న్యూఢిల్లీ : ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్‌పై కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి. మెసేజ్‌లు, ఇమేజ్‌లు, వీడియోలు ఒకేసారి పెద్ద సంఖ్యలో షేర్ చేయకుండా ఐదుగురికి మాత్రమే వాటిని పంపేలా ‘వాట్సాప్’ నియంత్రణ చర్యలు చేపట్టింది. ఈ విధానాన్ని శుక్రవారం నుంచి ప్రయోగాత్మకంగా మొదలుపెడుతున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఇటీవల వాట్సాప్ ద్వారా వదంతులతో పాటు నకిలీ వార్తల ప్రచారం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పిల్లలను ఎత్తుకెళుతున్నారనే ‘ఫేక్‌వార్తలు’ విస్తృ తంగా ప్రచారం కావడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగానే మారింది. ఈ నకిలీ వార్తలు పలు రాష్ట్రాల్లో మూకోన్మాదానికి దారి తీసింది. వీటి కారణంగా ఈ ఏడాదిలో 31 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
జవాబుదారీతనం పెంచడంతో పాటు, చట్టాలను మరింత మెరుగ్గా అమలు చేసేందుకు వీలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రం వాట్సాప్ సంస్థకు గురువారం రెండో లేఖ పంపింది. ప్రజలను రెచ్చగొట్టే పుకార్ల నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ సంస్థకు కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ ఈ నెల మొదట్లో హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒకేసారి ఐదుగురికే మెసేజ్‌లు, ఇమేజ్‌లు, వీడియోలు పంపేలా వాట్సాప్ కీలక మార్పు చేసింది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్‌గా కొనసాగుతున్న వాట్సాప్ ద్వారా భద్రతా, గోప్యతాను కాపాడేందుకు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నట్టు పేర్కొంది. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని ఫీచర్లతో ఈ యాప్‌ను మరింత మెరుగుపరచనున్నట్టు ప్రకటించింది.
కుటుంబ సభ్యులు, మిత్రులతో సులభమైన పద్ధతుల్లో సంభా షించేందుకు వీలుగా వాట్సాప్‌ను ఓ ప్రైవేట్ మెసేజింగ్ యాప్‌గా రూపొందించినట్టు స్పష్టం చేసింది. దీనిలో భాగంగా కొన్నేళ్ల క్రితం ఒకేసారి లెక్కకు మించి చాట్‌లకు మెసేజ్‌లు ఫార్వర్డ్ చేసేందుకు వీలు కల్పించే ఫీచర్ జత చేసినట్టు తెలిపింది. ఇప్పుడు ఈ పద్ధతికి స్వస్తి పలికి వాట్సాప్ యూజర్లందరికీ వర్తించేలా ఒకసారి ఐదుగురికి మాత్రమే మెసేజ్ ఫార్వర్డ్ చేసే విధానాన్ని శుక్రవారం నుంచి ప్రయోగాత్మకంగా మొదలుపెడుతున్నట్టు పేర్కొంది.
తాము ప్రవేశపెడుతున్న మార్పులతో ప్రైవేట్ మెసేజింగ్ యాప్‌గా డిజైన్ చేసిన వాట్సాప్ ఉద్దేశం నేరవేరుతుందని భావిస్తున్నట్టు తెలిపింది. ప్రపంచంలోనే అత్యధికంగా ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లు ఫార్వర్డ్ చేస్తున్నది భారత వాట్సాప్ యూజర్లే. ఒకేసారి ఐదుగురికే వీటిని ఫార్వర్డ్ చేసేలా నియంత్రణతో పాటు ప్రస్తుతం తమ యాప్‌లో మీడియా మెసేజెస్‌కు పక్కనే ఉన్న క్విక్ ఫార్వర్డ్ బటన్ తొలగించనున్నట్టు ఆ సంస్థ తెలిపింది. వాట్సాప్ యూజర్లు సొంతంగా పంపించే(ఒరిజినల్) మెసేజ్ ఏదో, ఫార్వర్డ్ చేసిన మెసేజ్ ఏదో గుర్తించే ఫార్వర్డ్ లేబుల్‌ను కూడా ఈ సంస్థ ఇటీవలే ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment