limitation
-
ఆధార్.. అప్‘లేట్’
సాక్షి, హైదరాబాద్: ఆధార్‌కార్డు అప్డేట్కు ‘తిరస్కరణ’తిప్పలు తప్పడం లేదు. ఒకటి రెండుసార్లు చేర్పులుమార్పులు చేసుకుంటే ఆ తర్వాత ఆప్డేషన్ ప్రక్రియ తిరస్కరణకు గురవుతోంది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రానికి పరుగులు తీసి పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థుల ఆధార్‌కార్డులో అప్డేషన్ సమస్యగా తయారైంది. చిన్నప్పుడు ఆధార్ నమోదు చేసుకోవడంతో ఆ తర్వాత బయోమెట్రిక్ గుర్తింపు సమస్యగా మారింది. మరోవైపు చిన్నచిన్న తప్పిదాలు సైతం ఇబ్బందులకు గురిచేస్తోంది. చిన్నదానికి కూడా హైదరాబాద్‌కు తరలిరావడం పేదలకు భారంగా మారుతోంది. ఏదీ..ఎలా మార్చుకోవచ్చు అంటే... ఆధార్‌కార్డు అనేది గుర్తింపును చూపే ముఖ్యమైన సాధనంగా మారింది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం. భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ (యూఐడీఏఐ) 2019లో ఆధా ర్కార్డులో చేర్పులు మార్పులపై కొన్ని నిబంధనలు విధించింది. ఆధార్ కార్డులో ఓ వ్యక్తి తన పేరు, జన్మదినం, జెండర్ వంటి వాటిని మార్చుకోవడం అప్డేట్ చేసుకునేందుకు పరిమితి విధించింది. ► యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ఆధార్‌కార్డులో పేరును కేవలం రెండుసార్లు మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు. ఇంటి పేరు, స్పెల్లింగ్ తప్పిదాలను సరిచేసుకోవచ్చు. ► ఆధార్ కార్డులో డేట్ఆఫ్బర్త్ కేవలం ఒకసారి మాత్రమే అప్డేట్ చేసుకోవాలి. దీనికీ కొన్ని షరతులు ఉన్నాయి. ఎన్రోల్మెంట్ సమయంలో ఇచి్చన తేదీకి కేవలం మూడేళ్లు మాత్రమే తగ్గించుకోవచ్చు. అలాగే ఎంతైనా పెంచుకోవచ్చు. డేట్ మార్చుకోవాలనుకునే వారు తప్పనిసరిగా దానికి సంబంధించిన ఆధారాలు సమరి్పంచాలి. ► ఆధార్ కార్డులో జెండర్ వివరాలు ఒక్కసారి మాత్రమే మార్చుకోవచ్చు. ► ఆధార్ కార్డుపై ఉండే ఫొటోను మాత్రం ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు. దీనిపై ఎలాంటి పరిమితి లేదు. ఆధార్ నమోదు కేంద్రంలో ఫొటో అప్డేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మార్చుకోవడం కుదరదు. ► అడ్రస్ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. దీనికి సంబంధించి చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమరి్పంచాలి. ప్రాంతీయ కార్యాలయంలోనే ఆధార్‌కార్డులో పేరు, పుట్టిన తేదీ వివరాలు, జెండర్ వివరాలను పరిమితికి మించి మార్చేందుకు వీల్లేదు. పరిమితి దాటిన తర్వాత ఏమైనా మార్పులు చేయాలనుకుంటే ప్రత్యేక పద్ధతి ఉంటుంది. ఇందుకు ప్రాంతీయ కార్యాలయంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ–మెయిల్, పోస్ట్ ద్వారా కూడా ప్రాంతీయ కార్యాలయాలకు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. యూఆర్ఎన్ స్లిప్, ఆధార్ వివరాలు, దానికి సంబంధించిన ఆధారాలను జత చేస్తూ ఎందుకు మార్చాల్సి వస్తుందో కూడా స్పష్టంగా వివరించాలి. జూన్ 14 వరకు ఉచిత అప్డేట్కు అవకాశం పదేళ్లు దాటిన ఆధార్‌కార్డుల అప్డేట్ తప్పనిసరి. ఆధార్ జారీ తర్వాత చాలామంది అప్డేట్ చేసుకోలేదు. వీరి కోసం యూఐడీఏఐ ఉచితంగానే..ఆధార్ కార్డులో తప్పులను సరిచేసుకోవడానికి ఆన్లైన్లో అవకాశం కలి్పంచింది. కొంతకాలంగా గడువు పొడిగిస్తూ వస్తోంది. ఈసారి జూన్ 14 వరకూ ఆన్లైన్లో ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చు. చిరునామా, పేర్లలో అక్షర దోషాలు సరిచేసుకోవాలంటే దానికి సంబంధించిన ప్రూఫ్ సమరి్పంచి ఆప్డేట్ చేసుకోవాలి. అప్డేట్కు ప్రయత్నిస్తే తిరస్కరించి రద్దు చేశారు అప్డేట్ కోసం ఆధార్ కేంద్రానికి వెళ్లాను. దరఖాస్తు నింపి ఇవ్వగా అప్లోడ్ చేశారు. కొద్ది రోజులకు రిజెక్ట్ అయ్యిందనే మెసేజ్ వచి్చంది. మళ్లీ దరఖాస్తు చేయగా ఆధార్ రద్దు అయ్యిందని చెప్పారు. హైదరాబాద్‌లోని రీజనల్ కార్యాలయానికి వెళ్లగా అక్కడ చెక్ చేసి కొత్త కార్డు జారీ చేస్తామని చెప్పి దరఖాస్తు తీసుకున్నారు. ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. – అక్షర, స్టూడెంట్, కామారెడ్డి జిల్లా నెలరోజుల నుంచి తిరుగుతున్నా... ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా నమోదైంది. సరిచేసుకునేందుకు రీజినల్ కార్యాలయం చుట్టూ నెల రోజులుగా తిరుగుతున్నా. సరైన పత్రాలు సమర్పించి అప్లోడ్ చేయించినా కార్డు రాలేదు. – సాయికుమార్, వికారాబాద్ జిల్లా పేరు మారడం లేదు ఆధార్ కార్డులో పేరు మార్చుకునేందుకు రెండు నెలల నుంచి రీజినల్ కార్యాలయానికి తిరుగుతున్నాను. వచి్చన ప్రతిసారి కావాల్సిన పత్రాలు సమరి్పంచినా కార్డులో పేరు మాత్రం మారడం లేదు. – బాషా, కర్నూలు -
తెలంగాణ: రైతు సాయంలో సమూల మార్పులు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకంలో మార్పులు చేయాలని కాంగ్రెస్ సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్టు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం గుంట భూమి ఉన్న రైతుల నుంచి వందల ఎకరాలున్న భూస్వాములు, ప్రముఖులు, సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారికి కూడా రైతుబంధు అందుతోంది. వ్యవసాయ పనుల ప్రారంభంలో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు సాయపడటమే లక్ష్యంగా ఏర్పడిన ఈ పథకం కింద.. భారీగా భూములున్న వారికి, ధనికులకు రైతుబంధు ఎందుకు ఇవ్వాలన్న విమర్శలు ఉన్నా యి. గత ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటి విమర్శలు వచ్చినా.. అప్పటి సీఎం కేసీఆర్ అందరికీ ఇవ్వాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. కొందరికే ఇస్తే పథకంలో పైరవీలు, అక్రమాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్నది కేసీఆర్ భావన అని బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. పరిమితి ఐదెకరాలా.. పదెకరాలా? కాంగ్రెస్ సర్కారు రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, కౌలు రైతులు, కూలీలకు కూడా ఆర్థికసాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయితే కొత్త సర్కారు రైతుబంధు సాయానికి ఐదెకరాల పరిమితి విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. పదెకరాలలోపు పరిమితి ఆలోచన కూడా ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందంటున్నారు. భారీగా ఆస్తులున్న రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు,అధికారులు, సెలబ్రిటీలు, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి రెండు మూడెకరాలున్నా రైతుబంధు ఇవ్వకూడదని భావిస్తున్నట్టు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై కసరత్తు జరుగుతున్నందున.. ఇప్పటికిప్పుడే ఏం జరుగుతుందో చెప్పలేమని అంటున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో గతంలో మాదిరిగానే రైతుబంధు పథకాన్ని అమలు చేస్తారని.. వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త సంస్కరణలు అమల్లోకి వస్తాయని వివరిస్తున్నారు. దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. మొత్తంగా 68.99 లక్షల మందికి.. రాష్ట్రంలో రైతుబంధు పథకం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభమైంది. మొదట్లో ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.4 వేల చొప్పున.. ఏటా రూ.8 వేల చొప్పున రైతులకు అందేవి. తర్వాత ప్రభుత్వం ఈ సొమ్మును ఏడాదికి రూ.10 వేలు చేసింది. 2018 వానాకాలం సీజన్లో 1.30కోట్ల ఎకరాలకు చెందిన 50.25లక్షల మంది రైతులకు రూ.5,236 కోట్లు జమచేయగా.. ఈ ఏడాది వానాకాలం సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేశారు. మొత్తంగా ఈ ఏడాది వానాకాలం సీజన్ వరకు మొత్తంగా రైతుబంధు కింద రైతులకు రూ.72,815 కోట్లు జమ చేశారు. 90శాతంపైగా రైతులు ఐదెకరాల్లోపు వారే.. ఈ ఏడాది వానాకాలం సీజన్ లెక్కల ప్రకారం చూస్తే.. రైతుబంధు సొమ్ము తీసుకున్న రైతులు 68.99 లక్షల మందికాగా.. అందులో అత్యధికంగా ఎకరాలోపే భూమి ఉన్న రైతులే 22.55 లక్షల మంది ఉన్నారు. వీరి చేతిలో ఉన్న భూమి 12.85 లక్షల ఎకరాలు మాత్రమే. ♦ ఎకరా నుంచి రెండెకరాల వరకు భూమి రైతుల సంఖ్య 16.98 లక్షలుకాగా.. వీరి చేతిలో ఉన్న మొత్తం భూమి 25.57 లక్షల ఎకరాలు. ♦ రెండు నుంచి మూడెకరాల వరకు ఉన్న రైతులు 10.89 లక్షలు అయితే ఉండగా.. వీరి మొత్తం భూమి 26.50 లక్షల ఎకరాలు. ♦ ఇక మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు ఉన్న 6.64 లక్షల మంది రైతుల చేతిలో 22.62 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ♦ నాలుగు నుంచి ఐదెకరాల భూమి ఉన్న 5.26 లక్షల మంది చేతిలో 21.04 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ♦ మొత్తంగా ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలుకాగా.. వీరందరికీ కలిపి సుమారు కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుల్లో 90శాతానికిపైగా ఐదెకరాలలోపే భూములు ఉన్నాయి. ♦ ఐదెకరాలకు పైబడి భూమిన ఉన్న రైతుల సంఖ్య కేవలం 6.65 లక్షలే.. కానీ వారి వద్ద ఏకంగా 52 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ♦ ఈ క్రమంలో రాష్ట్రంలో అత్యధికంగా సన్నచిన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారని.. ఐదెకరాల పరిమితి విధిస్తే అవసరమైన రైతులకు పథకాన్ని వర్తింపచేసినట్టు అవుతుందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. -
‘ఎంవీ యాక్ట్’లో 6 నెలల నిబంధన అమానుషం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాద పరిహార కేసుల్లో బాధిత కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన 6 నెలల్లోనే దావా వేయాలన్న మోటారు వాహన చట్ట నిబంధనను హైకోర్టు తప్పుబట్టింది. ప్రమాదంలో ఎవరైనా మృతిచెందితే ఆ కుటుంబం కోలుకోవడానికే సంవత్సరానికిపైగా సమయం పడుతుందని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధన అమానుషమని పేర్కొంది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన కేసులో అమికస్ క్యూరీ (కోర్టుకు సహాయకారి)గా న్యాయవాది పి.శ్రీరఘురామ్ను నియమిస్తున్నామని స్పష్టం చేసింది. నిబంధనలను పరిశీలించి ఏం చేయాలన్న దానిపై నివేదిక అందజేయాలని ఆయన్ను ఆదేశించింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం అమ్రాడ్ గ్రామానికి చెందిన అయిటి హనుమాండ్లు గతేడాది ఏప్రిల్ 15న తన భార్య నవనీత సహా ఇద్దరు మైనర్ కుమారులతో కలసి ద్విచక్ర వాహనంపై గ్రామం నుంచి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నలుగురికీ తీవ్ర గాయాలవగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒక కుమారుడు మృతిచెందాడు. ఈ నేపథ్యంలో తమ కుమారుడి మరణానికి కారణమైన ద్విచక్రవాహనదారుడి నుంచి పరిహారం కోరుతూ నిజామాబాద్ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌లో గతేడాది నవంబర్ 10న హనుమాండ్లు పిటిషన్ వేశారు. అయితే అప్పటికే ప్రమాదం జరిగి 6 నెలలు దాటడంతో పిటిషన్‌ను స్వీకరించేందుకు ట్రిబ్యునల్ నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టుకెక్కారు. -
పన్ను మినహాయింపు పరిమితి పెంచాలి
న్యూఢిల్లీ: ప్రత్యామ్నాయ పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కేంద్రం పన్ను మినహాయింపు పరిమితిని, గరిష్ట పన్ను శ్లాబులోకి వచ్చే ఆదాయ పరిమితిని పెంచాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే కొన్ని మినహాయింపులను కూడా 2023–24 బడ్జెట్లో అనుమతించాలని వారు సూచించారు. 2020–21 బడ్జెట్లో కేంద్రం .. సాంప్రదాయ ట్యాక్స్ శ్లాబ్‌లకు ప్రత్యామ్నాయంగా ఐచ్ఛిక ఆదాయ పన్ను విధానాన్ని కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో హెచ్ఆర్ఏ, గృహ రుణంపై వడ్డీలు, ఇతరత్రా కొన్ని పెట్టుబడులకు మినహాయింపులను క్లెయిమ్ చేసుకోకుండా ఉంటే పన్ను భారం తక్కువగా ఉండేలా ప్రతిపాదనలు చేసింది. దీని ప్రకారం రూ. 2.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. రూ. 15 లక్షలు దాటితే గరిష్టంగా 30 శాతం పన్ను ఉంటుంది. అయితే దీనివల్ల పన్ను భారం అధికంగా ఉంటోందని ఎవరూ ఈ ప్రత్యామ్నాయ విధానంపై ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలోనే దీన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. వారి సూచనలు ఏమిటంటే .. ► నాంగియా అండర్సన్ ఇండియా చైర్మన్ రాకేశ్ నాంగియా: పెట్టుబడులు, సామాజిక భద్రత సంబంధ డిడక్షన్లను ప్రత్యామ్నాయ పన్ను విధానంలోనూ అందుబాటులో ఉంచాలి. అలాగే పన్ను రేట్లను మరింతగా క్రమబద్ధీకరించాలి. ► డెలాయిట్ ఇండియా పార్ట్నర్ సుధాకర్ సేతురామన్: జీవిత బీమా ప్రీమియంలు, గృహ రుణ రీపేమెంట్, గృహ రుణాలపై వడ్డీ చెల్లింపుల్లాంటి మినహాయింపులను అనుమతించాలి. సింగపూర్, హాంకాంగ్ తదితర దేశాల తరహాలో గరిష్ట ట్యాక్స్ రేటును 30 శాతంగా కాకుండా 25 శాతానికి తగ్గించాలి. ► ఈవై ట్యాక్స్ పార్ట్నర్ అమర్‌పాల్ ఎస్ చడ్ఢా: రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్, రూ. 2.5 లక్షల వరకు ఇతరత్రా మినహాయింపులను అనుమతించాలి. ప్రాథమిక ఎగ్జెంప్షన్ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలి. 30 శాతం ట్యాక్స్ రేటును రూ. 15 లక్షలు కాకుండా రూ. 20 లక్షలపైన ఆదాయానికి వర్తింపచేయాలి. ► ఏకేఎం గ్లోబల్ పార్ట్నర్ సందీప్ సెహ్గల్: 30 శాతం ట్యాక్స్ రేటును రూ. 20 లక్షల పైగా ఆదాయానికే వర్తింపచేయాలి. రూ. 5 లక్షల లోపు ఆదాయం గల వారికి రిబేటు ఇవ్వాలి. ఆలస్యంగా రిటర్ను వేసే వారికి కూడా ప్రత్యామ్నాయ పన్ను విధానం అందుబాటులో ఉంచాలి. -
డీఆర్టీలో కేసు దాఖలుకు ‘పరిమితి’ రెట్టింపు
న్యూఢిల్లీ: బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ రుణ బకాయిలు రాబట్టుకునే విషయంలో డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ)లో కేసు దాఖలుకు అవసరమైన మొత్తాల పరిమితిని గురువారం కేంద్రం రూ. 20 లక్షలకు పెంచింది. ఆర్థికశాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకూ ఈ పరిమితి 10 లక్షలు. దీనివల్ల ఇకపై రూ.20 లక్షల పైబడిన బకాయిలను రాబట్టుకోడానికి మాత్రమే డీఆర్టీని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆశ్రయించగలుగుతాయి. డీఆర్టీలో అధిక సంఖ్యలో కేసులు పేరుకుపోతుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. దేశంలో 39 డీఆర్టీలు ఉన్నాయి. -
ఐదుగురికి మాత్రమే..!
న్యూఢిల్లీ : ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్‌పై కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి. మెసేజ్‌లు, ఇమేజ్‌లు, వీడియోలు ఒకేసారి పెద్ద సంఖ్యలో షేర్ చేయకుండా ఐదుగురికి మాత్రమే వాటిని పంపేలా ‘వాట్సాప్’ నియంత్రణ చర్యలు చేపట్టింది. ఈ విధానాన్ని శుక్రవారం నుంచి ప్రయోగాత్మకంగా మొదలుపెడుతున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఇటీవల వాట్సాప్ ద్వారా వదంతులతో పాటు నకిలీ వార్తల ప్రచారం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పిల్లలను ఎత్తుకెళుతున్నారనే ‘ఫేక్‌వార్తలు’ విస్తృ తంగా ప్రచారం కావడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగానే మారింది. ఈ నకిలీ వార్తలు పలు రాష్ట్రాల్లో మూకోన్మాదానికి దారి తీసింది. వీటి కారణంగా ఈ ఏడాదిలో 31 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. జవాబుదారీతనం పెంచడంతో పాటు, చట్టాలను మరింత మెరుగ్గా అమలు చేసేందుకు వీలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రం వాట్సాప్ సంస్థకు గురువారం రెండో లేఖ పంపింది. ప్రజలను రెచ్చగొట్టే పుకార్ల నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ సంస్థకు కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ ఈ నెల మొదట్లో హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒకేసారి ఐదుగురికే మెసేజ్‌లు, ఇమేజ్‌లు, వీడియోలు పంపేలా వాట్సాప్ కీలక మార్పు చేసింది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్‌గా కొనసాగుతున్న వాట్సాప్ ద్వారా భద్రతా, గోప్యతాను కాపాడేందుకు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నట్టు పేర్కొంది. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని ఫీచర్లతో ఈ యాప్‌ను మరింత మెరుగుపరచనున్నట్టు ప్రకటించింది. కుటుంబ సభ్యులు, మిత్రులతో సులభమైన పద్ధతుల్లో సంభా షించేందుకు వీలుగా వాట్సాప్‌ను ఓ ప్రైవేట్ మెసేజింగ్ యాప్‌గా రూపొందించినట్టు స్పష్టం చేసింది. దీనిలో భాగంగా కొన్నేళ్ల క్రితం ఒకేసారి లెక్కకు మించి చాట్లకు మెసేజ్‌లు ఫార్వర్డ్ చేసేందుకు వీలు కల్పించే ఫీచర్ జత చేసినట్టు తెలిపింది. ఇప్పుడు ఈ పద్ధతికి స్వస్తి పలికి వాట్సాప్ యూజర్లందరికీ వర్తించేలా ఒకసారి ఐదుగురికి మాత్రమే మెసేజ్ ఫార్వర్డ్ చేసే విధానాన్ని శుక్రవారం నుంచి ప్రయోగాత్మకంగా మొదలుపెడుతున్నట్టు పేర్కొంది. తాము ప్రవేశపెడుతున్న మార్పులతో ప్రైవేట్ మెసేజింగ్ యాప్‌గా డిజైన్ చేసిన వాట్సాప్ ఉద్దేశం నేరవేరుతుందని భావిస్తున్నట్టు తెలిపింది. ప్రపంచంలోనే అత్యధికంగా ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లు ఫార్వర్డ్ చేస్తున్నది భారత వాట్సాప్ యూజర్లే. ఒకేసారి ఐదుగురికే వీటిని ఫార్వర్డ్ చేసేలా నియంత్రణతో పాటు ప్రస్తుతం తమ యాప్‌లో మీడియా మెసేజెస్‌కు పక్కనే ఉన్న క్విక్ ఫార్వర్డ్ బటన్ తొలగించనున్నట్టు ఆ సంస్థ తెలిపింది. వాట్సాప్ యూజర్లు సొంతంగా పంపించే(ఒరిజినల్) మెసేజ్ ఏదో, ఫార్వర్డ్ చేసిన మెసేజ్ ఏదో గుర్తించే ఫార్వర్డ్ లేబుల్‌ను కూడా ఈ సంస్థ ఇటీవలే ప్రారంభించింది. -
బంగారంపై వదంతులు నమ్మొద్దు
-
బంగారంపై వదంతులు నమ్మొద్దు
► చట్టబద్ధంగా సమకూర్చుకుంటే ఒకరి వద్ద ఎంత బంగారమైనా ఉండొచ్చు ► పరిమితులేమీ పెట్టబోవడం లేదు ►కేంద్ర ఆర్థికశాఖ, కేంద్ర ప్రత్యక్షపన్నుల బోర్డు (సీబీడీటీ) స్పష్టీకరణ వదంతి: నల్లధనంపై భారీగా 85 శాతం పన్ను ప్రతిపాదించినట్లుగానే... ఐటీ చట్టానికి తెస్తున్న సవరణలో పెద్ద మొత్తంలో బంగారం, బంగారు ఆభరణాలు ఉంటే కూడా పన్నులు, జరిమానాలు వేయనున్నారు. లాకర్లన్నీ తనిఖీ చేస్తారు. వాస్తవం (సీబీడీటీ వివరణ): అలాంటిదేమీ లేదు. లెక్కల్లో చూపని ఆదాయంపై పన్నును పెంచడానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 115బీబీఈకి సవరణ ప్రతిపాదించారు. ప్రస్తుతం 30 శాతం ఉన్న గరిష్ట పన్నును 60 శాతానికి పెంచుతారు. దీనిపై 25 శాతం సర్‌చార్జి వేస్తారు. అంటే పన్ను 75 శాతానికి చేరుతుంది. లెక్కచూపని ఆదాయంగా నిర్ధారణ అయితే మరో 10 శాతం జరిమానా విధిస్తారు. తద్వారా పట్టుబడిన నల్లధనంలో 85 శాతం ప్రభుత్వానికే పొతుంది. మంగళవారం లోక్‌సభ ఆమోదం పొంది రాజ్యసభ ముందున్న ఈ సవరణ బిల్లులో బంగారంపై ఎలాంటి కొత్త పన్నును ప్రతిపాదించలేదు. ♦ ప్రకటిత ఆదాయంతో కొన్న బంగారంపై ఎలాంటి కొత్త పన్ను, జరిమానా ఉండదు. ♦ వ్యవసాయరంగం లాంటి మినహాయింపున్న రంగం నుంచి వచ్చిన ఆదాయంతో బంగారం కొన్నా కొత్తపన్నేమీ వేయరు. ♦ ఇల్లాలు దాచిన డబ్బుతో కొన్నా... కొత్తగా పన్ను ఉండదు. అయితే ఇలాంటి బంగారం పరిమాణం సహేతుకంగా ఉండాలి. ఆదాచేయగలిగేది ఎంత? కొన్నది ఎంతనే దానికి పొంతన ఉండాలి. ♦ వారసత్వంగా పూర్వీకుల నుంచి వచ్చిన బంగారం లేదా ఆభరణాలపైనా పన్నువేయరు. ♦ ప్రస్తుతం ఉన్న చట్టాల్లోనూ ఇలాంటి నిబంధనలు లేవు... ప్రతిపాదిత సవరణల్లోనూ ఇలాంటివేమీ పెట్టలేదు. వదంతి: వివాహిత 500 గ్రాములు (50 తులాలు), అవివాహిత మహిళ 250 గ్రాములు (25 తులాలు), పురుషుడి వద్ద 100 గ్రాముల (10 తులాలు)కు మించి ఉంటే... ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుంటారు. దీనిపై భారీ పన్ను వేస్తారు. వాస్తవం: నిజం కాదు. కొత్త చట్టంలో బంగారంపై అదనపు పన్నులు వేయడం, పన్ను పెంచడం లాంటివేమీ చేయలేదు. ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తున్నపుడు కూడా వివాహిత వద్ద 50 తులాలు, అవివాహిత అయితే 25 తులాలు, పురుషుడి వద్ద 10 తులాలకు పైగా ఉంటేనే... వాటిని స్వాధీనం చేసుకోవాలని, పైన చెప్పిన దానికన్నా తక్కువ ఉంటే అలాంటి బంగారం, ఆభరణాల జోలికి వెళ్లకూడదనే నిబంధన ఉంది. బంగారంపై కొత్త పన్నులేమీ ప్రతిపాదించలేదని వివరణ ఇస్తూ ఐటీ శాఖ పై నిబంధనను ఉటంకించింది. దీనికి కూడా వక్రభాష్యం చెప్పి... 50 తులాల కంటే ఎక్కువుంటే స్వాధీనం చేసేసుకుంటారని పుకార్లు లేవదీశారు. ♦ చట్టబద్ధంగా సమకూరినదైతే ఒక వ్యక్తి తన వద్ద ఎంత బంగారమైనా ఉంచుకోవచ్చు. అనేదానిపై పరిమితులేమీ పెట్టబోవడం లేదు. ♦ ఒకవేళ దాడులు జరిగినపుడు 50 తులాలకు మించి ఉన్నా... ఆయా వర్గాల ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకోవద్దని ప్రభుత్వం ఐటీ శాఖకు ఆదేశాలు జారీచేసింది. ♦ బంగారంపై వస్తున్న పుకార్లను ఖండించడానికి, ఒక వ్యక్తి తన వద్ద ఎంత బంగారం ఉంచుకోవచ్చనే పరిమితిపై వివరణ ఇవ్వడానికి గురువారం ఆర్థిక శాఖ రెండుసార్లు ప్రకటనను విడుదల చేసింది. -సాక్షి నాలెడ్జ్ సెంటర్