local body elections- 2014
-
బ్యాలెట్ పేపర్ల ముద్రణ తనిఖీ
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: వివిధ ప్రింటింగ్ ప్రెస్‌లలో ముద్రిస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలను గురువారం కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తనిఖీ చేశారు. ముద్రణ ఎప్పటివరకు పూర్తవుతాయని అడిగి తెలుసుకున్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, జెడ్పీ డెప్యూటీ సీఈవో సత్యవతి ఉన్నారు. కోడ్ ఉల్లంఘిస్తే నేరుగా తెలపండి : ఎన్నికల అధికారి ఉషారాణి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తున్నట్లు భావిస్తే తమకు నేరుగా తెలపాలని ఎన్నికల రాష్ట్ర పరిశీలకులు వి.ఉషారాణి పేర్కొన్నారు. వి.ఉషారాణి సెల్ నంబర్ 81796 75804, సి.పార్థసారథి సెల్ నంబర్ 81790 24803 కు సమాచారం ఇవ్వొచ్చన్నారు. 29న జెడ్పీటీసీ అభ్యర్థులకు అవగాహన జెడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీచేస్తున్న జగిత్యాల, పెద్దపల్లి, మంథని డివిజన్ అభ్యర్థులకు ఈ నెల 29న ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించనున్నట్లు రిటర్నింగ్ అధికారి విజయ్‌గోపాల్ తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం ఉంటుందన్నారు. -
ఇదీ ప్రాదేశిక షెడ్యూల్
నల్లగొండ, న్యూస్‌లైన్ ప్రాదేశిక ఎన్నికల షెడ్యూల్ ఎట్టకేలకు ఖరారైంది. వివిధ కారణాల దృష్ట్యా ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించాలని జిల్లా అధికారులు ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు పంపారు. ఈ మేర కు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి గురువారం ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. కానీ తొలుత ప్రతిపాదించిన ప్రకారం కాకుండా ఎన్నికల తేదీల్లో మార్పులు చేశారు. మొదటి విడత పోలింగ్ యధావిధిగానే ఏప్రిల్ 6 తేదీన నిర్వహిస్తారు. రెండో విడత పోలింగ్ మాత్రం ఏప్రిల్ 8న కాకుండా 11వ తేదీకి వాయిదా వేశారు. 8న శ్రీరామనవమి పండుగ ఉన్నందున రెండో విడత పోలింగ్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 11న కాకుండా మే 7 తేదీ తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు. ప్రాదేశిక ఎన్నికల ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడకుండా ఉండేందుకు ఈ మార్పు చేయాల్సి వచ్చింది. మే 7 తేదీ నాటికి సార్వత్రిక ఎన్నికలు పూర్త్తవుతాయి. -
ఎంపీపీలుగా.. జెడ్పీటీసీలుగా..
హాలియా, న్యూస్‌లైన్ : ఎంపీపీగా పనిచేసి.. ఆ తర్వాతి ఎన్నికల్లో జెడ్పీటీసీలుగా పోటీ చేసి గెలిచారు సాగర్ నియోజకవర్గ నేతలిద్దరు. పెద్దవూర మండలానికి చెందిన కర్నాటి లింగారెడ్డి, త్రిపురారం మండలానికి చెందిన ఇస్లావత్ రాంచందర్ నాయక్‌లు గతంలో ఆయా మండలాల్లో ఎంపీపీలుగా పనిచేయడంతో పాటు జెడ్పీటీసీ సభ్యులుగా పనిచేశారు. రెండు సార్లు ఎంపీపీగా.. పెద్దవూర మండల కేంద్రానికి చెందిన కర్నాటి లింగారెడ్డి 1983లోరాజకీయ జీవితం ప్రారంభించారు. 1983-86 వరకు ఆప్కాబ్ డెరైక్టర్‌గా పనిచేశారు. ఆ తరువాత 1987-92 వరకు మొదటిసారి పెద్దవూర ఎంపీపీగా పనిచేశారు. ఆ తరువాత 2001లో జరిగిన ఎన్నికల్లో అదే మండలం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికై 2001-06 వరకు పనిచేశారు. 2005-11 వరకు రెండు పర్యాయాలు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పాలక మండలి సభ్యుడిగా పనిచేశారు. 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన మరల ఎంపీటీసీగా ఎన్నికై 2006-11 వరకు రెండోసారి పెద్దవూర ఎంపీపీగా పనిచేశారు. ఈసారి కూడా పెద్దవూర జెడ్పీటీసీ జనరల్ కావడంతో ఆయన జెడ్పీటీసీగా నామినేషన్ వేసి ఎన్నికల బరిలో ఉన్నారు. ఒకసారి ఎంపీపీగా.. త్రిపురారం మండలం సత్యంపాడు తండాకు చెందిన ఇస్లావత్ రాంచందర్ నాయక్, 1987లో సీపీఎం నుంచి ఎంపీటీసీగా ఎన్నికై త్రిపురారం ఎంపీపీగా పని చేశారు. ఆ తరువాత 1998లో సీపీఎం (బీఎన్‌రెడ్డి పార్టీ ) తరఫున మిర్యాలగూడెం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేశారు. 2001లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున త్రిపురారం జెడ్పీటీసీగా ఎన్నికై 2001-06వరకు జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌గా పనిచేశారు. ఆ తరువాత 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు. 2010 జూలైలో కాంగ్రెస్‌లో చేరారు. -
ప్రచార హోరు
ప్రచారానికి గడువు సమీపిస్తుండడంతో ఆయా మున్సిపాలిటీల్లో అభ్యర్థులు జోరు పెంచారు. ఎండలను సైతం లెక్క చేయకుండా ఇంటింటికీ తిరుగు తున్నారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పలు పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. వార్డుల్లో కలియ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రారంభంలో కొద్దిమందితో ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు రోజురోజుకూ మందీ మార్బలాన్ని పెంచుతున్నారు. ఒకరిని చూసి మరొకరు పెద్ద సంఖ్యలో జనాలను పోగేసుకుని ప్రచార హోరులో మునిగిపోయారు. తాండూరు- ఆశీర్వదించమ్మా.. 22వ వార్డులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి వరలక్ష్మి ప్రచారం వికారాబాద్- అవ్వా నీ ఓటు నాకే: కొత్తగడిలో ఓ వృద్ధురాలిని ఓటు వేయాలని కోరుతున్న టీడీపీ చైర్మన్ అభ్యర్థి చిగుళ్లపల్లి రమేష్‌కుమార్ -
బేరసారాలు మొదలు !
ఉపసంహరణకు రూ.లక్షలు నజరానా ? రెబల్స్‌ను బుజ్జగిస్తున్న పార్టీల నేతలు ‘స్థానిక’ పోరులో అభ్యర్థుల హైరానా బీఫాం కోసం నేతల చుట్టూ ప్ర‘దక్షిణ’లు! ఖమ్మం: స్థానిక పోరులో ఇక బేరసారాలకు తెర లేచింది. నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ అభ్యర్థులకు ఆఫర్లమీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. లక్షల రూపాయలు నజరానా ఇచ్చేందుకు మధ్యవర్తులతో మంతనాలు జరుపుతున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ప్రస్తుతం ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఉపసంహరణ గడువు దగ్గర పడుతుండడంతో ఎవరికివారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా 640 ఎంపీటీసీ స్థానాలకు నాలుగు వేలకు పైగా నామినేషన్లు, 46 జెడ్పీటీసీలకు 497 నామినేషన్లు దాఖలయ్యాయి. కొన్ని పార్టీలు ఒక స్థానం నుంచి ఒక్క అభ్యర్థినే బరిలోకి దించితే.. మరికొన్ని పార్టీల నుంచి ఒక్కో స్థానానికి ముగ్గురు, నలుగురు వరకు నామినేషన్లు వేశారు. ప్రధానంగా ఎంపీటీసీ నామినేషన్లలో ఈ పరిస్థితి కనిపించింది. నేతల హామీలతో వారి అనుచరగణమంతా ఎవరికివారు తమది ఫలానా పార్టీ అని పేర్కొంటూ ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేశారు. ఒక్కో స్థానానికి ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వేయడంతో ఇప్పుడు ఎవరు బరిలో ఉంటారు..?ఎవరు పోటీ నుంచి తప్పుకుంటారనే చర్చ ఆయా పార్టీల్లో కొనసాగుతోంది. కొత్తగూడెం, ఇల్లెందు, పాలేరు, మధిర, భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి రెబల్ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇల్లెందు నియోజకవర్గంలో అన్ని ఎంపీటీసీ స్థానాలకు మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి అనుచరులు పోటీగా నామినేషన్లను వేసి వర్గపోరు సమసిపోలేదని నిరూపించారు. అలాగే పార్టీల తరఫున బీఫాం వస్తుందో..రాదోనని మరికొంత మంది స్వతంత్రులుగా కూడా నామినేషన్ వేశారు. ఇలా పార్టీల తరఫున ఒక్కో ఎంపీటీసీ స్థానానికి ఎక్కువ సంఖ్యలో నామినేషన్ వేయడంతో ఎవరిని బుజ్జగించాలన్నది ఇప్పుడు నాయకులకు తలనొప్పిగా మారింది. బుజ్జగింపులు.. నజరానాలు.. నామినేషన్ల పరిశీలన ముగియడం, ఉప సంహరణ గడువు దగ్గర పడుతుండడంతో ఎవరిని బరిలో ఉంచాలన్నది పార్టీ నేతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. బరిలో తప్పకుండా నిలవాలనుకనే వారు.. నామినేషన్ వేసిన వారికి ఎంతోకొంత నజరానా ఇవ్వాల్సిందేనని ఇప్పటికే నేతలు అభ్యర్థుల ముందు ప్రస్తావన తెచ్చారని తెలుస్తోంది. ఎంపీటీసీకి రిజర్వేషన్ ఆధారంగా రూ. లక్ష నుంచి రూ.2 లక్షల పైగా బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. మండలపరిషత్ పీఠం దక్కించుకోవాలనుకుంటున్న అభ్యర్థులు ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చ నడుస్తోంది. కొన్ని చోట్ల వర్గాల వారీగా నామినేషన్లు వేయడంతో ఇక్కడ బుజ్జగింపులు ఉండవని, ప్రత్యక్ష పోరులోనే అమీతుమీ తేల్చుకుంటామని ఆయా పార్టీల నేతలు అంటున్నారు. బీ ఫారానికీ ‘రేటు’.. కొన్ని పార్టీల తీరు ఎలా ఉందంటే....పార్టీ తరఫున బరిలో దిగే అభ్యర్థులకు రెండువైపులా చిలుము వదిలే పరిస్థితి ఎదురవుతోంది. రెబల్స్‌ను బుజ్జగించడానికి నజరానా ఇవ్వడం ఒకటయితే.. బీఫాం దక్కించుకోవడానికి కూడా జేబు ఖాళీ అవుతోంది. ఎక్కువ ఓటర్లు ఉండి, రాజకీయంగా పలుకుబడి ఉండే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పార్టీ తరఫున బీఫాం దక్కాలంటే.. ఆయా నేతలు నిర్ణయించిన రేటుకు తల ఊపాల్సిందే. నామినేషన్ వేసిన అభ్యర్థులు పార్టీ బీఫాం దక్కించుకోవడానికి తమకు తెలిసిన నేతల ద్వారా అసలు నేతలతో బేరసారాలకు తెరలేపారు. నామినేషన్ వేసినా పార్టీ గుర్తింపు లేకపోతే విజయం వరించదన్న భావనతో బీఫాం కోసమే రూ.లక్షలు ముట్టజెప్పడానికి కూడా కొందరు అభ్యర్థులు వెనుకాడడం లేదని సమాచారం. నామినేషన్ల ఉప సంహరణకు ఇక మూడు రోజులే గడువు ఉండడంతో మధ్యవర్తులతో ప్రయోజనం లేదని భావిస్తున్న కొంతమంది అభ్యర్థులు ఏకంగా నేతల ఇంటి చుట్టూ అప్పుడే ప్రదక్షిణలు చేస్తున్నారు.