రేపటిలోగా ‘లైఫ్ ఎవిడెన్స్’ ఇవ్వాలి
సాక్షి, సిటీబ్యూరో: ఆసరా పింఛన్‌దారులందరూ ఆగస్టు 31లోగా తమకు సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రంలో లైఫ్ ఎవిడెన్స్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ భారతి హోళికేరి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన మీ కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి పింఛన్లు, ఇళ్లు, ఉద్యోగాలు, రుణాలు తదితర అంశాలకు సంబంధించిన వినతి పత్రాలను ఆమె స్వీకరించారు. పింఛన్ ఆగిపోకుండా సకాలంలో ఖాతాలో జమ కావాలంటే బయోమెట్రిక్ నమోదు తప్పనిసరని, ఇప్పటి వరకు లైఫ్ ఎవిడెన్స్ వెరిఫికేషన్ చేసుకోని ఆసరా పింఛన్‌దారులందరూ వెంటనే ఆ పని పూర్తి చేసుకోవాలన్నారు. వెరిఫికేషన్‌కు వెళ్లేటప్పుడు ఆధార్‌కార్డు తప్పని సరిగా వెంట తీసుకెళ్లాలన్నారు. మీ కోసంలో వచ్చిన వినతి పత్రాలన్నింటిని త్వరితగతిన పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు జేసీ సూచించారు.