మంత్రి చందూలాల్ కు బాలకృష్ణ ఆహ్వానం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో జరుగనున్న లేపాక్షి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మంగళవారం తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్‌ను కలిశారు. సచివాలయంలోని మంత్రి చాంబర్‌కు విచ్చేసిన ఆయన ఈ సందర్భంగా చందూలాల్‌ను లేపాక్షి ఉత్సవాలకు హాజరవ్వాలంటూ స్వయంగా అధికారిక ఆహ్వాన పత్రాన్నిఅందజేశారు.
ఈ మేరకు బాలకృష్ణ మాట్లాడుతూ ... రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న లేపాక్షి ఉత్సవాలకు పర్యాటక శాఖ మంత్రిని ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. లేపాక్షిని అతి పెద్ద పర్యాటక ప్రాంతంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ నెల 27,28 తేదీల్లో రెండు రోజుల పాటు జరుగనున్న లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నం. అందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవానికి పొరుగు రాష్ట్రాల మంత్రులు కూడా హాజరువుతున్నారు అని పేర్కొన్నారు.
బాలకృష్ణ ఆహ్వానాన్ని అందుకున్న చందూలాల్ స్పందిస్తూ.... బాలకృష్ణ స్వయంగా వచ్చి ఆహ్వానించడం చాలా సంతోషం. తప్పకుండా లేపాక్షి ఉత్సవాలకు హాజరవుతానని హామీ ఇచ్చారు. అనంతరం అరగంట పాటు ఉత్సవాలకు సంబంధించిన పలు విషయాలను చర్చించుకున్నారు. హిందూపురం నియోజకవర్గం లోని చిన్నగ్రామమైన లేపాక్షిలో జరిగే ఈ ఉత్సవానికి తనతో పాటు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కూడా హాజరవుతారని చందూలాల్ తెలిపారు.