బేరసారాలు మొదలు !
ఉపసంహరణకు రూ.లక్షలు నజరానా ?
రెబల్స్‌ను బుజ్జగిస్తున్న పార్టీల నేతలు
‘స్థానిక’ పోరులో అభ్యర్థుల హైరానా
బీఫాం కోసం నేతల చుట్టూ ప్ర‘దక్షిణ’లు!
ఖమ్మం: స్థానిక పోరులో ఇక బేరసారాలకు తెర లేచింది. నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ అభ్యర్థులకు ఆఫర్లమీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. లక్షల రూపాయలు నజరానా ఇచ్చేందుకు మధ్యవర్తులతో మంతనాలు జరుపుతున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ప్రస్తుతం ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఉపసంహరణ గడువు దగ్గర పడుతుండడంతో ఎవరికివారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
జిల్లా వ్యాప్తంగా 640 ఎంపీటీసీ స్థానాలకు నాలుగు వేలకు పైగా నామినేషన్లు, 46 జెడ్పీటీసీలకు 497 నామినేషన్లు దాఖలయ్యాయి. కొన్ని పార్టీలు ఒక స్థానం నుంచి ఒక్క అభ్యర్థినే బరిలోకి దించితే.. మరికొన్ని పార్టీల నుంచి ఒక్కో స్థానానికి ముగ్గురు, నలుగురు వరకు నామినేషన్లు వేశారు. ప్రధానంగా ఎంపీటీసీ నామినేషన్లలో ఈ పరిస్థితి కనిపించింది. నేతల హామీలతో వారి అనుచరగణమంతా ఎవరికివారు తమది ఫలానా పార్టీ అని పేర్కొంటూ ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేశారు.
ఒక్కో స్థానానికి ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వేయడంతో ఇప్పుడు ఎవరు బరిలో ఉంటారు..?ఎవరు పోటీ నుంచి తప్పుకుంటారనే చర్చ ఆయా పార్టీల్లో కొనసాగుతోంది. కొత్తగూడెం, ఇల్లెందు, పాలేరు, మధిర, భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి రెబల్ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్‌లు దాఖలు చేశారు. ఇల్లెందు నియోజకవర్గంలో అన్ని ఎంపీటీసీ స్థానాలకు మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి అనుచరులు పోటీగా నామినేషన్లను వేసి వర్గపోరు సమసిపోలేదని నిరూపించారు.
అలాగే పార్టీల తరఫున బీఫాం వస్తుందో..రాదోనని మరికొంత మంది స్వతంత్రులుగా కూడా నామినేషన్ వేశారు. ఇలా పార్టీల తరఫున ఒక్కో ఎంపీటీసీ స్థానానికి ఎక్కువ సంఖ్యలో నామినేషన్ వేయడంతో ఎవరిని బుజ్జగించాలన్నది ఇప్పుడు నాయకులకు తలనొప్పిగా మారింది.
బుజ్జగింపులు.. నజరానాలు..
నామినేషన్ల పరిశీలన ముగియడం, ఉప సంహరణ గడువు దగ్గర పడుతుండడంతో ఎవరిని బరిలో ఉంచాలన్నది పార్టీ నేతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. బరిలో తప్పకుండా నిలవాలనుకనే వారు.. నామినేషన్ వేసిన వారికి ఎంతోకొంత నజరానా ఇవ్వాల్సిందేనని ఇప్పటికే నేతలు అభ్యర్థుల ముందు ప్రస్తావన తెచ్చారని తెలుస్తోంది. ఎంపీటీసీకి రిజర్వేషన్ ఆధారంగా రూ. లక్ష నుంచి రూ.2 లక్షల పైగా బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. మండలపరిషత్ పీఠం దక్కించుకోవాలనుకుంటున్న అభ్యర్థులు ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చ నడుస్తోంది. కొన్ని చోట్ల వర్గాల వారీగా నామినేషన్లు వేయడంతో ఇక్కడ బుజ్జగింపులు ఉండవని, ప్రత్యక్ష పోరులోనే అమీతుమీ తేల్చుకుంటామని ఆయా పార్టీల నేతలు అంటున్నారు.
బీ ఫారానికీ ‘రేటు’..
కొన్ని పార్టీల తీరు ఎలా ఉందంటే....పార్టీ తరఫున బరిలో దిగే అభ్యర్థులకు రెండువైపులా చిలుము వదిలే పరిస్థితి ఎదురవుతోంది. రెబల్స్‌ను బుజ్జగించడానికి నజరానా ఇవ్వడం ఒకటయితే.. బీఫాం దక్కించుకోవడానికి కూడా జేబు ఖాళీ అవుతోంది. ఎక్కువ ఓటర్లు ఉండి, రాజకీయంగా పలుకుబడి ఉండే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పార్టీ తరఫున బీఫాం దక్కాలంటే.. ఆయా నేతలు నిర్ణయించిన రేటుకు తల ఊపాల్సిందే.
నామినేషన్ వేసిన అభ్యర్థులు పార్టీ బీఫాం దక్కించుకోవడానికి తమకు తెలిసిన నేతల ద్వారా అసలు నేతలతో బేరసారాలకు తెరలేపారు. నామినేషన్ వేసినా పార్టీ గుర్తింపు లేకపోతే విజయం వరించదన్న భావనతో బీఫాం కోసమే రూ.లక్షలు ముట్టజెప్పడానికి కూడా కొందరు అభ్యర్థులు వెనుకాడడం లేదని సమాచారం. నామినేషన్ల ఉప సంహరణకు ఇక మూడు రోజులే గడువు ఉండడంతో మధ్యవర్తులతో ప్రయోజనం లేదని భావిస్తున్న కొంతమంది అభ్యర్థులు ఏకంగా నేతల ఇంటి చుట్టూ అప్పుడే ప్రదక్షిణలు చేస్తున్నారు.