సచిన్కు సెలవు.. రాజ్యసభలో గందరగోళం
రాజ్యసభ ప్రస్తుత సమావేశాలు మొత్తంలో ఒక్క రోజు కూడా హాజరు కాకుండా ఉండేందుకు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్కు సెలవు మంజూరు చేశారు. ఈ విషయం రాజ్యసభలో తీవ్ర గందరగోళానికి కారణమైంది. దాదాపు ఈ ఏడాది మొత్తంలో ఒక్కసారి కూడా టెండూల్కర్ సభకు హాజరు కాకపోవడంపై ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. దాంతో, తనకు సెలవు మంజూరుచేయాల్సిందిగా సచిన్ ఓ లేఖ రాశాడు. తన వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాల వల్ల, కుటుంబ అవసరాల వల్ల సభకు రాలేకపోతున్నానని, అందువల్ల సెలవు ఇవ్వాలని అందులో కోరినట్లు డిప్యూటీ ఛైర్మన్ పి.జె.కురియన్ చెప్పారు.
ఆయనీ సెలవుచీటీని చదివి వినిపించినప్పుడు సభలో కొంతమంది సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసి, గందరగోళం సృష్టించారు. ఆయన ఢిల్లీకి వచ్చారు, విజ్ఞాన భవన్కు వెళ్లారుగానీ, సభకు రాలేదని, చాలాసార్లు ఇలాగే ఢిల్లీ వచ్చి వెళ్తున్నారని.. అంటే ఆయనకు సభ అంటే గౌరవం లేదని సమాజ్వాదీ సభ్యుడు నరేష్ అగర్వాల్ అన్నారు. అయితే, సెలవుచీటీలపై సభ్యులు చర్చ జరపకూడదని కురియన్ స్పష్టం చేశారు. సభ్యులు ఎందుకు రావట్లేదన్న విషయం చూడాల్సింది అధ్యక్షులే గానీ సభ్యులు కారని ఆయన అన్నారు. అనంతరం, సచిన్కు సెలవు మంజూరైంది.