సచిన్.. రేఖ గాయబ్!!
అవును.. సచిన్ టెండూల్కర్, అలనాటి సినీనటి రేఖ ఇద్దరూ కనిపించడం లేదు. రాజ్యసభ సభ్యులకు వీళ్లిద్దరూ ఈ ఏడాది మొత్తం ఎక్కడా కనిపించలేదట. వాళ్లిద్దరూ కూడా 2012 సంవత్సరంలోనే రాజ్యసభ సభ్యులయ్యారు. అయితే, 2014 సంవత్సరం మొదలైన తర్వాత ఒక్కసారి కూడా వాళ్లిద్దరూ సభకు హాజరు కాలేదు. వాళ్లు 60 రోజులకు పైగా సభకు హాజరు కాకపోతే వాళ్ల సీట్లను ఖాళీ చేయించవచ్చని సీపీఐ సభ్యుడు పి.రాజీవ్ సభలో ప్రస్తావించారు. గత సంవత్సరం క్రికెట్ నుంచి కూడా రిటైరైపోయిన సచిన్ టెండూల్కర్ కేవలం మూడు రోజులే సభకు వస్తే, సీనియర్ నటీమణి రేఖ ఏడు రోజులు మాత్రమే ముఖం చూపించారట.
అయితే, సచిన్ ఇప్పటికి 40 రోజులు మాత్రమే గైర్హాజరు అయ్యారని, రేఖ అంతకంటే తక్కువేనని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ చెప్పారు. అందువల్ల రాజ్యాంగ ఉల్లంఘన ఏమీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటులో సెలబ్రిటీలు ఎక్కువ అయిపోవడంతో వాళ్లు అసలు సభకు రావట్లేదన్న విమర్శ బాగా తీవ్రంగా వినిపించింది. ఇలా గైర్హాజరు అవుతున్నవారిలో బీజేపీ నాయకులు, నటులు హేమమాలిని, శత్రుఘ్న సిన్హా కూడా ఉన్నారు.