Lepakshi Utsav
-
పర్యాటకంతోనే అధిక ఆదాయం
‘అనంత’లో టూరిజం సర్క్యూట్ కు రూ.25 కోట్లు లేపాక్షి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘‘వ్యవసాయం, పరిశ్రమల కంటే ఎక్కువ ఆదాయం పర్యాటక రంగం ద్వారా వస్తుంది. అందుకే రాష్ట్రంలో పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షిలో శనివారం ‘లేపాక్షి ఉత్సవాలు’ ప్రారంభమయ్యాయి. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రజలకు మానసిక ఆనందం, ఆహ్లాదం అవసరం కాబట్టి ఇకపై పర్యాటకంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తీసుకుంటామన్నారు. హంద్రీ-నీవాను ఏడాదిలో పూర్తి చేస్తామని తెలిపారు. అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని వెల్లడించారు. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. లేపాక్షి ఉత్సవాలను ప్రతిఏటా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. లేపాక్షిని ఆదర్శ పట్టణంగా అభివృద్ధి చేస్తామన్నారు. లేపాక్షితో పాటు హిందూపురం అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాన్నారు. టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తాం రాష్ట్రంలో కూచిపూడి నాట్యారామం ఏర్పాటుకు రూ.100 కోట్లు కేటాయించామని చంద్రబాబు పేర్కొన్నారు. లేపాక్షి, పెనుకొండ, పుట్టపర్తి, తిమ్మమ్మ మర్రిమాను. నిమ్మలకుంట, ధర్మవరంలను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ‘‘ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నా, ఎన్నో విజయోత్సవ సభల్లో పాల్గొన్నా... కానీ లేపాక్షి ఉత్సవాల్లో కలిగిన సంతోషం ఎప్పుడూ లేదు’’ అని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కొడెల శివప్రసాదరావు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, సినీనటులు జయసుధ, కన్నడ సినీ నటుడు శివరాజ్‌కుమార్, చలపతిరావు, జయప్రకాశ్‌రెడ్డి, అశోక్‌కుమార్, మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణతోపాటు మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత తదితరులు పాల్గొన్నారు. -
లేపాక్షి ఉత్సవాలను ప్రారంభించిన సీఎం
అనంతపురం : అనంతపురం జిల్లా హిందూపురంలో లేపాక్షి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల ప్రారంభ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. భక్తులు పెద్ద ఎత్తున శ్రీ వీరభద్ర స్వామివారిని దర్శించుకుంటున్నారు. -
మంత్రి చందూలాల్ కు బాలకృష్ణ ఆహ్వానం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో జరుగనున్న లేపాక్షి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మంగళవారం తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్‌ను కలిశారు. సచివాలయంలోని మంత్రి చాంబర్‌కు విచ్చేసిన ఆయన ఈ సందర్భంగా చందూలాల్‌ను లేపాక్షి ఉత్సవాలకు హాజరవ్వాలంటూ స్వయంగా అధికారిక ఆహ్వాన పత్రాన్నిఅందజేశారు. ఈ మేరకు బాలకృష్ణ మాట్లాడుతూ ... రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న లేపాక్షి ఉత్సవాలకు పర్యాటక శాఖ మంత్రిని ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. లేపాక్షిని అతి పెద్ద పర్యాటక ప్రాంతంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ నెల 27,28 తేదీల్లో రెండు రోజుల పాటు జరుగనున్న లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నం. అందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవానికి పొరుగు రాష్ట్రాల మంత్రులు కూడా హాజరువుతున్నారు అని పేర్కొన్నారు. బాలకృష్ణ ఆహ్వానాన్ని అందుకున్న చందూలాల్ స్పందిస్తూ.... బాలకృష్ణ స్వయంగా వచ్చి ఆహ్వానించడం చాలా సంతోషం. తప్పకుండా లేపాక్షి ఉత్సవాలకు హాజరవుతానని హామీ ఇచ్చారు. అనంతరం అరగంట పాటు ఉత్సవాలకు సంబంధించిన పలు విషయాలను చర్చించుకున్నారు. హిందూపురం నియోజకవర్గం లోని చిన్నగ్రామమైన లేపాక్షిలో జరిగే ఈ ఉత్సవానికి తనతో పాటు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కూడా హాజరవుతారని చందూలాల్ తెలిపారు. -
షూటింగ్లో బిజీగా ఉండటం వల్లే
-
షూటింగ్లో బిజీగా ఉండటం వల్లే: బాలకృష్ణ
హైదరాబాద్: సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వల్లే తిరుపతిలో జరిగిన దిశానిర్దేశక సదస్సుకు హాజరు కాలేకపోయినట్లు సినీ నటుడు, హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావుతో శుక్రవారం సాయంత్రం బాలకృష్ణ భేటీ అయ్యారు. ఏపీ సచివాలయంలో లేపాక్షి ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ఈ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ లేపాక్షి ఉత్సవాలకు కేంద్రమంత్రులను, సీఎంలను ఆహ్వానిస్తామన్నారు. తొలుత డిసెంబర్ 27, 28 తేదీల్లో లేపాక్షి ఉత్సవాలు నిర్వహించాలని గతంలో ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ కార్యక్రమం చేపడతామని బాలకృష్ణ వెల్లడించారు. అనంతపురం జిల్లా హిందుపూర్ నియోజకవర్గంలోని లేపాక్షి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన విషయం తెలిసిందే. ప్రతి ఏటా ప్రభుత్వం ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. -
వైభవంగా లేపాక్షి ఉత్సవాలు: బాలకృష్ణ
హైదరాబాద్ : డిసెంబర్ 27,28 తేదీల్లో లేపాక్షి ఉత్సవాలు నిర్వహించాలని భావిస్తున్నామని హిందుపూర్ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. ఆయన బుధవారం దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావుతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం బాలయ్య మాట్లాడుతూ లేపాక్షి ఉత్సవాల నిర్వహణపై మంత్రితో చర్చించామని, ముఖ్యమంత్రితో సమావేశమై ఉత్సవాల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. లేపాక్షికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తామని బాలకృష్ణ తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన విషయం తెలిసిందే. ప్రతి ఏటా ప్రభుత్వం ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. లేపాక్షి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఈసారి నందమూరి బాలకృష్ట రంగంలోకి దిగారు. లేపాక్షి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.