Lieutenant Governor Anil Baijal
-
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించారాయన. 2016 నుంచి అనిల్ బైజల్ ఢిల్లీ ఎల్జీగా కొనసాగుతున్నారు. చాలాకాలంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో ఆయనకు విబేధాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, కీలక నిర్ణయాలకు సైతం ఎల్జీ హోదాలో అనిల్ బైజల్ బీజేపీ పర్యవేక్షణతోనే అడ్డుపుల్లలు వేస్తున్నారనే విమర్శలు చేసింది ఆప్ సర్కార్. -
వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేతకి నో!
ఆప్ సర్కార్ వర్సెస్ ఎల్జీ మరోసారి తెర మీదకు వచ్చింది. వీకెండ్ కర్ఫ్యూ ఎత్తేయాలన్న ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సున్నితంగా తిరస్కరించారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఒక ప్రతిపాదనతో పాటు కొవిడ్ ఆంక్షల్ని సవరించాలన్న విజ్ఞప్తిని సైతం ఆయన తోసిపుచ్చారు. కేసుల సంఖ్య ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం కుదరదని లెఫ్టినెంట్ గవర్నర్ తేల్చేశారు. అయితే 50 శాతం సామర్థ్యంతో ప్రైవేట్ ఆస్పత్రుల్ని నిర్వహించుకోవడానికి మాత్రం ఎల్జీ అనుమతి ఇచ్చారు. కేసుల సంఖ్య తగ్గి, పరిస్థితి మెరుగైనప్పుడే ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం సబబుగా ఉంటుందని ఎల్జీ ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వారంగా పాజిటివిటీ రేట్‌తో పాటు కేసులు తగ్గాయని, ప్రజల-వ్యాపారుల ఆర్థిక అవసరాల దృష్ట్యా వారంతపు కర్ఫ్యూను ఎత్తేయాలని ఆలోచిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. దేశ రాజధాని రీజియన్‌లో జనవరి 1వ తేదీ నుంచి సరిబేసి విధానంలో మార్కెట్లను నిర్వహించుకోవచ్చని, అలాగే జనవరి 7వ తేదీన వీకెండ్ కర్ఫ్యూలను ప్రకటిస్తూ కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోషియేషన్, సదర్ బజార్ ట్రేడర్స్, ఇతర మార్కెట్ అసోషియేషన్లు.. సరిబేసి విధానం ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశాయి. ఆర్థికంగా ప్రభావం చూపడంతో పాటు ఉద్యోగాలు పోతున్నాయంటూ వాపోతూ ఢిల్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తులు పెట్టుకున్నాయి. ఈ తరుణంలోనే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తయారు చేసి ఆమోదం కోసం ఎల్జీకి పంపింది. ఇదిలా ఉంటే కర్ణాకటలో ఓపక్క వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేయగా.. తమిళనాడులో వీకెండ్లో పూర్తిగా లాక్డౌన్, మిగతా రోజుల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుందని సీఎం స్టాలిన్ ప్రకటించారు. -
‘ప్రతీదానికి అడ్డుపడడం బాగోలేదు’
ఢిల్లీ: తమ పాలనలోని ప్రతీ నిర్ణయాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం నానాటికీ ఎక్కువ అవుతుండడంపై ఆప్ ప్రభుత్వం అసహనానికి లోనవుతోంది. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలు బహిరంగంగా తమ అసంతృప్తిని వెల్లగక్కారు. రైతు నిరసనల ఉద్యమ కేసుకు(జనవరి 26న జరిగిన పరిణామాల కేసు) సంబంధించి పోలీసుల తరపున వాదనలు వినిపించేందుకు ఢిల్లీ గవర్నమెంట్ ఒక లాయర్ల ప్యానెల్‌ను ప్రతిపాదించింది. అయితే దానిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన ఎల్జీ.. మరో ప్యానెల్‌ను సూచించాడు. ఇక ఈ నిర్ణయం ఢిల్లీ ప్రజలకు ఘోర అవమానమేనని కేజ్రీవాల్ ఆక్షేపించారు. ‘కేంద్రంలో బీజేపీ పాలిస్తోంది. బీజేపీని చిత్తుగా ఓడించి ఢిల్లీలో మేం(ఆప్) పాలిస్తున్నాం. మేం ప్రజానిర్ణయంతో ఎంపికయ్యాం. అలాంటిది ప్రతీదాంట్లో బీజేపీ, ఆయన(ఎల్జీని ఉద్దేశించి) జోక్యం ఎక్కువగా ఉంటోంది. ఇది ఢిల్లీ ప్రజల్ని అవమానించడమే అవుతుంది. బీజేపీ కొంచెం ప్రజాస్వామ్యాన్ని కూడా గౌరవిస్తే బాగుంటుంది’ అని హిందీలో శనివారం కేజ్రీవాల్ ట్వీట్ చేశాడు. कैबिनेट निर्णयों को इस तरह पलटना दिल्ली वालों का अपमान है। दिल्ली के लोगों ने एतिहासिक बहुमत से “आप” सरकार बनायी और भाजपा को हराया। भाजपा देश चलाये, “आप” को दिल्ली चलाने दे। आए दिन हर काम में इस तरह की दख़ल दिल्ली के लोगों का अपमान है। भाजपा जनतंत्र का सम्मान करे https://t.co/FQbQzuvMkL — Arvind Kejriwal (@ArvindKejriwal) July 24, 2021 గత సోమవారం ఢిల్లీ కేబినెట్ ప్రతిపాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పేర్లకు బదులు.. ఢిల్లీ పోలీసులు ఎంపిక చేసిన లాయర్ల ప్యానెల్‌ను ఎల్జీ అనిల్ బైజాల్ అప్రూవ్ చేయడం విశేషం. ఈ ప్యానెల్ నియామకం కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే జరగడం మరో విశేషం. దీంతో డిప్యూటీ సీఎం సిసోడియా మండిపడ్డాడు. ‘అన్నీ వాళ్లే చేసుకుంటే.. ఇక మేమేందుకు?’ అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. -
ఢిల్లీలో జులై 31 నాటికి 5.5 లక్షల కేసులు!
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోన వైరస్ వ్యాప్తి రోజురోజుకూ అధికమవుతోంది. ఇప్పటికే 30 వేల కేసులతో దేశంలో మూడో స్థానంలో ఉన్న ఢిల్లీకి పెద్ద మొత్తంలో వైద్యులు, ఆస్పత్రి బెడ్లు అవసరమని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సమావేశంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం డబ్లింగ్ రేటు 12 నుంచి13 రోజులుగా ఉందని తెలిపారు. ఈ ప్రకారం ఢిల్లీలో జూన్ 30 నాటికి లక్ష కేసులు నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు. జులై 15 నాటికి 2 లక్షల కేసులు, జులై 31 నాటికి 5.5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశముందని వెల్లడించారు. అదేసందర్భంలో ఢిల్లీలో వైరస్ కమ్యునిటీ ట్రాన్స్ఫర్ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. ఢిల్లీ ప్రభుత్వ నిర్వహణలోని అన్ని ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఢిల్లీ వాసులకు మాత్రమే కోవిడ్ చికిత్స అందించాలని, వైరస్ లక్షణాలున్న వారికే నిర్ధారణ పరీక్షలు జరపాలని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ఆదేశాలివ్వగా.. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ వాటిని తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో స్థానికతతో సంబంధం లేకుండా కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందించాలని ఎల్జీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. (చదవండి: జ్వరం, గొంతు నొప్పితో హోం ఐసోలేషన్‌లో కేజ్రీవాల్) -
మళ్లీ కేజ్రీవాల్ వర్సెస్ ఎల్జీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్ గవర్నర్(ఎల్జీ)ల మధ్య మరో వివాదం తలెత్తింది. రెండు రోజుల క్రితం ఆప్ ప్రభుత్వం ఇచ్చిన రెండు ఉత్తర్వులను ఎల్జీ అనిల్ బైజాల్ తోసిపుచ్చుతూ తాజా ఆదేశాలిచ్చారు. ఢిల్లీలో ప్రభుత్వ నిర్వహణలోని అన్ని ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఢిల్లీ వాసులైన కోవిడ్–19 రోగులకు మాత్రమే చికిత్స అందించాలని, కోవిడ్–19 లక్షణాలున్న వారికే కరోనా పరీక్షలు జరపాలని పేర్కొంటూ అరవింద్ కేజ్రీవాల్ సర్కారు 6న ఆదేశాలిచ్చింది. రానున్న రోజుల్లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదమున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే, ఈ ఆదేశాలను తోసిపుచ్చుతూ ‘అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో, నర్సింగ్‌హోమ్స్‌ల్లో స్థానికుడా? స్థానికేతరుడా? అనే వివక్ష చూపకుండా అందరు కోవిడ్–19 పేషెంట్లకు చికిత్స అందించాలి’ అని స్పష్టం చేస్తూ ఎల్జీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, కరోనా లక్షణాలున్నవారికే పరీక్షలు జరపాలనడం ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తే..కాంటాక్ట్ ట్రేసింగ్ కష్టమవుతుందని, కరోనా మరింత ప్రబలుతుందన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు మొత్తం 9 కేటగిరీల వారికి పరీక్షలు జరపాల్సిందేనన్నారు. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్ హోదాలో ఎల్జీ అనిల్ బైజాల్ ఆ ఆదేశాలిచ్చారు. ఎల్జీ తీరుపై ఆప్ మండిపడింది. బీజేపీ ఒత్తిడితోనే ఎల్జీ అలా వ్యవహరిస్తున్నారని, బీజేపీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించింది. -
కేజ్రీ వర్సెస్ ఎల్జీ; సుప్రీం కీలక తీర్పు
సాక్షి, ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. లెఫ్టినెంట్ గవర్నర్ దూకుడుకు బ్రేక్ పడింది. కొంత కాలంగా వివాదంగా మారిన ఢిల్లీ పరిపాలన అధికారాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. ఢిల్లీ పరిపాలన విభాగానికి అధిపతి ఎవ్వరన్న దానిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఎలాంటి స్వతంత్ర అధికారాలు ఉండవని, మంత్రి మండలి నిర్ణయానికి ఎల్జీ కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 239ఏఏను అనుసరించి రాష్ట్రపతికి నివేదించాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలని, ప్రభుత్వ విధులకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆటంకంగా మారొద్దని తీర్పులో పేర్కొంది. ఇతర రాష్ట్రాలకు ఉన్న అధికారాలు కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి ఉండవని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కేంద్రం కాలరాస్తోందంటూ ఇటీవల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొమ్మిది రోజుల పాటు ఎల్జీ అనిల్ బైజాల్ ఇంట్లో ధర్నా చేసిన విషయం తెలిసిందే. లెఫ్టినెంట్ గవర్నర్‌ను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవహారాల్లో తలదూరుస్తుందంటూ కేజ్రీవాల్ గతంలో ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ప్రభుత్వ పథకాల అమలులో మంత్రిమండలికి సహరించట్లేదని కేజ్రీవాల్ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో అరవింద్ కేజ్రీవాల్‌కు కొంత ఊరట లభించింది. -
దీక్ష ఎఫెక్ట్; అనారోగ్యం పాలైన ఆరోగ్యశాఖ మంత్రి
న్యూఢిల్లీ : గత ఏడురోజులుగా ఢిల్లీ లెఫ్నినెంట్ గవర్నర్ కార్యలయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్‌తో పాటు దీక్ష చేస్తున్న ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం పూర్తీగా క్షీణించింది. దీంతో ఆదివారం రాత్రి చికిత్స నిమిత్తం ఆయనను లోక్‌నాయక్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం గురించి ఎల్ఎన్జీపీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ పాసీ ‘మా డాక్టర్ల బృందం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీక్ష చేస్తున్న మంత్రుల ఆరోగ్యాలను పరీక్షిస్తాము. ఈ క్రమంలో భాగంగా నిన్న మధ్యాహ్నం వరకూ కూడా సత్యేంద్ర జైన్ ఆరోగ్యం బాగానే ఉంది. కానీ ఆదివారం రాత్రి సమయానికి జైన్ కీటోన్ లెవల్స్ బాగా పడిపోయాయి. దాంతో జైన్ తలనొప్పి, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. విషయం తెలిసిన వెంటనే మేము జైన్‌ను ఆస్పత్రికి తరలించాము. ప్రస్తుతం అతనికి చికిత్ప అందిస్తున్నాం ’ అన్నారు. కాగా కేజ్రీవాల్‌కు సంఘీభావంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు, కార్యకర్తలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీకి సీపీఎం కూడా మద్దతు తెలపడమే కాక ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా హాజరవడంతో ర్యాలీలో పాల్గొన్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఎల్జీ తీరుపై నిరసన తెలుపుతున్న కేజ్రీవాల్‌కు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుంది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ నాలుగో సమావేశ కార్యక్రమంలో పాల్గోనేందుకు ఢిల్లీ వెళ్లిన పశ్చిమబెంగాల్, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు వరుసగా మమత బెనర్జీ, పినరయి విజయన్, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి.. ఢిల్లీ సీఎంకు సంఘీభావం ప్రకటించారు. -
‘బీజేపీకి అతిపెద్ద సవాల్’
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రం హక్కుల్ని కేంద్రం కాలరాస్తుందని, ఢిల్లీలో ఐఏఎస్ అధికారులు ఆందోళన విరమింపజేసే విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ చొరవతీసుకోవడం లేదంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, రాష్ట్రమంత్రులు ఐదురోజులుగా బైజాల్ ఇంట్లో ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ ధర్నాకు జాతీయ నాయకులు నుంచి మద్దతు అభిస్తోంది. తాజాగా బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా కేజ్రీవాల్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు. ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలన్న డిమాండ్ చాలా బలమైనది, బీజేపీకి ఇది అతి పెద్ద సవాల్ అని ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ పరిపాలన, ప్రభుత్వ పథకాలపై ప్రశంశలు కురిపిస్తూ.. ప్రస్తుత రాజకీయ పార్టీలకు ఆప్ తండ్రిలాంటి పార్టీ అని పొగడ్తల్లో ముంచెత్తారు. కేజ్రీవాల్‌ను జంటిల్మాన్గా సిన్హా అభివర్ణించాడు. ఢిల్లీలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యం హత్య కంటే అధ్వాన్నంగా ఉందని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ విమర్శించారు. గత ఇరవైఏళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్నందున ఢిల్లీ ప్రజలపై బీజేపీ ప్రతీకారం తీర్చుకుంటోందని ఆర్జేడీ ఛీప్, బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో ప్రజా ప్రభుత్వం నడవకుండా లెఫ్టనెంట్ గవర్నర్‌ను అడ్డుపెట్టకుని కేంద్రం రాజకీయం చేయడం తగదని సీపీఎం జాతీయ కార్యదర్శి సితారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ ధర్నాకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు తెలిపారు. జాతీయ స్థాయిలో అన్ని పార్టీల నుంచి కేజ్రీవాల్‌కు మద్దతు లభిస్తుంచే కాంగ్రెస్ మాత్రం భిన్నంగా స్పందించింది. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం మాత్రం ఎల్జీ ఇంట్లో ధర్నాకి కూర్చోడం సరికాదని ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కేజ్రీవాల్‌పై మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలు అత్యంత మెజార్టీతో గెలిపిస్తే పాలన గాలికొదిలేసి ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. -
ఐదోవ రోజుకు చేరిన కేజ్రీవాల్ నిరసన
-
రంగంలోకి రాజ్‌నాధ్ సింగ్...?
న్యూఢిల్లీ : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ముగ్గురు మంత్రులు నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న నేపధ్యంలో అనిల్ బైజాల్ గురువారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌తో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో దేని గురించి చర్చించారనే స్పష్టత లేకపోయినప్పటికి... కేజ్రివాల్ దీక్ష గురించే మాట్లాడుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కేజ్రివాల్ దీక్షను విరమింపజేసే విషయంలో సహాయం చేసి, ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా ఎల్జీ, రాజ్‌నాధ్‌ను కోరారనే ప్రచారం జరుగుతుంది. కానీ వీరి భేటిలో ఏం మాట్లాడారనే దాని గురించి ఇంతవరకూ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఢిల్లీలో ఐఏఎస్ అధికారుల ఆందోళన విరమింపజేసే విషయంలో బైజాల్ చొరవతీసుకోవడం లేదంటూ కేజ్రీవాల్ నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రధానమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ల తీరును నిరసిస్తూ...ఆప్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు రాజ్‌ఘాట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలి నిర్వహించారు. ‘మోదీజీ ఫర్గివ్ ఢిల్లీ’ హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ప్రదర్శన కొనసాగించారు. -
నాలుగో రోజుకు చేరిన కేజ్రీవాల్ నిరసన
న్యూఢిల్లీ: ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ముగ్గురు మంత్రులు చేస్తున్న దీక్ష నాలుగో రోజుకు చేరింది. దీంతో ఎల్జీ ఇంటి నుంచే తన విధులు నిర్వహిస్తున్నారు. కాగా, దీక్ష చేస్తున్న కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఎవరినీ అనుమతించకపోవడంపై ఆప్ నేతలు మండిపడ్డారు. ‘కేజ్రీవాల్‌ను హౌజ్ అరెస్టు చేశారా?’ అని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఐఏఎస్ అధికారులు ఆందోళన విరమింపజేసే విషయంలో బైజాల్ చొరవతీసుకోవడం లేదంటూ కేజ్రీవాల్ నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. అటు, ప్రధానమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ల తీరును నిరసిస్తూ.. ఎమ్మెల్యేలు, ఆప్ కార్యకర్తలు రాజ్‌ఘాట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ‘మోదీజీ ఫర్గివ్ ఢిల్లీ’ హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ప్రదర్శన కొనసాగింది. నాలుగు నెలలుగా ఆందోళన చేస్తున్న ఢిల్లీ ఐఏఎస్ అధికారుల ఆందోళన విరమించేలా ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. -
మూడోరోజూ గవర్నర్ ఇంటిముందే సీఎం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర హక్కులను కేంద్రం కాలరోస్తోందంటూ లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటి వద్ద సోమవారం సాయంత్రం ధర్నాకు దిగిన ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్.. మూడో రోజు కూడా ధర్నాను కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లను అంగీకరించే వరకు ధర్నా ఆపేది లేదని బీష్మీంచుకొని కూర్చున్నారు. ప్రజలకు రేషన్ సరకులను డోర్‌డెలవరీ అందించే ప్రక్రియకు ఆమోదం, నాలుగు నెలలుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న ఐఏఎస్ అధికారుపై చర్యలు తీసుకోవాలని, వారు సమ్మె విరమించేలా చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కాగా తమ పోరాటాన్ని ఎప్పటికప్పుడు ఢిల్లీ ప్రజలకు ట్విటర్లో వీడియోల ద్వారా చేరవేస్తున్నారు. ఢిల్లీ ప్రజల హక్కులను కేంద్రం హరిస్తుందని మండిపడ్డారు. తాము 24 గంటలుగా లెఫ్టినెంట్ గవర్నర్ ఇంట్లో బైఠాయించినా.. తమతో మాట్లాడేందుకు ఆయన చొరవ చూపడం లేదని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజల ఆత్మ గౌరవం కోసం తాము పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. మరో వైపు తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేసేందుకు ప్రయత్నిస్తోంది.ఇప్పటికే ఢిల్లీ వైద్య ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ మంగళవారం ఉదయం నిరవధిక నిరాహార దీక్షకు దిగగా, బుధవారం మరో నేత మనీష్ సిసోడియా కూడా నిరాహార దీక్ష చేపట్టారు. -
రాత్రంతా సోఫాపైనే ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ : తమ డిమాండ్లను అంగీకరించేవరకు లెఫ్టనెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఇంటిని వీడేదిలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆయన కేబినెట్ మంత్రులు బీష్మీంచుకొని కూర్చున్నారు. ప్రజలకు రేషన్ సరకులను డోర్‌డెలవరీ అందించే ప్రక్రియకు ఆమోదం, నాలుగు నెలలుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న ఐఏఎస్ అధికారుపై చర్యలు తీసుకోవాలని, వారు సమ్మె విరమించేలా చొరవ చూపాలనే మూడు ప్రధాన డిమాండ్లతో కేజ్రీవాల్ అండ్ కో రాత్రంతా లెఫ్టనెంట్ గవర్నర్ ఇంట్లో ఉండి నిరసన తెలిపారు. నాలుగు నెలలుగా పలు దఫాలుగా ఎల్జీని కలిసి విన్నవించినా తమ డిమాండ్లను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, నిరసనగా రాజ్నివాస్లోని వెయిటింగ్ రూంలో బైఠాయించినట్లు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కేజ్రీవాల్‌తో పాటు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మంత్రులు సత్యేంద్రకుమార్ జైన్, గోపాల్రాయ్లున్నారు. వీరంతా ఫుడ్ ఆర్డర్ చేసుకొని మరి అక్కడే భోజనం చేశారని, డయాబెటిక్ పేషంట్ అయిన కేజ్రీవాల్ ఇన్సులిన్ ఇంజక్షన్ కూడా అక్కడే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆప్ కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంలో పోలీసులు రాజ్‌నివాస్ వద్ద భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎలాంటి కారణం లేకుండానే కేజ్రీవాల్ అకస్మాత్తుగా నిరసనకు దిగారని, విధులకు గైర్హాజరై ఆందోళనలు చేస్తున్న అధికారులకు సమన్లు జారీచేయాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ముఖ్యమంత్రి బెదిరింపులు దిగారని ఎల్జీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఐఏఎస్ అధికారులు సమ్మే చేస్తున్నారన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపణలను ఐఏఎస్‌ల సంఘం ఖండించింది. ఇవి పూర్తి నిరాదారమైన, అసంబద్దమైన ఆరోపణలని ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి: రాష్ట్ర హోదా ఇస్తే బీజేపీకి ప్రచారం: కేజ్రీవాల్ -
కేజ్రివాల్ రిక్వెస్ట్
సాక్షి, ఢిల్లీ : తమ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రేషన్ హోం డెలివరీ పథకానికి సహకరించాలని ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ అనిల్ బజాజ్‌ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కోరారు. రేషన్ దుకాణంలో అవకతవకలను నిరోదించాలని ఢిల్లీ ప్రభుత్వం నూతన రేషన్ విధానాన్ని ప్రకటించింది. కొన్ని రోజుల కింద ప్రభుత్వ పథకాలలో అవకతవకలు జరుగుతున్నాయని, రేషన్ మాఫియాగా తయారైందని ఎల్జీ ప్రభుత్వం పై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. కేజ్రివాల్‌కి అనిల్ బజాజ్ మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన పథకానికి సహాకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. -
ఢిల్లీ సీఎంకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలకు ముందు సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీలో ఆప్ కార్యాలయాన్ని సాధ్యమైనంత త్వరగా ఖాళీచేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) అనిల్ బైజాల్ సీఎం కేజ్రీవాల్ కు ఆదేశించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ను సంప్రదించకుండా పార్టీ కోసం భూమి కేటాయించుకోవడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే గతంలో ఎల్జీగా చేసిన నజీబ్ జంగ్ ఆప్ ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై ముగ్గురు సభ్యులతో కూడిన వీకే షుంగ్లూ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ ఇద్దరు కలిసి పనిచేయాల్సి ఉంటుందని, కానీ ఆప్ ప్రభుత్వం సొంత నిర్ణయాలపై కమిటీని నియమించారు. ఆ కమిటీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం కార్యాలయ భవన నిర్మాణానికి ఎల్జీని సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా భూమి కేటాయించడం ఏ విధంగానూ చెల్లుబాటు కాదని, అలాగే ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్‌కు నివాస భవనం ఎలా కేటాయిస్తారని కూడా షుంగ్లు కమిటీ ఇటీవల ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయాలపై కమిటీ దాదాపు 100 పేజీల నివేదిక సిద్ధం చేసింది. ఎల్జీ అనుమతి లేకుండా మంత్రులు విదేశీ ప్రయాణాలు, న్యాయవాదుల నియామకం విషయాలలో ఆప్ ప్రభుత్వ చర్యలను తప్పుబట్టింది. షుంగ్లు కమిటీ ఏవైనా అక్రమాలను గుర్తిస్తే, కేజ్రీవాల్ సహా సంబంధిత మంత్రులు క్రిమినల్ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కమిటీ వేసిన సమయంలోనే నజీబ్ జంగ్ హెచ్చరించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తో చర్చించకుండా.. పార్టీ ఆఫీసు కోసం భూమి కేటాయింపు, మంత్రి సత్యేంద్ర జైన్ కుమార్తెను ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య మిషన్ డైరెక్టర్‌గా నియమించడం, పలువురు పార్టీ నేతలకు సహాయదారులుగా బాధ్యతలు అప్పగించడంపై షుంగ్లూ కమిటీ తమ నివేదికలో ప్రశ్నించింది. సీఎం కేజ్రీవాల్ ను ఆయన ప్రభుత్వాన్ని ప్రమోట్ చేసేందుకు రూ.97 కోట్లు ఖర్చు చేయడంపై ఎల్జీ స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రజాధనాన్ని వృథా చేయడంపై కేజ్రీవాల్ ను వివరణ కోరడంతో పాటు ఆ డబ్బును తిరిగి ప్రభుత్వ సొమ్ముగా డిపాజిట్ చేయాలని ఇటీవల సూచించిన విషయం విదితమే. -
ఢిల్లీని వదిలి వెళ్తాను: గుర్మెహర్
న్యూఢిల్లీ: కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె, ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్ తన ఆందోళనను విరమించాలని నిర్ణయించుకుంది. తనపై బీజేపీ, ఏబీవీపీతో సహా సెల్రబిటీలు కూడా తీవ్రమైన కామెంట్లు చేస్తుండటంతో తన నిరసనను ఇక్కడితే ఆపేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు మద్ధతు తెలిపిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఆందోళన విరమించకపోతే అత్యాచారం చేస్తామంటూ ఏబీవీపీ వారు తనపై బెదిరింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ నుంచి గుర్మెహర్ కౌర్ ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకున్నట్లు చెప్పింది. ఈ వివాదంలో గుర్మెహర్కు అరవింద్ కేజ్రీవాల్ మద్ధతు తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని గుర్మెహర్కు వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. గత వారం రాంజాస్ కాలేజీలో జరిగిన గొడవలపై చర్చించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ను కలిశారు. రాంజాస్ కాలేజీలో విధ్వసం సృష్టించిన ఏబీవీపీ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంగ్ గవర్నర్‌కు కేజ్రీవాల్ విజ్ఞప్తిచేశారు. గుర్మెహర్ను బెదిరించిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కేజ్రీవాల్ కోరారు. గుర్మెహర్ తండ్రి కెప్టెన్ మణ్‌దీప్ సింగ్ 1999 కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందారు. తన తండ్రిని పాకిస్తాన్ చంపలేదని, యుద్ధం ఆయనను చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మరోసారి ఆమె వివాదంలో చిక్కుకుంది. దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలిద్‌ను రాంజాస్ కాలేజీలో ఓ సాహిత్య కార్యక్రమంలో ఉపన్యసించేందుకు ఆహ్వానించారు. దీనిపై గత బుధవారం ఏబీవీపీ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పాటు విద్యార్థులు, మీడియాపై దాడికి పాల్పడగా ఈ ఘటనలో దాదాపు 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనపై గుర్మెహర్ కౌర్ గుర్మెహర్ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ.. ఏబీవీపీకి భయపడేది లేదంటూ.. తనకు దేశ వ్యాప్తంగా విద్యార్థుల మద్దతు ఉందని రాసున్న ప్లకార్డుతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదం మొదలైంది. రాంజాస్ కాలేజీ వివాదం.. సంబంధిత కథనాలు ట్విట్టర్ వార్‌కు తెరలేపిన సెహ్వాగ్ ఏబీవీపీకి భయపడను: జవాన్ కూతురు 'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు' రాంజాస్ కాలేజీలో రణరంగం! నన్ను రేప్ చేస్తామని బెదిరించారు