పర్యాటకంతోనే అధిక ఆదాయం
‘అనంత’లో టూరిజం సర్క్యూట్ కు రూ.25 కోట్లు
లేపాక్షి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘‘వ్యవసాయం, పరిశ్రమల కంటే ఎక్కువ ఆదాయం పర్యాటక రంగం ద్వారా వస్తుంది. అందుకే రాష్ట్రంలో పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షిలో శనివారం ‘లేపాక్షి ఉత్సవాలు’ ప్రారంభమయ్యాయి. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రజలకు మానసిక ఆనందం, ఆహ్లాదం అవసరం కాబట్టి ఇకపై పర్యాటకంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తీసుకుంటామన్నారు. హంద్రీ-నీవాను ఏడాదిలో పూర్తి చేస్తామని తెలిపారు. అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని వెల్లడించారు. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. లేపాక్షి ఉత్సవాలను ప్రతిఏటా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. లేపాక్షిని ఆదర్శ పట్టణంగా అభివృద్ధి చేస్తామన్నారు. లేపాక్షితో పాటు హిందూపురం అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాన్నారు.
టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తాం
రాష్ట్రంలో కూచిపూడి నాట్యారామం ఏర్పాటుకు రూ.100 కోట్లు కేటాయించామని చంద్రబాబు పేర్కొన్నారు. లేపాక్షి, పెనుకొండ, పుట్టపర్తి, తిమ్మమ్మ మర్రిమాను. నిమ్మలకుంట, ధర్మవరంలను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ‘‘ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నా, ఎన్నో విజయోత్సవ సభల్లో పాల్గొన్నా... కానీ లేపాక్షి ఉత్సవాల్లో కలిగిన సంతోషం ఎప్పుడూ లేదు’’ అని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కొడెల శివప్రసాదరావు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, సినీనటులు జయసుధ, కన్నడ సినీ నటుడు శివరాజ్‌కుమార్, చలపతిరావు, జయప్రకాశ్‌రెడ్డి, అశోక్‌కుమార్, మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణతోపాటు మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత తదితరులు పాల్గొన్నారు.