ఢిల్లీ సీఎంకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలకు ముందు సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీలో ఆప్ కార్యాలయాన్ని సాధ్యమైనంత త్వరగా ఖాళీచేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) అనిల్ బైజాల్ సీఎం కేజ్రీవాల్ కు ఆదేశించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ను సంప్రదించకుండా పార్టీ కోసం భూమి కేటాయించుకోవడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే గతంలో ఎల్జీగా చేసిన నజీబ్ జంగ్ ఆప్ ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై ముగ్గురు సభ్యులతో కూడిన వీకే షుంగ్లూ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ ఇద్దరు కలిసి పనిచేయాల్సి ఉంటుందని, కానీ ఆప్ ప్రభుత్వం సొంత నిర్ణయాలపై కమిటీని నియమించారు.
ఆ కమిటీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం కార్యాలయ భవన నిర్మాణానికి ఎల్జీని సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా భూమి కేటాయించడం ఏ విధంగానూ చెల్లుబాటు కాదని, అలాగే ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్‌కు నివాస భవనం ఎలా కేటాయిస్తారని కూడా షుంగ్లు కమిటీ ఇటీవల ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయాలపై కమిటీ దాదాపు 100 పేజీల నివేదిక సిద్ధం చేసింది. ఎల్జీ అనుమతి లేకుండా మంత్రులు విదేశీ ప్రయాణాలు, న్యాయవాదుల నియామకం విషయాలలో ఆప్ ప్రభుత్వ చర్యలను తప్పుబట్టింది. షుంగ్లు కమిటీ ఏవైనా అక్రమాలను గుర్తిస్తే, కేజ్రీవాల్ సహా సంబంధిత మంత్రులు క్రిమినల్ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కమిటీ వేసిన సమయంలోనే నజీబ్ జంగ్ హెచ్చరించారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తో చర్చించకుండా.. పార్టీ ఆఫీసు కోసం భూమి కేటాయింపు, మంత్రి సత్యేంద్ర జైన్ కుమార్తెను ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య మిషన్ డైరెక్టర్‌గా నియమించడం, పలువురు పార్టీ నేతలకు సహాయదారులుగా బాధ్యతలు అప్పగించడంపై షుంగ్లూ కమిటీ తమ నివేదికలో ప్రశ్నించింది. సీఎం కేజ్రీవాల్ ను ఆయన ప్రభుత్వాన్ని ప్రమోట్ చేసేందుకు రూ.97 కోట్లు ఖర్చు చేయడంపై ఎల్జీ స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రజాధనాన్ని వృథా చేయడంపై కేజ్రీవాల్ ను వివరణ కోరడంతో పాటు ఆ డబ్బును తిరిగి ప్రభుత్వ సొమ్ముగా డిపాజిట్ చేయాలని ఇటీవల సూచించిన విషయం విదితమే.