న్యూఢిల్లీ: క్రికెట్, రాజకీయాలు ఒక్కటి కాదని క్రికెట్ దిగ్గజం సచిన్‌కు తెలిసిపోయింది. క్రికె ట్‌లో ఎన్నో ఇన్నింగ్స్‌ను విజయవంతంగా పూర్తి చేసి, ప్రత్యర్థుల గుండెల్లో ‘పరుగులు’ పెట్టించిన సచిన్ టెండూల్కర్‌కు పార్లమెంటులో తొలిసారిగా చేదు అనుభవం ఎదురైంది. రాజ్యసభలో గందరగోళం కారణంగా ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించలేకపోయారు. మాజీ ప్రధాని మన్మోహన్‌పై ప్రధాని మోదీ చేసిన ‘కుట్ర వ్యాఖ్యల’పై వరుసగా నాలుగో రోజూ కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగించింది. దీంతో పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.
రాజ్యసభలో..: గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కాగా చైర్మన్ వెంక య్య స్వల్ప వ్యవధి చర్చలో భాగంగా ఎంపీ సచిన్‌ను మాట్లాడాలని కోరారు. క్రీడా హక్కు, దేశంలో క్రీడల భవిష్యత్తు అంశంపై ఆయన మాట్లాడాల్సి ఉంది. సచిన్ మాట్లాడేందుకు లేవగానే ‘ప్రజలను తప్పు దోవపట్టించటం మానండి’ అంటూ కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. సచిన్ మొదటి ప్రసంగాన్ని వినాలని కాంగ్రెస్ సభ్యులను చైర్మన్ కోరారు. సచిన్‌ను మాట్లాడాలని వెంకయ్య కోరినా నినాదాల హోరుతో ఆయన నిస్సహాయుడిగా ఉండిపోయారు. ఇలాంటి సభా దృశ్యాలను ప్రజలు టీవీల్లో చూడటానికి ఇష్టపడరని వ్యాఖ్యానిస్తూ వెంకయ్య సభను శుక్రవారానికి వాయిదా వేశారు. అంతకుమునుపు ఉదయం సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు నిరసనలు చేపట్టారు. ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకం గా నినాదాలు చేయటంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య సభను వాయిదా వేశారు. వాస్తవానికి రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధాని మోదీ హాజరు కావాల్సి ఉంది. అదేవిధంగా ఉదయం సభలో గంట సేపు అంతరాయం ఎదురైతే, మధ్యాహ్నం వాయిదా వేయటం సంప్రదాయం. కానీ, చైర్మన్ వెంకయ్య 2 గంటలకు వాయిదా వేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
లోక్‌సభ: ఉదయం ప్రశ్నోత్తరాలతో కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. అర్ధగంట గడిచాక కాంగ్రెస్ సభ్యులు నినాదాలు ప్రారంభించారు. మోదీ వ్యాఖ్యలపై చర్చకు అవకాశమివ్వాలని డిమాండ్ చేయగా స్పీకర్ సుమిత్ర నిరాకరించారు. దీంతో జ్యోతిరాదిత్య సింధియాతోపాటు సుమారు 20 మంది సభ్యులు న్యాయం ఎక్కడుందంటూ వెల్‌లోకి దూసుకు వచ్చి, షేమ్, షేమ్ అంటూ కేకలు వేశారు. అధికార పార్టీ నేతలు మనస్సులో మాట(మన్‌కీబాత్) మాత్రమే వింటారా? మేం చెప్పేది వినిపించుకోరా? ప్రజల మాట వినరా? అంటూ జ్యోతిరాదిత్య ప్రశ్నించారు. దీనిపై ఆ పార్టీ అగ్రనేత సోనియా బల్ల చరిచి హర్షం ప్రకటించారు. తర్వాత జీరో అవర్‌లోనూ నిరసనలు కొనసాగాయి. స్పీకర్ పట్టించుకోకపోవటంతో సభ నుంచి వాకౌట్ చేశారు. మధ్యాహ్నం తిరిగి సభ ప్రారంభం కాగా కాగ్ మాజీ చైర్మన్ వినోద్ రాయ్ తన పదవులన్నిటికీ రాజీనామా చేయాలని, అవార్డులను వాపసు చేయాలంటూ డిమాండ్ చేశాయి. 2జీ స్కాం కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో సభ్యులు మాట్లాడారు. రాయ్ అడ్డగోలుగా ఇచ్చిన కాగ్ నివేదికతో దేశ ప్రతిష్ట మంటగలిసిందని కాంగ్రెస్ నేత మొయిలీ తదితరులు డిమాండ్ చేశారు. ట్రిపుల్ తలాక్ విధానంపై రూపొందించిన ‘ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ’ బిల్లును కేంద్రం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. కేంద్ర మంత్రివర్గ ఉప సంఘం రూపొందించిన ఈ బిల్లు ప్రకారం.. అకస్మాత్తుగా మూడుసార్లు తలాక్ (తలాక్–ఇ–బిద్దత్)అని చెప్పటం చట్టవి రుద్ధం.
లోక్‌సభలో న్యాయమూర్తుల వేతనాల పెంపు బిల్లు
రెండింతలు కానున్న సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాల పెంపు బిల్లును గురువారం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే వీరి వేతనాలు భారీగా పెరగనున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనం నెలకు రూ. 1 లక్ష నుంచి 2.80 లక్షలకు పెరుగుతుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తులు ప్రస్తుతం అందుకుంటున్న వేతనం నెలకు రూ.90 వేల నుంచి రూ. 2.50 లక్షలకు పెరగనుంది. ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తుల వేతనం నెలకు రూ.80 వేలు ఉండగా బిల్లు ఆమోదం తర్వాత నెలకు రూ.2.25 లక్షలు కానుంది. ఈ వేతనాల పెంపును అఖిల భారత సర్వీసు అధికారులకు సూచించిన ఏడో వేతన కమిషన్ ప్రతిపాదనల మేరకు 2016 జనవరి1 నుంచి అమలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment