ఎమ్మెల్యే ను తాళ్లతో కట్టేశారు!
చాందౌలీ(యూపీ): బబ్బన్ సింగ్ చౌహాన్..ఆయనొక ఎమ్మెల్యే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముఘాల్ సారాయ్ నియోజవర్గం నుంచి ఎన్నికైన బీఎస్పీ (బహుజన్ సమాజ్ పార్టీ)కి చెందిన ప్రజాప్రతినిధి. అయితే ప్రజా సమస్యలు తెలుసుకుందామని శనివారం చాందౌలీ గ్రామంలో మూడో వార్డుకు వెళ్లారు. ఇక్కడ ఆయనకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. తమ నియోజకవర్గంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆగ్రహించిన గ్రామస్తులు ఆ సదరు ఎమ్మెల్యేతో వాగ్వివాదానికి దిగారు. ప్రధానంగా గ్రామంలో నిత్యవసరమైన తాగు నీరు, విద్యుత్ లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాతమను పట్టించుకునే నాథుడే లేడంటూ తీవ్ర ఆందోళన చేపట్టారు.
అంతటితో ఆగకుండా ఆ ఎమ్మెల్యేను, కౌన్సిలర్ ను కూడా నిర్బంధించారు. తాళ్లతో కట్టేసి తమ సమస్యకు ఇక్కడే పరిష్కారం చెప్పాలంటూ నిలదీశారు. 'మీరు గతంలో రూ.80లక్షల నిధులు తమ గ్రామానికి మంజూరు అయినా.. ఇప్పటివరకూ ఎటువంటి పనులు ఎందుకు చేపట్టలేదంటూ స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై తుదికంటూ పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నాడు.
ఎమ్మెల్యేను, కౌన్సిలర్ ను తాళ్లతో కట్టేసిన సమాచారం అందుకున్న ఎస్పీ మునిరాజ్ అక్కడకు హుటాహటీనా వెళ్లారు. గ్రామస్తులతో మాట్లాడి ఆ ఎమ్మెల్యేను, కౌన్సిలర్ ను గ్రామస్తుల నిర్బంధం నుంచి విడిపించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతోనే గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారని.. దీనిలో భాగంగానే వారిని బంధించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై ఎమ్మెల్యే బబ్బన్ సింగ్ చౌహాన్ ఎటువంటి ఫిర్యాదు చేయలేదని ఎస్పీ స్పష్టం చేశారు.