leave letter
-
‘నవంబర్ 8న సెలవులో ఉంటాను.. బై’!
కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న జెన్ జీ(1995-2010 మధ్య జన్మించిన వారు) పంపిన లీవ్ లెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతంలో లీవ్ లెటర్ అంటే ‘శ్రీయుత గౌరవనీయులైన..’ అని మొదలుపెట్టేవారు. కానీ పెరుగుతున్న టెక్నాలజీకి తగ్గట్టు ఆలోచనలు మారుతున్నాయి. అతిశయోక్తులకు తావు లేకుండా చెప్పాలనుకునే విషయాన్ని సూటిగా చెప్పే మనస్తత్వాన్ని జెన్‌జీ అలవరుచుకుంటోంది. ఏ విషయాన్ని వెల్లడించాలన్నా ఈ విధానాన్ని వీరు పాటిస్తున్నారు.ఇటీవల ఓ కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్న జెన్‌జీ లీవ్ కోసం తన పైఅధికారికి లీవ్ లెటర్ సబ్మిట్ చేశాడు. ఆ మెయిల్ చూసిన అధికారి దాన్ని స్కీన్ షాట్ తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దాంతో ఇది వైరల్‌గా మారింది. తనకు లీవ్ కావాలంటూ ‘Respected Sir..’ అంటూ సంప్రదాయ పద్ధతితో లెటర్ రాయడం మొదలు పెట్టకుండా నేరుగా ‘హాయ్ సిద్దార్థ్. నేను 8 నవంబర్ 2024న సెలవులో ఉంటాను. బై’ అని మెయిల్ చేశాడు. ఇదీ చదవండి: ట్యాక్సీ మాఫియానే ప్రధాన ఓటు బ్యాంకు!ఈ మెయిల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో చర్చసాగుతోంది. చాలా మంది నెటిజన్లు ఆ జెన్‌జీ ధైర్యం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ మెయిల్ చూసి ఇంకొందరు రానున్న రోజుల్లో కార్యాలయ పనితీరు మారుబోతుందని అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో జెన్‌జీ కమ్యునికేషన్ శైలి ఎలా ఉండబోతుందో ఈ మెయిల్ ద్వారా తెలుస్తుందని ఇంకొందరు కామెంట్ చేశారు. ‘నేను ఈ లీవ్ లెటర్‌ను నా మేనేజర్‌కు పంపితే వెంటనే అతను నా ప్రవర్తనపై చర్చించడానికి హెచ్ఆర్తో సమావేశాన్ని ఏర్పాటు చేసేవాడు’ అని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. -
‘ నా భార్య అలిగింది, సెలవులు కావాలి సార్’.. ఎస్పీకి మొరపెట్టుకున్న ఇన్స్పెక్టర్
లక్నో: హోలీ సందర్భంగా ఫరూఖాబాద్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా, చాలా మంది పోలీసు సిబ్బంది సెలవులు రద్దయ్యాయి. అయితే, పోలీసు శాఖకు చెందిన ఓ ఇన్స్పెక్టర్ తన సమస్య విన్నవిస్తూ హోలీ సందర్భంగా 10 రోజుల సెలవు కోరారు. అయితే అతని సమస్య విని అధికారులు, పోలీసులు నవ్వుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నా భార్య అలిగింది సార్.. వివరాల్లోకి వెళితే.. ఫరూఖాబాద్‌లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్ హోలీ పండుగ నేపథ్యంలో సెలవు కోరుతూ జిల్లా ఎస్పీకు లేఖ రాశారు. అందులో..”హోలీ రోజున నా భార్య తన పుట్టింటికి వెళ్లాలనుకుంటోంది. గత 22 ఏళ్ల నుంచి హోలీ రోజున తన పుట్టింటికి తీసుకెళ్లమని నన్ను అడుగుతోంది. కానీ ప్రతి హోలీ పండుగకు డ్యూటీ కారణంగా తనని తీసుకెళ్లడం కుదరలేదు. ఈ సారి మాత్రం పండగకి తన ఇంటికి తీసుకువెళ్లాలంటూ పట్టుబట్టింది. దీంతో ఆమె నాపై అలిగింది.. కోపంతో రగిలిపోతుంది. ఈ కారణంగా.. నాకు సెలవులు అవసరం. సర్, నా సమస్యను అర్థం చేసుకుని పది రోజలు సెలవు ఇవ్వాలని ” రాసుంది. ఈ లేఖ పోలీసు సూపరింటెండెంట్ చేరడంతో, అతను లేఖను చదివి నవ్వాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ అభ్యర్థనను పరిశీలించి ఐదు రోజుల సెలవును ఆమోదించారు. ఆ తర్వాత ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: వీడియో: పరీక్షలో చిట్టీలు అందించేందుకు వెళ్లాడు, చివరికి పోలీసులకు చిక్కి.. -
‘నా భార్య అలిగి వెళ్లిపోయింది..3 రోజులు లీవ్ ఇవ్వండి సార్’
లక్నో: ఏదైనా పని ఉందనో, లేక ఆరోగ్యం బాగోలేదనో సెలవు తీసుకుంటారు ఎవరైనా. కానీ, తన భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని, బుజ్జగించి తిరిగి తీసుకొచ్చేందుకు మూడు రోజులు సెలవు కావాలని ఓ ప్రభుత్వ ఉద్యోగి కోరాడు. తన పరిస్థితిని వివరిస్తూ ఉన్నతాధికారులకు లేఖ రాశాడు. ప్రస్తుతం ఆ లీవ్ లెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో జరిగింది. ప్రేమ్ నగర్ బ్లాక్ అభివృద్ధి అధికారి (బీడీఓ)కి మంగళవారం లేఖ రాశారు శాంషద్ అహ్మెద్. తనకు సెలవు ఎంత ముఖ్యమో వివరించారు. తన భార్యతో గొడవ జరిగిందని, దాంతో పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. ఆమెను బుజ్జగించి తిరిగి తీసుకురావాలనుకుంటున్నట్లు తెలిపారు అహ్మెద్. ‘నేను మానసికంగా బాధపడుతున్నా. ఆమెను బుజ్జగించి తీసుకొచ్చేందుకు వారి ఊరికి వెళ్లాలి. అందుకోసం ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు అత్యవసర సెలవు, నగరం విడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను.’అని హిందీలో లేఖ రాశారు అహ్మెద్. క్లర్క్ అభ్యర్థనను బీడీఓ అధికారి ఆమోదించారు. Kanpur man seeks leave to make amends with wife, letter goes #viral pic.twitter.com/4RmVvL2JQh — Aaquil Jameel (@AaquilJameel) August 3, 2022 ఇదీ చదవండి: బాధలో ఉన్న వ్యక్తిని తల్లిలా ఓదార్చిన కోతి.. నెటిజన్లు ఫిదా! -
అనగనగా ఒక పోలీసు! ఆ కథ విందామా..
చరిత్రలో పోలీసుకు ఓ ప్రత్యేక స్థానముంది. గ్రామాల్లో శాంతిభద్రతలకు సంబంధించి చిన్న సంఘటన జరిగినా ముందుగానే గుర్తుకు వచ్చేది పోలీసు. అందులోనూ చరిత్ర పుటల్లో పాతతరం పోలీసులకు ఉన్న గుర్తింపే వేరు. అక్షరాస్యత అంతంత మాత్రంగానే ఉన్న పల్లెల్లో అప్పట్లో గొడవలు, ఘర్షణలు అధికం. నాడు ఫోన్లు కూడా లేని పరిస్థితుల్లో నేరుగా స్టేషన్‌కు వెళ్లి తమ ఆవేదనను పోలీసులకు చెప్పుకునేవారు. అలాంటి పోలీసులకు సంబంధించి 1900 తర్వాత లభించిన కొన్ని చారిత్రక లేఖలను.. ఎఫ్ఐఆర్.. కానిస్టేబుళ్లు ఎస్పీకి పెట్టుకున్న లేఖలు.. ఆనాడు పనిచేసిన అధికారుల వివరాలతో కూడిన పాతతరం పత్రాలను జిల్లా పోలీసుశాఖ భద్రపరిచింది. సాక్షి కడప: జిల్లాలో కొన్ని గ్రామాలకు సంబంధించి చాలా సంవత్సరాల క్రితం పోలీసులు రాసిన పత్రాలతోపాటు గ్రామస్తుల నుంచి వచ్చిన లేఖలను పోలీసుశాఖ భద్రపరిచింది. అంతేకాకుండా అనేక రకాలైన గ్రామాల సమాచారం మొదలుకొని జిల్లా యంత్రాంగం అమలు చేసిన నిబంధనల పత్రాలు పాత బడి చినిగిపోతున్న నేపథ్యంలో భద్రతకు చర్యలు చేపట్టారు. ప్రధానంగా పాతతరం లేఖలకు ల్యామినేషన్ చేయించి వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తున్నారు. ఒక ప్రత్యేక గదిలో వాటినన్నింటినీ ప్రస్తుతానికి జాగ్రత్తగా ఉంచారు. నాడు పోలీసు డ్రస్, టోపీ, బెల్ట్, షూ ఎలా ఉండేది....ప్రస్తుతం ఎలా మార్పులు ఉన్నాయి.. హోంగార్డు మొదలుకొని డీజీపీ వరకు బొమ్మలను తయారు చేసి ఇతరులకు సులభ రీతిలో అర్థమయ్యేలా అమర్చారు. నాటి ఆనవాళ్లు: ఎప్పుడో బ్రిటీషు ప్రభుత్వం నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయం వద్ద 1900 కాలంలో దిగిన పోలీసుల ఫొటోలతోపాటు రోషన్ అనే ఐపీఎస్ అధికారి ఫొటోను కూడా పోలీసులు సేకరించారు. అంతేకాకుండా 1955లో డీఎస్పీ వేసుకునే షర్టు, వాడిన టేబుల్, ఇన్లాండ్ లెటర్లు, 1938లో ముని వెంకటప్ప అనే కానిస్టేబుల్ సాధించిన కాండక్ట్ సరి్టఫికెట్, విలేజ్ హిస్టరీ సీడ్స్, 1939 నాటి స్టేషన్ రైటర్ వాడిన చెక్క పెట్టె, 1950 నాటి సీళ్లు, 1949 నాటి వాచ్ తదితర సామగ్రిని భద్రపరిచారు. ఇవన్నీ ప్రస్తుతం చరిత్రలో పోలీసుకు సాక్ష్యంగా నిలబడ్డాయి. కొత్త డీపీఓ లైబ్రరీలో భద్రపరుస్తాం! జిల్లా కేంద్రమైన కడపలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీసు కార్యాలయంలో లైబ్రరీ ఏర్పాటు చేసి పాత తరం నాటి విలువైన వస్తువులను భద్ర పరుస్తాం. చరిత్రలో ఆనాటి వీరులను గుర్తుంచుకుంటాం. ఎన్నో ఏళ్ల కిందట తొలినాళ్లలో రాసిన లేఖలతోపాటు ఇతర ఫొటోలను తీపి గుర్తుగా భద్రపరుస్తాం. భావితరాలకు పోలీసు అంటే ఎలా ఉండేవారో తెలిసేలా తగిన చర్యలు తీసుకుంటున్నాం. పాతకాలం నాటి ప్రతి వస్తువు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ భద్రపరుస్తున్నాం. త్వరలోనే వాటిని లైబ్రరీకి తరలించి ప్రత్యేక గదిలో అద్భుతంగా తీర్చిదిద్దుతాం. – కేకేఎన్ అన్బురాజన్, జిల్లా ఎస్పీ -
ఆ పోలీస్‌కు భార్యంటే భయం! అందుకే..
భోపాల్ : సెలవు కోసం ఓ పోలీస్ కానిస్టేబుల్ రాసిన లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తన భార్య తమ్ముడి పెళ్లికి వెళ్లడానికి అనుమతి కోరుతూ రాసిన ఆ లేఖ ఓ వైపు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంటే.. మరోవైపు ఉన్నతాధికారులకు ఆగ్రహం తెప్పించింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన దిలీప్ కుమార్ అహిర్వార్ అనే పోలీస్ కానిస్టేబుల్ తన భార్య తమ్ముడి పెళ్లికి వెళ్లటానికి అనుమతి కోరుతూ డిసెంబర్ 7వ తేదీన డీఐజీకి ఓ లేఖ రాశారు. డిసెంబర్ 11వ తేదీనుంచి పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు మొదలవుతాయని అందుకోసం 5 రోజులు సెలవు కావాలని కోరాడు. ‘నా తమ్ముడి పెళ్లికి రాకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి’ అని తన భార్య హెచ్చరించిందని, అడిగినన్ని రోజులు సెలవులు మంజూరు చేసి భార్య ఆగ్రహంనుంచి కాపాడాలని వేడుకున్నాడు. ( భర్తపై ఎనలేని ప్రేమ.. 41 ఏళ్లుగా) భార్య హెచ్చరికను ఆ లేఖలో హైలెట్ చేశాడు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు కానిస్టేబుల్ లేఖపై సీరియస్ అయ్యారు. అతడిపై చర్యలు తీసుకోవటానికి సిద్ధమయ్యారు. దీనిపై ఓ సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ అతడు ప్రత్యేకమైన కారణాలు చెప్పి గత కొన్ని నెలలుగా సెలవులు తీసుకుంటూనే ఉన్నాడు. 11 నెలల్లో దాదాపు 55 సెలవులు తీసుకున్నాడు’’ అని చెప్పారు. ( 8 ఏళ్లుగా డేటింగ్, పెళ్లి కావాలంటూ కోర్టుకు..) -
అశ్వత్థామరెడ్డికి చుక్కెదురు...
సాక్షి, హైదరాబాద్: సమ్మె ముగిసిన అనంతరం విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి.. ఆ వెంటనే 6 నెలల కాలానికి సెలవులు కావాలంటూ దాఖలు చేసిన అభ్యర్థనను ఆర్టీసీ తిరస్కరించింది. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున, సంస్థ ఉన్నతికి సిబ్బంది అంతా కలసి శ్రమించాల్సిన అవసరం ఉందని, ఈ సమయంలో సెలవు మంజూరు చేయలేమంటూ అధికారులు అప్పట్లోనే స్పష్టం చేశారు. తాజాగా ఆయన మరోసారి ఎక్స్ట్రా ఆర్టనరీ లీవ్ (ఈఓఎల్) కోసం దరఖాస్తు చేయగా రెండోసారి తిరస్కరించారు. సంస్థ కష్టాల్లో ఉన్నందున అన్ని రోజులు సెలవు మంజూరు చేయలేమని, వెంటనే విధుల్లో చేరాలని అధికారులు సూచించారు. చదవండి: కార్మిక సంఘాల ఏర్పాటు ప్రజాస్వామిక హక్కు: అశ్వత్థామరెడ్డి సీఎం ఆదేశాలు అమలు కావట్లేదు : అశ్వత్థామ రెడ్డి దీర్ఘకాలిక సెలవులో అశ్వత్థామరెడ్డి -
నేను చచ్చిపోయాను.. సెలవు కావాలి!
సాక్షి, లక్నో : సెలవు పెట్టడానికి ఓ ఎనిమిదవ తరగతి విద్యార్థి రాసిన కారణం తెలిస్తే మన కళ్లు పెద్దవికాక మానవు. తన చావును కారణంగా చూపి సెలవు తీసుకోవటం, దానికి స్కూలు ప్రిన్సిపల్ ఆమోదం తెలపడంతో ఈ ఘటన వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కాన్పూర్‌కు చెందిన ఓ ఎనిమిద తరగతి విద్యార్థి సెలవు కోసం చీటీ రాసి ప్రిన్సిపల్‌ను సంప్రదించాడు. ఆ సెలవు చీటీలో ‘‘ అయ్యా! నేను ఈ రోజు ఉదయం(ఆగస్టు 20, 2019) 10గంటలకు చనిపోయాను. కావునా, నేను తొందరగా ఇంటికి వెళ్లాలి. ఇందుకోసం అర్థరోజు సెలవు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని రాశాడు. విద్యార్థి అందులో ఏం రాశాడో చదవకుండానే ప్రిన్సిపల్ సంతకం చేసి పంపించేశాడు. ఓ పిచ్చి కారణానికి సెలవు దొరకటంతో సదరు విద్యార్థి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే కొద్దిరోజులు ఈ విషయం గురించి మాట్లాడకుండా ఉన్న విద్యార్థి! ఆ తర్వాత తన మిత్రులతో సెలవు చీటీ సంగతులు పంచుకున్నాడు. దీంతో ఆనతికాలంలో పాఠశాల మొత్తం ఈ విషయం పాకిపోయింది. అతడు రాసిన సెలవు చీటీ సోషల్ మీడియాలో సైతం వైరలై విషయం పాఠశాల యాజమాన్యానికి తెలిసింది. అయితే దీనిపై స్కూలు యాజమాన్యం స్పందించలేదు. కానీ, తమ స్కూలు ప్రిన్సిపల్‌కు సెలవు చీటీల్లో ఏముందో పూర్తిగా చదివే అలవాటు లేదని కొందరు ఉపాధ్యాయులు అతడ్ని వెనకేసుకు రావటం గమనార్హం. -
730 రోజులు లీవ్ అడిగిన ఉద్యోగి
లాహోర్: ఓ ఉద్యోగి రాసిన లీవ్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎందుకంటే సదురు ఉద్యోగి లీవ్ అడిగింది ఏ పది రోజులో, ఇరవై రోజులో కాదు.. ఏకంగా 730 రోజులు(అంటే రెండేళ్లు). దీనికి అతడు చెప్పిన కారణం కూడా ఆశ్చర్యకరంగానే ఉంది.. అతడు పనిచేస్తున్న శాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి ప్రవర్తన నచ్చకపోవడం వల్లనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్ రైల్వేస్‌లో మహమ్మద్ హనీఫ్ గుల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన షేక్ రషీద్ అహ్మద్‌పై కోపంతో హనీఫ్ 730 రోజుల సెలవు కోసం దరఖాస్తు చేశారు. అంతేకాకుండా తనకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కోరారు. రషీద్‌కు వృత్తి పట్ల నిబద్ధత లేదని, ఆయనకు రైల్వే మంత్రికి కావాల్సిన నైపుణ్యాలు లేవని, పాక్ ప్రజలకు సేవ చేసే వ్యక్తిగా తాను ఆయనతో కలిసి పనిచేయలేనని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆగస్టు 26వ తేదీన ఆయన ఈ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు హనీఫ్‌కు మద్దతుగా, మరికొందరు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. కాగా హనీఫ్ లీవ్ లెటర్‌కు ఆమోదం లభించలేదని తెలుస్తోంది. సోమవారం హనీఫ్‌ను చీఫ్ కమర్షియల్ మేనేజర్ పదవి నుంచి తొలగించి.. ఆ స్థానంలో అఘా వాసీమ్‌ను నియమించారు. హనీఫ్ సెలవు కోసం దరఖాస్తు చేసే ముందు రషీద్ ఆధ్వర్యంలో రైల్వే శాఖ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైల్వే శాఖ పనితీరుపై ఆయన అధికారులను మందలించినట్టు సమాచారం. -
’లాంగ్ లీవ్’ ఎంపీలు...!
అనుమతి లేకుండా ఆరునెలల పాటు వరసగా పార్లమెంట్‌కు గైర్హాజర్ అయితే ఆ ఎంపీ లేదా ఎంపీలపై అనర్హత వేటు వీలు భారత రాజ్యాంగం కల్పించింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం సభకు హాజరయ్యేందుకు పరిస్థితులు అనుకూలించని పార్లమెంట్ సభ్యులు (లోక్‌సభ, రాజ్యసభ)సెలవు చీటీలు సమర్పిస్తున్నారు. ప్రస్తుత 16వ లోక్‌సభలో ఈ ఏడాది మార్చి వరకు 41 మంది సభ్యులు ఈ విధంగా 60 లీవ్‌లెటర్లు అందజేశారు. ఇప్పటివరకు ఈ లీవ్ లెటర్లన్నీ కలిపితే వీరంతా 1800 రోజుల కంటే ఎక్కువగానే సెలవులు కోరినట్టు తెలుస్తోంది. ఈ నాలుగేళ్లలో మొత్తం కలిపి 300 రోజుల వరకు లోక్‌సభ సమావేశమైంది. ఎంపీల సగటు అటెండెన్స్ శాతం 80 శాతం వరకు ఉన్నట్టు పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రిసెర్చ్ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. అత్యధికంగా బీజేపీ సభ్యులు.. 13 రాజకీయపార్టీలకు చెందిన ఎంపీలు సెలవు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. మొత్తం 60 లీవ్ లెటర్లలో అత్యధికంగా బీజేపీ నుంచి 21, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 13, బీజేడీ నుంచి 7, కాంగ్రెస్ నుంచి 4, ఎన్సీపీ, వైఎస్సార్సీపీ (టీడీపీలో చేరిన ఎస్పీవై రెడ్డితో సహా)ల నుంచి ముగ్గురేసి చొప్పున, పీడీపీ, టీడీపీల నుంచి ఇద్దరేసి చొప్పున, పీఎంకే, ఎన్పీఎఫ్,ఎల్ఐపీ, జేఎంఎం, సీపీఎంల నుంచి ఒక్కరి చొప్పురన దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. అత్యధికులు అనారోగ్య కారణంగా... మొత్తం 60 దరఖాస్తుల్లో 32 అనారోగ్యాన్ని కారణంగా చూపారు. వారిలో ఓ బీజేపీ ఎంపీ మాత్రమే తన కుటుంబంలో అనారోగ్యంగా ఉన్న వారి కోసం సెలవు కావాలని కోరగా, మిగతా వారంతా కూడా తమ అనారోగ్యానికే లీవ్ దరఖాస్తు చేసుకున్నారు. తమ నియోజకవర్గంలో ఎన్నికలను పది దరఖాస్తుల్లో కారణంగా చూపారు.నియోజకవర్గ సంబంధిత పనుల కారణంగా సెలవు ఇవ్వాలంటూ మూడు లెటర్లు వచ్చాయి. విదేశాల్లో పర్యటనను గురించి మూడు దరఖాస్తులో్ల ప్రస్తావించారు. వారిలో బీజేపీ ఎంపీ, సినీనటి హేమామాలిని ఒకరు. విదేశాల్లో బోధనా విధుల కోసం సెలవు కావాలని ఓ తృణమూల్ ఎంపీ కోరాడు. విదేశీ పర్యటన, కుటుంబంలో వివాహం, నియోజకవర్గంలో సహాయకార్యక్రమాలు ఇలా అనేక కారణాలను మరో తృణమూల్ ఎంపీ పొందుపరిచారు. కుటుంబ సభ్యుల మరణాన్ని ఇద్దరు ఎంపీలు కారణంగా చూపారు. అనారోగ్యకారణంగా సెలవు కోసం దరఖాస్తు చేసుకున్న బీజేపీ సభ్యులు వినోద్ ఖన్నా, చాంద్‌నాథ్ యోగి, తృణమూల్ ఎంపీ కపిల్‌కుమార్ ఠాకూర్ కన్నుమూశారు. ఎంపీల సెలవు దరఖాస్తుల్లో నాలుగింట్లో మాత్రమే సభ్యులు కోరినన్నీ సెలవులు కమిటీ సిఫార్సు చేయలేదు. కాంగ్రెస్ ఎంపీ అమరీందర్‌సింగ్ (ప్రస్తుత పంజాబ్ సీఎం) కు 59 రోజుల సెలవు సిఫార్సు చేసి, కోరుకున్న మిగతా రోజులకు మరోసారి దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించింది. మరో ఎంపీ ఎస్పీవై రెడ్డి దరఖాస్తు విషయంలోనూ ఇదే జరిగింది. జైల్లో ఉన్న బీజేడీ ఎంపీ రామచంద్ర హాంద్సా కు 67 రోజుల లీవ్ తిరస్కరించింది. ఈ ఎంపీనే అత్యధికంగా 299 రోజుల సెలవు కోసం దరఖాస్తు చేసుకోగా, బీజేపీ ఎంపీ చాంద్‌నాథ్ 164 రోజులు, మరో ఏడుగురు ఎంపీలు 50 రోజులకు పైగా లీవ్ కోసం లెటర్ పెట్టుకున్నారు. -
సార్.. లీవు కావాలి..!
అనంతపురం సిటీ: మరికొద్ది నిమిషాల్లో జెడ్పీ స్థాయీ సంఘ సమావేశం జరగనుండగా... జిల్లా విద్యాశాఖాధికారి జనార్దనాచార్యులు జెడ్పీ చైర్మన్ నాగరాజు చాంబర్‌కు వచ్చారు.. తనకు లీవు కావాలని కోరారు. ఈ మాట చెప్పేందుకే ఇంత దూరం వచ్చానన్నారు. అయితే చైర్మన్ నాగరాజు మాత్రం కుదరదని తేల్చిచెప్పారు. ‘‘ఇప్పుడే రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వారు నాముందే మీకు వినతి పత్రం ఇచ్చి సమస్యలు ఏకరువు పెట్టారు.. ఇక సమావేశంలో సభ్యులు ఎన్ని సమస్యలు లేవనెత్తుతారో..? వాటన్నింటికీ సమాధానం చెప్పేది ఎవరన్నారు. అందువల్ల సెలవు ఇవ్వడం కుదరదన్నారు. జెడ్పీలో జరిగే సమావే?శాలకు చాలా మంది జిల్లా అధికారులు గైర్హాజరవుతుండగా.. ప్రతి శాఖ అధికారీ హాజరయ్యేలా చూడాలని తానే కలెక్టర్‌ను కోరానన్నారు. అయినా ఏదైనా వ్యక్తిగత ఇబ్బంది ఉంటే రెండు రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని..ఇలా ఇపుడొచ్చి సెలవు అడగడం సరికాదన్నారు. దీంతో డీఈఓ తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. -
సచిన్‌కు సెలవు.. రాజ్యసభలో గందరగోళం
రాజ్యసభ ప్రస్తుత సమావేశాలు మొత్తంలో ఒక్క రోజు కూడా హాజరు కాకుండా ఉండేందుకు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు సెలవు మంజూరు చేశారు. ఈ విషయం రాజ్యసభలో తీవ్ర గందరగోళానికి కారణమైంది. దాదాపు ఈ ఏడాది మొత్తంలో ఒక్కసారి కూడా టెండూల్కర్ సభకు హాజరు కాకపోవడంపై ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. దాంతో, తనకు సెలవు మంజూరుచేయాల్సిందిగా సచిన్ ఓ లేఖ రాశాడు. తన వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాల వల్ల, కుటుంబ అవసరాల వల్ల సభకు రాలేకపోతున్నానని, అందువల్ల సెలవు ఇవ్వాలని అందులో కోరినట్లు డిప్యూటీ ఛైర్మన్ పి.జె.కురియన్ చెప్పారు. ఆయనీ సెలవుచీటీని చదివి వినిపించినప్పుడు సభలో కొంతమంది సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసి, గందరగోళం సృష్టించారు. ఆయన ఢిల్లీకి వచ్చారు, విజ్ఞాన భవన్‌కు వెళ్లారుగానీ, సభకు రాలేదని, చాలాసార్లు ఇలాగే ఢిల్లీ వచ్చి వెళ్తున్నారని.. అంటే ఆయనకు సభ అంటే గౌరవం లేదని సమాజ్‌వాదీ సభ్యుడు నరేష్ అగర్వాల్ అన్నారు. అయితే, సెలవుచీటీలపై సభ్యులు చర్చ జరపకూడదని కురియన్ స్పష్టం చేశారు. సభ్యులు ఎందుకు రావట్లేదన్న విషయం చూడాల్సింది అధ్యక్షులే గానీ సభ్యులు కారని ఆయన అన్నారు. అనంతరం, సచిన్‌కు సెలవు మంజూరైంది.