'సచిన్, రేఖ రాజీనామా చేయాలి'
న్యూఢిల్లీ: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి రేఖ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ డిమాండ్ చేశారు. గురువారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. సచిన్, రేఖ రాజ్యసభకు హాజరు కావాలని లేకుంటే వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. వీరిద్దరూ వరుసగా రాజ్యసభ సమావేశాలకు గైర్హాజరవడాన్ని అగర్వాల్ సభలో ప్రస్తావించారు. రాజ్యసభ సమావేశాలు ముగుస్తున్నాయని, సభ్యులెవరూ ఇంతరవకు సభలో వీరిని చూడలేదన్నారు. వారికి సభకు రావాలనే ఆసక్తి లేదనే విషయం తేటతెల్లమైందని వ్యాఖ్యానించారు.
ఎంపీ పదవులపై ఆసక్తి లేకుంటే రాజీనామా చేయడం ఉత్తమమని అగర్వాల్ సలహా ఇచ్చారు. గత కొద్ది రోజులుగా సచిన్, రేఖ రాజ్యసభకు హాజరవడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. సచిన్, రేఖతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనభర్చిన 12 మంది రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. వీరిలో బాక్సర్ మేరికోమ్, జర్నలిస్టు స్వప్నదాస్ గుప్తా, వ్యాపారవేత్త అనులు ఉన్నారు. అగర్వాల్ వ్యాఖ్యలపై సచిన్ ఎలా స్సందిస్తాడో చూడాలి.