LCD TV
-
మీ పాత టీవీని స్మార్ట్‌టీవీగా ఇలా మార్చేయండి....!
ప్రస్తుత కాలంలో టీవీలు లేని ఇళ్లు ఉన్నాయంటే చాలా అరుదు. పెరుగుతున్న సాంకేతికతో పాటుగా టీవీల పరిణామ క్రమంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. పిక్చర్‌ట్యూబ్ టీవీల నుంచి స్మార్ట్‌టీవీల వరకు టీవీల పరిణామ క్రమం ఎదిగింది. ప్రస్తుతం స్మార్ట్‌టీవీల రాకతో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలో వచ్చే వీడియోలను నేరుగా టీవీల్లో పెద్ద స్క్రీన్‌పై చూడవచ్చును. ఈ ఫీచర్ కేవలం స్మార్ట్ టీవీలకు మాత్రమే వర్తిస్తుంది. ఓటీటీ ప్లాట్‌ఫాం వీడియోలను కేవలం స్మార్ట్ టీవీల్లో చూడగల్గుతాం అనుకుంటే మీరు పొరపడినట్లే..! మీ ఇంట్లోని పాత ఎల్ఈడీ లేదా ఎల్సీడీ టీవీలను కొన్ని ప్రత్యేకమైన గాడ్జెట్లను ఉపయోగించి స్మార్ట్‌టీవీగా తయారుచేయవచ్చును. ప్రస్తుతం మీ ఇంట్లోని టీవీలకు హెచ్డీఎమ్ఐ పోర్ట్ ఉన్నట్లయితే స్మార్ట్ టీవీలుగా ఇట్టే మార్చేయచ్చు. దాంతో పాటుగా ఇంట్లో వై-ఫై కనెక్టివీటి కూడా అవసరం. మీ పాత టీవీని స్మార్ట్ టీవీగా మార్చేందుకు మార్కెట్లో పలు రకాల గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి. 1. అమెజాన్ ఫైర్ స్టిక్ అమెజాన్ ఫైర్ స్టిక్‌తో మీ పాత టీవీలను స్మార్ట్ టీవీలుగా మార్చవచ్చును. అలెక్సానుపయోగించి వాయిస్ కంట్రోల్ ద్వారా ఓటీటీ యాప్‌లను ఇట్టే పొందవచ్చును. ఫైర్ స్టిక్‌ను హెచ్డీఎమ్ఐ పోర్ట్‌లో ఉంచి వైఫైకు కనెక్ట్ చేయాలి. దీని ధర రూ. 3,999. 2. టాటా స్కై బింజీ+ టాటా స్కై బింజీ సెటప్ బాక్స్‌తో పాత టీవీను స్మార్ట్ టీవీలుగా మార్చవచ్చును. టాటా స్కై బింజీ+ తో వినియోగదారులు తమ ల్యాప్‌టాప్, టాబ్లెట్ లేదా మొబైల్ ఫోన్లో ప్లే చేసే వీడియోలను టీవీలో చూడవచ్చును. టాటా స్కై బింజీ+లో క్రోమ్‌కాస్ట్ ఫీచరును ఏర్పాటు చేశారు. హెచ్డీఎమ్ఐ పోర్ట్‌తో స్మార్ట్ టీవీగా చేయవచ్చును. దీని ధర రూ. 3,999. 3. షావోమీ ఎమ్ఐ బాక్స్ 4కే షావోమీ ఎమ్ఐ బాక్స్ 4కే బాక్స్‌తో మీ పాత టీవీని స్మార్ట్‌టీవీగా మార్చవచ్చు. అంతేకాకుండా ఈ గాడ్జెట్‌తో గూగుల్ ప్లే స్టోర్ యాప్‌లను కూడా యాక్సెస్ చేయవచ్చును. డాల్బీ అట్మోస్‌ను సపోర్ట్ చేస్తుంది. వాయిస్ ఆదేశాలను ఉపయోగించి ఎమ్ఐ బాక్స్ 4కే ను నియంత్రించవచ్చు. ఈ పరికరం హెచ్డీఎమ్ఐ, యూఎస్బీ 2.0, బ్లూటూత్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ. 3,499. 4.యాక్ట్ స్ట్రీమ్ టీవీ 4 కే బాక్స్ యాక్ట్ ఫైబర్‌నెట్‌కు చెందిన యాక్ట్ స్ట్రీమ్ టీవీ 4కే బాక్స్‌తో ఏ రకమైన ఎల్ఈడీ టీవీలను స్మార్ట్ టీవీగా చేయవచ్చును. ఈ గాడ్జెట్‌లో సుమారు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తోంది. దీని ధర రూ. 4,499. 5. ఎయిర్ టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఎయిర్ టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కల్గి ఉంది. గూగుల్ అసిస్టెంట్ ఉండడటంతో వాయిస్ కమాండ్స్‌తో కంట్రోల్ చేయవచ్చును దీని ధర రూ. 3,999. -
కొత్తకోటలో రూ. కోటి..లూటీ!
సాక్షి, కొత్తకోట : అందమైన సోఫాలు, మంచాలు, డైనింగ్ టేబుళ్లు, డ్రెస్సింగ్ టేబుల్స్, ఎల్ఈడీ టీవీలు, ప్రీజ్లు, వాషింగ్ మిషన్స్, మొబైల్ ఫోన్స్, మిక్సీలు, స్టీల్ ఫర్నీచర్, వుడెన్ ఫర్నిచర్, ఎలక్ట్రీకల్, ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువులు సగం ధరకే కావాలా.. ఇంకెందుకు ఆలస్యం రండి కొత్తకోటకు అంటూ విస్తృత ప్రచారం జరిగింది. ముందు డబ్బు చెల్లించి వారం తర్వాత వచ్చిన బుక్ చేసిన వస్తువు తీసుకెళ్లండి. అంటూ నమ్మబలికారు. సుమారు కోటి రూపాయలకు పైగా పోగుచేసి ఓ వ్యాపారి పరారైన సంఘటన మంగళవారం కొత్తకోటలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెలితే.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఏ.రాజన్ అనే వ్యక్తి గత నెల 19వ తేదీన కొత్తకోటలోని కర్నూల్ రోడ్డులో ఓ అందమైన భవంతిలో సత్య హోమ్ నీడ్స్ పేరిట షోరూంను ప్రారంభించాడు. మొదట వాయిదాల పద్ధతిలో ఫర్నీచర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకోవచ్చని ప్రచారం చేశాడు. ఈ క్రమంలోనే షోరూంలో కొన్ని అందమైన సోఫాసెట్లు, మంచాలు, డైనింగ్ టేబుల్స్, ఎలక్టికల్ వస్తువులు ఉంచాడు. వాటిపై ఎంఆర్పీ ధరలు సూచిస్తూ.. షాప్ ప్రారంభం సందర్బంగా వాటిని సగం ధరలకే ఇస్తున్నట్లు నమ్మబలికాడు. దీంతో మొదట్లో కొందరికి సగం ధరలకే వాటిని అందజేశాడు. ఈ విషయం ఆ నోట.. ఈ నోట పడటంతో జనం వాటిని కొనుక్కునేందుకు క్యూ కట్టారు. కాగా మొదట వస్తువులో సగం డబ్బులు ముందుగా.. చెల్లించిన వారికి వారం, పది రోజుల తరువాత వస్తువు తెచ్చి ఇస్తానంటూ రశీదులు ఇచ్చాడు. దీంతో వ్యాపారి మాటలు నమ్మిన జనం సుమారు 200లకు పైగా ఒక్కక్కరూ రూ. 2 వేల నుంచి రూ 2 లక్షల వరకు చెల్లించి రశీదులు తీసుకున్నారు. వీరిలో కొందరు పోలీసులు కూడా ఉండటం విశేషం. కాగా ఈ నెల ఒక్క ఆదివారం రోజే రూ. 50 లక్షలకు పైగా జనం డబ్బులు కట్టినట్లు తెలుస్తోంది. విచారించిన ఎస్ఐ వందల కొద్దీ జనం డబ్బులు కడుతున్నట్లు తెలుసుకున్న స్థానిక ఎస్ఐ రవికాంత్‌రావు తన సిబ్బందితో కలిసి ఈ నెల 2న సాయంత్రం సత్య హోం నీడ్స్ వద్దకు వెళ్లి షాపు యజమానిని విచారించారు. పోలీసులు షాపు వద్దకు వచ్చి విచారించండంతో బాధితులు ఒక్క సారిగా షాపు వద్ద గుమిగూడారు. దీంతో షాపు యజమానిపై అనుమానం వచ్చి తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు పట్టుపట్టారు. దీంతో విలువైన వస్తువులు సగం ధరలకు ఎక్కడా లభించవని.. ఇలాంటి వాటిని నమ్మకూడదని.. కట్టిన డబ్బులు మీకు ఇప్పిస్తానని ఎస్ఐ రవికాంత్‌రావు జనంతో చెప్పారు. అప్పటికప్పుడే కౌంటర్లో ఉన్న డబ్బును అక్కడే ఉన్న కొంత మందికి ఇప్పించినట్లు తెలిసింది. ఉడాయించిన వ్యాపారి ఎస్ఐ రవికాంత్‌రావు వ్యాపారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించి పంపించాడు. దీంతో అప్రమత్తమైన వ్యాపారి సోమవారం నుంచి కనిపించకుండా పోయారు. బాధితులు మంగళవారం ఉదయం షాప్‌కు వెళ్లగా లేకపోవడంతో పరారైనట్లు గుర్తించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. వ్యాపారిని మీరు తీసుకువచ్చి విచారించడం వల్లే అతను పరారయ్యాడని ఎస్ఐతో గొడవకు దిగారు. దీంతో నేను అతన్ని తీసుకురాకుంటే ఇంకేంతో మంది మోసపోయోవారని.. డబ్బులు కట్టిన వారు పిర్యాదు చేస్తే విచారణ చేసి డబ్బులు ఇప్పిస్తామని బాధితులకు సర్దిచెప్పారు అయినా వినిపించుపించుకోకుండా ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకుంటాం బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు లేకుండా వ్యాపారిని స్టేషన్లో ఉంచుకోలేము. వ్యాపారి వద్ద నుంచి అతనికి సంబంధించిన ఆధారాలు అన్ని సేకరించాం. ఎంత డబ్బు కట్టారన్నది ఇంకా లెక్కకట్టలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాము. వ్యాపారి ఎక్కడున్నా సరే పట్టుకుని డబ్బులు రికవరీ చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్‌రావు, సీఐ, కొత్తకోట జనం మోసపోయారు సగం రేట్లకే వస్తువులు ఇస్తున్నామంటూ ఓ వ్యాపారి ప్రచారం చేయడంతో జనం ఎగబడి డబ్బులు కడుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. షాపు వద్దకు వెళ్లి విచారణ చేశాను. అప్పుడే కొందరికి డబ్బులు కూడా ఇప్పించాను. అక్కడే ఉంటే వ్యాపారిపై జనం తిరగబడతారని స్టేషనకు తీసుకువచ్చి విచారణ చేసి అతడి ఆధార్ కార్డు, పాన్‌కార్డు, బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నాను. బ్యాంక్ అకౌంట్ కూడా క్లోజ్ చేయించాను. – రవి కాంత్రావు, ఎస్ఐ, కొత్తకోట రూ. 70 వేలు కట్టాను ఎల్టీడీ టీవీ, దివానా, సోఫాసెట్ కోసం రూ.70 వేలు కట్టాను. వ్యాపారి 10 రోజుల్లో ఇస్తానని రశీదు ఇచ్చాడు. మాకు తెలిసిన వారికి వస్తువులు ఇచ్చినందుకే నేను నమ్మి డబ్బు కట్టాను. ఎస్ఐ షాపు వద్దకు వచ్చి విచారణ చేయడం వల్లే వ్యాపారి పరారయ్యాడు. పోలీసులు వ్యాపారి పరారు కాకుండా చూస్తే బాగుండె. – రాములు, బాధితుడు, కొత్తకోట రూ.22 వేలు కట్టాను ఇంట్లో ఉండే హోం నీడ్స్ కోసం రూ. 22 వేలు కట్టాను. అంతకుమందు మా పక్కింటి వారికి సగం రేట్లకే వస్తువులు ఇచ్చారు. పక్కింటి వారు చెప్పడం వల్లే నేను కట్టాను. నాతో పాటు మాకు తెలిసిన వారు కూడా రూ. 30 వేల వరకు కట్టారు. పోలీసులు తొందరగా అతన్ని పట్టుకొని మా డబ్బులు మాకు ఇప్పించాలి. – శివలీల, బాధితురాలు, కొత్తకోట -
దిగ్గజాలకు షాక్...అతి తక్కువ ధరకే టీవీ
సాక్షి, న్యూఢిల్లీ: టెలివిజన్ మార్కెట్లో దిగ్గజాలు శాంసంగ్,ఎల్జీ, సోనీ, షావోమీలాంటి సంస్థలకు షాక్చిచేలా బడ్జెట్ ధరలో టీవీలు అందుబాటులోకి వచ్చాయి. డీటెల్ సంస్థ ఇపుడిక టీవీల రంగంలోకి ప్రవేశించింది. ప్రపంచంలోనే అతి చవకైన ఎల్సీడీ టీవీని లాంచ్ చేసింది. డీ 1 పేరుతో తీసుకొచ్చిన 19 అంగుళాల టీవీని కేవలం రూ.3,999 లకే అందిస్తోంది. డీ1 ఎల్సీడీ టీవీని ధర మొదట్లో రూ.4,999 గా ఉన్నప్పటికీ, తాజాగా రూ.3,999కే అందిస్తున్నామని డీటెల్ ప్రకటించింది. 19 అంగుళాల ఏ ప్లస్గ్రేడ్ టీవీని కంప్యూటర్ మానిటర్ గా కూడా ఉపయోగించుకోవచ్చని, 1366x768 రిజల్యూషన్, యూఎస్బీ, హెచ్డీఎంఐ పోర్ట్‌లు , 12 వాట్స్ రెండు స్పీకర్లు ఉన్నాయని తెలిపింది. అలాగే ఈ టీవీని కొనుగోలు చేయాలనుకునేవారు డీటెల్ అధికారిక వెబ్ సైట్ గాని, మొబైల్ యాప్ గాని సంప్రదించాలి. అలాగే, డిస్ట్రిబ్యూటర్లు, పార్ట్నర్లు B2BAdda.com అనే వెబ్సైట్ లో కొనుగోలు చేయవచ్చని కంపెనీ వెల్లడిచింది. నూతన ఆవిష్కరణలు కస్టమర్లను ఉత్సాహపరుస్తాయనే విశ్వాసాన్ని డీటెల్ ఎండీ యోగేష్ భాటియా వ్యక్తం చేశారు. టీవీల రేట్లు విపరీతంగా పెరుగుతున్ననేపథ్యంలో ప్రతి ఇంటికి టీవీ అనే తమ మిషన్‌లో భాగంగా సరసమైన ధరలో టీవీలను వినియోగదారులకు అందించాలని భావిస్తున్నామన్నారు.. గ్రామీణ ప్రాంతాల్లో తమ టీవీ లక్షలాది మందిని ఆకట్టుకుంటుందన్నారు. కాగా గతంలో 299 రూపాయిలకే డీటెల్ ఒక ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. -
ఆ జైలు గదిలో సకల సౌకర్యాలు
ముంబై: గోడకు 40 అంగుళాల ఎల్సీడీ టీవీ, వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్, 6 ట్యూబ్‌లైట్లు, 3 ఫ్యాన్లు, బట్టలు ఉతుక్కోవడానికి ప్రత్యేక చోటు, గాలి వెలుతురు బాగా వచ్చేలా పెద్ద కిటికీలు, వాకింగ్ కోసం ఆవరణ, సెల్ నుంచి నేరుగా లైబ్రరీకి వెళ్లడానికి దారి. కింగ్‌ఫిషర్ అధినేత విజయ్‌మాల్యా కోసం మహారాష్ట్ర జైలు అధికారులు చేసిన ఏర్పాట్లు ఇవి. బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టి లండన్ పారిపోయిన మాల్యాను వెనక్కి రప్పించిన తరువాత ఆయన్ని ఉంచే జైలును సీబీఐ సిద్ధం చేసి, దాని వీడియోను బ్రిటన్ కోర్టుకు పంపింది. భారత్‌లో జైళ్లు శుభ్రంగా ఉండవని, అందుకే తాను వెళ్లనంటూ మాల్యా ఆరోపించడం తెల్సిందే. దీంతో మాల్యాను ఉంచబోయే జైలు గదిని వీడియో తీసి పంపించాలంటూ లండన్ కోర్టు ఆదేశించింది. మహారాష్ట్ర అధికారులు ముంబై ఆర్థర్ రోడ్ జైలులోని 12వ నంబర్ బ్యారెక్‌ను ముస్తాబు చేశారు. గదిలో ప్రతీది తెలిసేలా 8 నిమిషాల వీడియో తీసి లండన్ కోర్టుకు ఇచ్చారు. మంచంపై మెత్తటి పరుపు, శుభ్రంగా ఉతికిన దుప్పట్లు, దిండ్లు ఉంచారు. టీవీలో ఆంగ్ల, మరాఠీ చానెల్స్ వచ్చే ఏర్పాట్లు చేశారు. మాల్యాను ఉంచబోయే బ్యారెక్ లోపల, బయట రేయింబవళ్లు గార్డులు కాపలా ఉంటారు. సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది. ఇక్కడ పేరు ప్రఖ్యాతులున్న ఖైదీలను, ప్రాణహానీ ఉన్న వారిని ఉంచుతారు. -
రైల్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ..
న్యూఢిల్లీ: శతాబ్ది రైళ్లలో వేగంగా ప్రయాణించడమే కాదు... ఇకపై ఐపీఎల్ ట్వంటీ 20 మ్యాచ్‌ను ఆసక్తికరంగా వీక్షిస్తూ అది అయిపోయేలోపే గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. ఇష్టమైన సంగీతాన్ని వింటూ ప్రయాణిస్తున్న విషయాన్నీ మరచిపోవచ్చు దేశంలోనే తొలిసారిగా శతాబ్ది రైళ్లలో ప్రతీ సీటు వెనుక భాగంలో ఎల్సీడీ టీవీలను ఏర్పాటు చేయడానికి రైల్వే శాఖ సమయాత్తం అవుతోంది. వీటి ద్వారా 80 చానళ్ల వరకూ చూసే అవకాశం ఉంటుంది. అలాగే సంగీతాన్ని కూడా వినవచ్చు. ముందుగా కల్కా శతాబ్ది, లక్నో, అమృత్సర్, కాన్పూర్, అజ్మీర్, భోపాల్, డెహ్రాడూన్ శతాబ్ది రైళ్లలో ఈ సదుపాయాన్ని కల్పించనున్నట్లు రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టును ఈ నెల 29 నాటికి ఖరారు చేయనున్నట్లు వెల్లడించాయి.