బడుగు విద్యార్థులంటే అంత అలుసా?
తెలంగాణలో దళితులు, బీసీలు అధికశాతం ఉన్నందున వారి చదువుల కోసం బోధనా రుసుముల పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గతంలో ప్రకటించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో బడుగు బలహీనవర్గాల విద్యార్థుల చదువుల కోసం లక్ష ఆదాయ పరిమితి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టారు. పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు జీవం పోసిన ఆ పథకానికి టీఆర్ఎస్ ప్రభుత్వం గండికొట్టే ప్రయత్నాలు చేస్తోంది. గత మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సుమారు రూ.3 వేల కోట్లు పెండింగులో ఉన్నా యి. నూతన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల విషయంలో ఏదో ఒక తిరకాసు పెడుతూ స్థానికత విషయమై హైకోర్టు మందలింపులతో వెనక్కు తగ్గినప్పటికీ, నేటికీ ఈ పథకం అమలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్రంలో 2014-15లో ఫీజులు, ఉపకారవేతనాలకు 13,35,402 మం ది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 7,30,469 మంది బీసీలు కాగా, 2,49,202 మంది ఎస్సీలు, 1,34,976 మంది ఎస్టీలు, 1,20,151 మంది మైనార్టీలు, 1,00,297 మంది ఈబీసీలు, సుమారు 307 మంది వికలాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు రూ.2 వేల కోట్ల బకాయిలు విడుదల కావాల్సి ఉండగా నేటివరకు ఒక్కపైసా కూడా నిధులు విడుదల చేయలేదు. బడ్జెట్లో మాత్రం అత్యధిక నిధులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసమే కేటాయిస్తున్నట్లు అంకెల్లో చూపించారు. కానీ నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులు 3 నెలల్లో 25 శాతం, 6 నెలల్లో 25 శాతం, సంవత్సరం ముగిసేనాటికి పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్ స్కాలర్షిప్లు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది కానీ తెలంగాణలో ఇది అమలు జరగటంలేదు.
ప్రభుత్వం వద్ద డబ్బులు లేకుంటే బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునయినా సరే బకాయిలు చెల్లించాలని ఉన్నత న్యాయ స్థానం పేర్కొంది. మరోవైపున ఫీజులు చెల్లించనందున ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల సర్టిఫి కెట్లు ఇవ్వడానికి ప్రైవేట్ యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. పరీక్ష సం దర్భాల్లో హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నా రు. ఫీజులు వచ్చిన తర్వాత తిరిగి చెల్లిస్తాం, ముందు ఫీజు చెల్లించమని యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. బకాయిలు చెల్లించడానికి నిధులు లేవం టున్న ప్రభుత్వం మరోవైపున పుష్కరాలు, దేవాలయాలు, ఆవిర్భావ దినోత్స వాలు, ఫీజు బకాయిలు చెల్లించడానికి తన దగ్గర డబ్బులు లేవని బీద అరు పులు అరుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు మాని పూర్తి స్థాయిలో రెండేళ్ల బకాయిలు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి. నిధులు లేవన్న సాకుతో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు ఎగనామం పెట్టాలని చూస్తే విద్యార్థుల ఆగ్రహాన్ని ప్రభుత్వం చవిచూడవలసివస్తుంది.
- కోట రమేష్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు, హైదరాబాద్, 9618339490.