుంటున్నాడు వరంగల్ పట్టణానికి 135 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ అటవీ వనాలు కొండల మధ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోంది. మల్లూరు గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం హేమాచలం అనే కొండ మీద అలరారుతోంది . ఇక్కడి స్వామి వారి మూర్తి అయిదు వేల సంవత్సరాల నాటిదని ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. సాక్షాత్తు దేవతలే ఇక్కడ స్వామివారిని ప్రతిష్టించినట్లు చెబుతారు. గర్భాలయంలో స్వామి వారి మూర్తి మానవ శరీరంలా మెత్తగా దర్శనమిస్తుంది. స్వామి వారి ఛాతీ మీద రోమాలు దర్శనమిస్తాయి. అలాగే స్వామి వారి శరీరాన్ని ఎక్కడ తాకినా మెత్తగా ఉంటుంది. స్వామి వారి బొడ్డు భాగంలో ఓ రంధ్రం దర్శనమిస్తుంది. దీని నుంచి నిరంతరం ఓ ద్రవం కారుతుంటుంది. దీనిని అదుపు చేయడానికి ఆ భాగంలో గంధాన్ని పూస్తారు. పూర్వకాలంలో స్వామి వారి విగ్రహాన్ని తలలించినపుడు, బొడ్డు దగ్గర ఇలా రంధ్రం పడిందంటారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆ బొడ్డు భాగంలో ఉంచిన గంధాన్నే ప్రసాదంగా ఇస్తారు. ఈ ఆలయానికి సమీపంలో చింతామణి జలపాతం ఉంది. ఇది విశేషమైన ఔషధ గుణాలతో ఉంటుందని చెబుతారు. ఈ జలపాతానికి సమీపంలో మహాలక్ష్మి అమ్మవారి పురాతన మందిరం ఉంది. చింతామణి జలపాతానికి సమీపంలో మరో చిన్ని జలపాతం ఉంది. హేమాచల నరసింహ స్వామిని దర్శించుకోవడం వల్ల సమస్త శత్రు బాధలు తీరుతాయంటారు. ఎలా చేరుకోవాలి? మల్లూరు క్షేత్రానికి వరంగల్ నుంచి నేరుగా చేరుకోవచ్చు . అలాగే ఖమ్మం జిల్లా మణుగూరు పట్టణానికి కూడా ఇది సమీపంలో ఉండడం వల్ల మల్లూరు నరసింహ స్వామి అని పిలుస్తారు ఈ స్వామిని. – దాసరి దుర్గాప్రసాద్ పర్యాటక రంగ నిపుణులు -
యాదాద్రీశుడికి శాస్త్రోక్త పూజలు
సాక్షి, యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం శ్రీస్వామి అమ్మవార్లకు ఆచార్యులు విశేష పూజలు నిర్వహించారు. ఉదయమే ఆలయాన్ని తెరచిన అర్చక స్వాములు శ్రీస్వామి వారికి సుప్రభాతం చేపట్టారు. అనంతరం అర్చనలు, అభిషేకం, సువర్ణ పుష్పార్చన చేశారు. మండపంలో ఉత్సవ మూర్తులకు అష్టోత్తర పూజలు, శ్రీసుదర్శన నారసింహ హోమం జరిపించారు. పంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణ వేడుకను నిర్వహించారు. రాత్రి శ్రీస్వామి అమ్మవార్లకు మహానివేదన, శయనోత్సవం నిర్వహించారు. ఆన్లైన్ పూజల ద్వారా శ్రీస్వామి వారి నిత్య కల్యాణం, అభిషేకాల్లో భక్తులు పేర్లు నమోదు చేసుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ వేళల్లో మార్పులు.. యాదగిరిగుట్ట పట్టణంలో రోజురోజుకూ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మరోసారి ఆలయ పూజలు, దర్శనాల వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఈఓ గీతారెడ్డి శనివారం వెల్లడించారు. ఇటీవల లాక్డౌన్ సడలింపులో భాగంగా పాత పద్ధతిలో పూజలు, దర్శనాల మార్పులు చేసిన ఆలయ అధికారులు, వాటిని మరోసారి కుదిస్తూ మార్పులు చేశారు. స్థానిక ప్రజలు, ఆలయ సిబ్బంది ఆరోగ్య దృష్ట్యా ఆలయ వేళల్లో మార్పులు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఆలయ వేళలు ఇలా.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయాన్ని ఉదయం 5.30 గంటలకు తెరిచి, ఉదయం 5.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు శ్రీస్వామి వారికి సుప్రభాత సేవ, ఉదయం 6గంటల నుంచి 6.30గంటల వరకు బిందె తీర్థం, ఆరాధన. ఉదయం 6.30 నుంచి 7.15 గంటల వరకు శ్రీస్వామి వారికి బాలబోగం, 7.15గంటల నుంచి 8.15 గంటల వరకు అభిషేకం. 8.15 గంటల నుంచి 9గంటల వరకు సహస్త్ర నామార్చన, ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఉచిత లఘు దర్శనం, మధ్యాహ్నం 12గంటల నుంచి 12.45గంటలకు శ్రీస్వామి వారికి మహా రాజబోగం (ఆరగింపు), మధ్యాహ్నం 12.45 నుంచి సాయంత్రం 6.30గంటల వరకు ఉచిత లఘు దర్శనం, సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు శ్రీస్వామి వారికి ఆరాధన, రాత్రి 7గంటల నుంచి 7.30 గంటల వరకు సహస్త్ర నామార్చన, రాత్రి 7.30 నుంచి రాత్రి 8గంటల వరకు నివేదన, అనంతరం ఆలయ ద్వార బంధనం చేయనున్నట్లు ఈఓ తెలిపారు. ఇదిలా ఉండగా ఉదయం 8.30 గంటల నుంచి 10గంటల వరకు శ్రీస్వామి వారి సుదర్శన నారసింహ హోమం, ఉదయం 10.30 గంటల నుంచి 11.30గంటల వరకు శ్రీస్వామి అమ్మవార్ల నిత్య కల్యాణం, సాయంత్రం 5గంటలకు శ్రీస్వామి వారి జోడు సేవలు దేవస్థానం నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనుబంధ ఆలయమైన శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కూడా ఈ విధంగానే ఉండనున్నట్లు వెల్లడించారు. -
నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ఉదయం 11 గంటలకు యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు. అక్కడి నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. రూ.235 కోట్ల తో చేపట్టిన ఆలయ పునరుద్ధరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. రోడ్ల నిర్మాణం, భూసేకరణ కోసం రూ.109 కోట్లు, టెంపుల్ సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.103 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. ఈ పనుల పురోగతిని సీఎం పరిశీలించనున్నారు. వచ్చే ఫిబ్రవరిలో యాదాద్రిలో మహాసుదర్శన యాగం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. 3,000 మంది రుత్వికులు, 3,000 మంది వేద పారాయణదారులు, 3,000 మంది సహాయకులు యాగంలో పాల్గొననున్నారు. 1,048 కుండాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పర్యటనలో యాగం తేదీలను కేసీఆర్ ప్రకటించే అవకాశముంది. -
ఇదేమిటి యాదగిరీశా..?
సాక్షి, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పరమ పవిత్రం. తెలంగాణకే తలమానికంగా ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాన్ని కొందరు అపవిత్రం చేస్తున్నారు. అత్యంత భక్తితో కొలిచే స్వామివారి సన్నిధిలోనే కొందరు పాదరక్షలు విడిచి అపవిత్రం చేస్తున్నా రు. అయినా దేవస్థానం అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెప్పుల స్టాండ్లు ఉన్నా.. యాదాద్రి దేవస్థానంలో మూడు చెప్పుల స్టాండ్లు ఉÐన్నాయి.వీటిని సంవత్సరానికి రూ.26లక్షలతో కాంట్రాక్టు కు అప్పగించారు. ఇవి కొండపైన 5 దుకాణాల్లో చెప్పులు విడిచి దర్శనానికి వెళ్లాలని అధికారులు నిర్ణయించా రు. అయితే దేవస్థానంలోని కొంతమంది అధికారులే ఆలయానికి పాదరక్షలతో వచ్చి ద్వారాల ఎదుట విడుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీఐపీలు దర్శనానికి వచ్చే క్రమంలో కూడా పాదరక్షలతోనే వస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దీంతో ఎంత పవిత్రంగా భావించే ఆలయ పరిసరాలు అపవిత్రం అవుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రిని తిరుమల మాదిరిగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. అందుకు అనుగుణంగానే అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు. తిరుమలలో దా దాపు ఐదు కిలోమీటర్ల దూరం నుంచే పాదరక్షలతో నడవకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయితే యాదాద్రిలో భద్రతా సిబ్బంది కూడా పట్టనట్లు వ్యవహరిస్తున్నానే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు తగు చర్యలు చేపట్టి ఆలయ పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. -
గ్రీన్.. గుట్ట
సాక్షి, యాదాద్రి: యాదాద్రి పుణ్యక్షేత్రంలోని పెద్దగుట్టలో పరుచుకున్న పచ్చదనం పర్యాటకులను, భక్తులను ఆకట్టుకుంటోంది. యాదాద్రి క్షేత్రాన్ని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి చేపట్టిన అభివృద్ధి పనుల్లో పెద్దగుట్ట సుందరీకరణ ఒకటి. ఇప్పటికే ఇక్కడ చేపట్టిన లేఅవుట్లు, రోడ్లు, సుందరీకరణ పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వారాంతంలో యాదాద్రికి వచ్చే భక్తులకు పెద్దగుట్ట కనువిందు చేస్తోంది. 250 ఎకరాల్లో లేఅవుట్ పనుల్లో భాగంగా 202 ఓపెన్ ప్లాట్లను సిద్ధం చేశారు. తిరుమల తరహాలో దాతల సాయంతో ప్రత్యేక సూట్లను అన్ని వసతులతో నిర్మించనున్నారు. త్వరలో దాతల పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం రూ.207 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కావొచ్చాయి. రోడ్లకు ఇరువైపులా పచ్చదనం.. పెద్దగుట్ట లేఅవుట్ అభివృద్ధిలో ప్రధానమైన రోడ్ల అభివృద్ధి పనులు పూర్తి కావొస్తున్నాయి. రోడ్లకు ఇరువైపులా పచ్చదనం కోసం హెచ్ఎండీఏ పెద్ద ఎత్తున వివిధ రకాల మొక్కలను నాటుతోంది. అంతేగాకుండా రెండు చోట్ల చిన్న నీటి సరస్సులను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ల్యాండ్ స్కేప్‌లు ఏర్పాటు చేశారు. పాతగుట్టకు రోడ్డు సౌకర్యం.. పాతగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు పెద్దగుట్ట నుంచి రోడ్డు సౌకర్యం కల్పిం చారు. భక్తులు కొండపైన స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో యాదగిరిగుట్ట పట్టణంతో సంబంధం లేకుండా పెద్దగుట్టపై నుంచి పాతగుట్ట స్వామివారి వద్దకు చేరుకునేలా రోడ్డును నిర్మించారు. నూతనంగా మరో రోడ్డును మల్లాపురం రోడ్డు నుంచి నిర్మిస్తున్నారు. ప్రారంభమైన ప్రెసిడెన్షియల్ సూట్లు గుట్టకు వచ్చే వీవీఐపీల కోసం ప్రెసిడెన్షియల్ సూట్ పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి తదితర వీవీఐపీల కోసం ఒక ప్రెసిడెన్షియల్ సూట్‌ను నిర్మిస్తున్నారు. 10 భవనాలు, గండి చెరువు వద్ద కల్యాణ కట్ట, గుట్ట చుట్టూ రింగ్‌రోడ్డు పనులు జరుగుతున్నాయి. తులసీ వనంలో నిర్మించిన రెండు సరస్సులలో బోటింగ్‌ను త్వరలో అందుబాటులోకి తేనున్నారు. -
యాదగిరీశుడికి మహాప్రాకార మండపం
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణం తాలూకు ప్రత్యేకతల పరంపరకు మరో ఆకర్షణ తోడవనుంది. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో కీలకమైన ప్రధాన ప్రాకార మండపం కొత్త రికార్డు నెలకొల్పనుంది. ఇటీవలి కాలంలో ఏ కొత్త నిర్మాణంలోనూ లేని తరహాలో ఈ మండపం ఏకంగా 36 అడుగుల ఎత్తుతో నిర్మితమవుతోంది. దీని పైకప్పును గురువారం నిర్మించనున్నారు. ఉదయం నుంచి రాత్రి కల్లా కాంక్రీట్‌తో ఈ నిర్మాణం జరగనుంది. అంతెత్తుతో ఉండే ప్రాకార మండపం వైశాల్యం కూడా 25 వేల చదరపు అడుగుల్లో భారీగా ఉండనుంది. భక్తులు భారీగా పోటెత్తినా ఇబ్బంది లేని రీతిలో నిర్మాణం ఉంటుంది. పెద్ద పెద్ద పురాతన మందిరాల్లో ప్రాకార మండపం రాతితో చాలా ఎత్తుతో కనిపిస్తుంటుంది. వీటి స్తంభాల తాలూకు శిల్ప శోభ కూడా ఆకట్టుకుంటుంది. కొత్త దేవాలయాల్లో కాంక్రీట్‌తో నిర్మిస్తున్న ప్రాకార మండపాలు మామూలు ఎత్తులోనే ఉంటున్నాయి. యాదాద్రిలో గత మండపం కూడా సాధారణంగానే ఉంది. ఇప్పుడు మొత్తం దేవాలయ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నందున మండపాన్ని పురాతన పెద్ద దేవాలయాల తరహాలో భారీగా నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం 36 అడుగుల ఎత్తుండే సెంట్రింగ్ రాడ్లు దొరక్కపోవడంతో వాటిని ప్రత్యేకంగా తయారు చేయటం విశేషం! స్తంభాలూ ప్రత్యేకమే విశాలంగా ఉండే మండపంలో స్తంభాలు కూడా అంతే ప్రత్యేకంగా సిద్ధమయ్యాయి. 12 మంది ఆళ్వార్ల రూపంలో వీటిని సిద్ధం చేశారు. వీటి ఎత్తు 12 అడుగులుంటుంది. వీటిపై కాకతీయ స్తంభాలు ఏర్పాటు చేశారు. వీటికి ప్రత్యేకంగా ఆధార పీఠాలూ రూపొందించారు. పురాతన దేవాలయాల్లో కప్పు కూడా రాతితో నిర్మించడం ఆనవాయితీ ఇక్కడ మాత్రం కాంక్రీట్‌తోనే నిర్మిస్తున్నారు. చుట్టు గోడలు మాత్రం రాతితో నిర్మిస్తారు. ఆలయానికి నాలుగు వైపులా నిర్మించే మాడ వీధులు దీనికి అనుసంధానమై ఉంటాయి. ప్రధాన మూల విరాట్టు కొలువుదీరే గర్భాలయ నిర్మాణం దాదాపు పూర్తయింది. దాని కప్పు గతంలోనే నిర్మించారు. దానిపై గోపుర నిర్మాణానికి ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దసరా నాటికి మిగతా పనులు కూడా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దసరా తర్వాత బాలాలయంలోని ఉత్సవ మూర్తులను ప్రధానాలయంలో ప్రతిష్టించనున్నారు. -
ప్రారంభమైన లక్ష్మీనరసింహస్వామి పారువేట ఉత్సవాలు
-
వైభవంగా ఉట్ల పరుష
ఉరవకొండ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఉట్ల పరుస వైభవంగా జరిగింది. ఈఓ అక్కిరెడ్డి, ప్రధాన అర్చకులు ద్వారకనాథచార్యులు ఆధ్వర్యంలో శ్రీవారి ఉత్సవ మూర్తులను ఆమిద్యాల పెన్నోబులేసుడి ఆలయం నుంచి పెన్నహోబిలానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామి వారికి అభిషేకం, మహామంగళహారతి, కుంకమార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మినృసింహున్ని ప్రత్యేక పల్లకీలో ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం యువకులు ఉట్లపరుసలో పాల్గొని, ఉట్టిని పగులగొట్టారు. -
వైభవంగా బ్రహ్మ రథోత్సవం
పావగడ : కణివె శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహాన్ని వేద మంత్రాలు , వింజామర సేవలతో అర్చకులు రథంలోకి తరలించి ప్రతిష్ఠించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఎండోమెంట్ అధికారి , తహసీల్దార్ తిప్పూరావు రథాన్ని లాగి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు బ్రహ్మరథంలోకి అరటి పళ్లు విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. పలువురు ధర్మకర్తలు భక్తులకు అన్నదానాన్ని నిర్వహించారు. -
ఘనంగా బ్రహ్మోత్సవాలు
కదిరి : ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 7 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాజకీయ పార్టీల నేతలు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో ఆలయ ప్రాంగణంలో బుధవారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు ఎంఎస్ పార్థసారథి, కందికుంట వెంకట ప్రసాద్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్దన్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు మాట్లాడారు. తిరువీధుల్లో ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించుకుని నారసింహుడి బ్రహ్మోత్సవాలకు సహకరించాలన్నారు. చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గుడిసె దేవానంద్, డీఎస్పీ ఎన్వి రామాంజనేయులు, ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి, మున్సిపల్ కమిషనర్ పి.భానుప్రసాద్, కౌన్సిలర్ రాజశేఖరాచారి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
శిలలపై శిల్పాలు చెక్కినారు...
‘యాదాద్రి’కి సిద్ధమవుతున్న శిల్పాలు యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని ప్రధానాలయానికి సంబంధించి శిల్పాలు తయారవుతున్నాయి. పనులను ఆదివారం స్థపతులు సుందరరాజన్, వేలు, ఆర్కిటెక్టు ఆనంద్‌సాయి గుంటూరు జిల్లా కమలాపురం, ప్రకాశం జిల్లా మార్టూరుకు వెళ్లి పర్యవేక్షించారు. ఆలయం చుట్టూ రిటైనింగ్ వాల్, ఆలయ ప్రాకారం, ఆరు రాజగోపురాలు, ముఖ మండపాలు, ఉప ఆలయాలు, తిరుమాడవీధుల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శిల్పాలను తయారుచేస్తున్నారు. వీటిలో సింహం ఆకారంలో ఉన్న రాతి స్తంభాలు, చతుర్భుజి ఆకృతుల్లో శిల్పాలు ఉన్నాయి. ఆలయ ముఖద్వారం ముందు 20 సింహం ఆకృతి రాతి స్తంభాలు వస్తాయని ఆర్కిటెక్టులు తెలిపారు. వెయ్యేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా ఆలయాన్ని తీర్చి దిద్దుతున్నారు. క్యూలైన్లలోని భక్తులకు చల్లదనాన్ని ఈ శిల వెదజల్లుతుందని వైటీడీఏ అధికారులు తెలిపారు. శిల్పాల మధ్య సిమెంట్ వాడకుండా ఒక విధమైన జిగురు పదార్థం వాడుతున్నామని ఆర్కిటెక్టు ఆనంద్‌సాయి తెలిపారు. 900 మంది స్థపతులు, ఆర్కిటెక్టుల ఆధ్వర్యంలో శిల్పాలు తయారవుతున్నాయి. ఈ శిల్పాలను కృష్ణ శిలతో తయారు చేస్తున్నారు. -
శ్రీకృష్ణాలంకారంలో ఊరేగిన నరసింహస్వామి
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం స్వామివారు ఉదయం శ్రీకృష్ణాలంకారం..రాత్రి హంసవాహన సేవలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి,అమ్మవార్లను అర్చకులు పంచామృతాలతో అభిషేకించి పట్టు వస్త్రాలను ధరింపజేశారు. వివిధరకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం మురళీ కృష్ణుడిగా అలంకారంలో, రాత్రి హంసవాహన సేవలలో అధిష్టింపజేసి ఆలయ తిరువీధులలో బాజాభజంత్రీలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ఊరేగించారు. కొండపై ఉన్న సంగీతభవనంలో పలువురు కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణ అధికారి గీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
మట్టపల్లి వంతెన
మట్టపల్లి (మఠంపల్లి), న్యూస్‌లైన్ : మట్టపల్లి వద్ద కృష్ణానదిపై రూ.50 కోట్లతో నిర్మిస్తున్న హైలెవల్ వంతెనకు శ్రీలక్ష్మీనృసింహుడి వారధిగా ప్రభుత్వ అనుమతితో నామకరణం చేయనున్నట్టు రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం మట్టపల్లి వద్ద వంతెన నిర్మాణ పనులకు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడినుంచి భారీ ర్యాలీగా లక్ష్మీనృసింహస్వామి దేవాలయ సమీపంలోని బహిరంగ సభాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ వారధి వల్ల ఫిబ్రవరి చివరి నాటికి ఏర్పడే రెండు రాష్ట్రాల మధ్య వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు మెరుగైన సౌకర్యాలు సమకూరుతాయన్నారు. రాష్ట్రంలో మూడవ విడత రచ్చబండలో రూ.10,450 కోట్లతో 13లక్షల 65 ఇళ్లను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించినట్లు తెలిపారు. హుజూర్నగర్ నియోజకవ ర్గంలోని అన్ని మండలాల్లో విద్యుత్, విద్య, వైద్యం, రహదారి, సాగు తాగునీరు పథకాలను కోట్లాది రూపాయలతో చేపట్టినట్లు వివరించారు. హుజూర్‌నగర్‌లో 112 ఎకరాలలో రూ.150 కోట్లతో నిర్మిస్తున్న హౌసింగ్ కాలనీ పరిశీలనకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని ఆహ్వానించనున్నట్టు వెల్లడించారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర నాయకులు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకే మొగ్గుచూపుతున్నారన్నారు. ప్రస్తుతం ఎన్టీపీసీలో సాంకేతిక లోపం కారణంగా తాత్కాలికంగా ఏర్పడిన విద్యుత్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అనంతరం రైతుబంధు పథకం కింద రూ.కోటి 70 లక్షల రుణాలను రైతులకు చెక్కు రూపంలో అందజేశారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్‌లు, వివిధ వర్గాల వారు మంత్రి, ఎంపీలను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిరంజీవులు, హౌసింగ్ సీఈ ఈశ్వరయ్య, ఆర్అండ్బీ ఎస్ఈ లింగయ్య, ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, ఐడీసీ డెరైక్టర్ శివారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగన్నగౌడ్, జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, బ్లాక్, మండల అధ్యక్షులు అరుణ్‌కుమార్‌దేశ్‌ముఖ్, మంజీనాయక్, నాయకులు నిజాముద్దీన్, మధిరప్రతాపరెడ్డి, వెంకటనర్సయ్య, వెంకటరెడ్డి, జి.వెంకటేశ్వర్లు, రామారావు, గడ్డిరెడ్డి,అప్పయ్య, ఎలియాస్‌రెడ్డి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
ఆపద్బాంధవా..!
అనంతపురం, న్యూస్‌లైన్ నెట్వర్క్ : ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని జిల్లాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి క్యూలైన్లలో నిలబడిన భక్తులు.. శనివారం తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వారం నుంచి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతపురంలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కదిరి ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామిని కదిరి పరిసర మండలాలతో పాటు కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామి వారిని వైకుంఠ ద్వారం (ఉత్తర గోపురం) వద్దకు తీసుకురాగానే భక్తులు ‘గోవిందా..గోవింద’ అంటూ తన్మయత్వం పొందారు. 3 గంటల నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు అర్చకులు వైకుంఠ ద్వార ప్రవేశంలో ప్రత్యేకంగా శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు వైకుంఠ దర్శనభాగ్యం కల్పించారు. లక్ష మందికి పైగా భక్తులు హాజరైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సతీసమేతంగా తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకున్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణతో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. డీఎస్పీ దేవదానం ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు. ఉరవకొండ మండల పరిధిలోని పెన్నహోబిలంలో ఉత్తర గోపురం నుంచి లక్ష్మీనరసింహస్వామిని భక్తులు దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారికి మహా మంగళహారతి, దీక్షాహోమం, అర్చన చేపట్టారు. ముక్కోటి ఏకాదశి విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యులు భక్తులకు తెలియజేశారు. ఏర్పాట్లను ఈఓ బోయపాటి సుధారాణి పర్యవేక్షించారు. గుంతకల్లు మండల పరిధిలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి మూలవిరాట్‌కు వేకువజామున నిత్యాభిషేకం చేసి బెంగళూరు నుంచి తెప్పించిన పుష్పాలతో అలంకరించారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని పల్లకిపై తీసుకొచ్చి ఉత్తర ద్వారంలో కొలువుదీర్చగా.. భక్తాదులు దర్శించుకున్నారు. జిల్లా నుంచే కాకుండా కర్నూలు, బళ్లారి నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఈఓ ఎంవీ సురేష్‌బాబు, అనువంశిక ధర్మకర్త కె.సుగుణమ్మ ఏర్పాటను పర్యవేక్షించారు. హిందూపురంలోని శ్రీపేట వెంకటరమణస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వారంలోకి వెళ్లడానికి ముందు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏడు ద్వారాల నుంచి భక్తులు వెళ్లారు. ఇందుకోసం ఆలయానికి 900 అడుగుల దూరంలో క్యూకట్టారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామివారిని భక్తాదులు దర్శించుకున్నారు. కొత్తచెరువు మండలం చెన్నకేశవపురంలోని చెన్నకేశవస్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన ఏడు ద్వారాల నుంచి వెళ్లి భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. తాడిపత్రిలోని చింతల వెంకటరమణ స్వామి దేవాలయంలో తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులు బారులు తీరారు.