local court
-
గ్రామంలోని మహిళల బట్టలు ఉతకాలి.. నిందితుడికి కోర్టు ఆదేశం
పాట్నా: లైంగిక దాడికి యత్నించిన ఓ వ్యక్తికి బిహార్‌లోని కోర్టు వింత షరతులో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆరు నెలలపాటు గ్రామంలోని మహిళలందరి బట్టలు ఉచితంగా ఉతకడంతోపాటు ఇస్త్రీ చేయాలని స్థానిక కోర్టు బుధవారం తీర్పిచ్చింది. దీనికి అవసరమైన డిటర్జెంట్, ఇతర ఖర్చులను అతడే భరించాలని పేర్కొంది. కోర్టు నిర్ణయంతో ఆ గ్రామంలోని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బిహార్‌లోని మజోర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల లాలన్ కుమార్ బట్టలు ఉతుకుతూ జీవనోపాధి పొందేవాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. చదవండి: తన పెట్ డాగ్ కోసం విమానంలోని బిజినెస్ క్లాస్ సీట్లన్ని.. అప్పటి నుంచి అతడు జైల్లో ఉండగా.. అతని తరపు న్యాయవాది బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కొన్ని వింత షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఆరు నెలల పాటు గ్రామంలోని 2 వేల మంది మహిళల దుస్తులు ఉతికి, శుభ్రంగా ఇస్త్రీ చేయాలని షరతు విధించింది. ఈ పనికి ఎటువంటి డబ్బులు తీసుకోరాదని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దుచేస్తామని కోర్టు హెచ్చరించింది. చదవండి: వారెవ్వా ఆయుషి ! సర్దుకుపోలేదు.. సమస్యకు పరిష్కారం చూపింది అయితే కోర్టు బుధవారం ఇచ్చిన ఈ తీర్పుపై గ్రామంలోని సుమారు 2 వేల మంది మహిళలు హర్షం వ్యక్తం చేసినట్లు గ్రామ సర్పంచ్ నసీమా ఖాటూన్ తెలిపారు. ‘ఈ తీర్పు చారిత్రాత్మకమైంది. మహిళల గౌరవాన్ని పెంపొందిస్తుంది. మహిళల గౌరవాన్ని కాపాడటానికి సహాయపడుతుంది’ అని ఆమె అన్నారు. అలాగే మహిళలపై జరిగే అఘాయిత్యాల గురించి సమాజంలో చర్చించడంపై ఇది సానుకూల ప్రభావం చూపుతుందని ఆ గ్రామంలోని మహిళలు తెలిపారు. -
పరువు హత్య కేసులో సంచలన తీర్పు
ముంబై : మహారాష్ట్రలోని స్థానిక కోర్టు పరువు హత్య కేసులో సంచలన తీర్పునిచ్చింది. ముగ్గురు దళిత యువకులను క్రూరంగా హతమార్చినందుకు మరణశిక్ష విధిస్తూ జడ్జి ఆర్ఆర్ వైష్ణవ్ తీర్పుని వెలువరించారు. ఆహ్మద్‌నగర్ జిల్లాలోని సోనాయ్ గ్రామానికి చెందిన సచిన్ అనే యువకుడు ఇతర సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. దీనిపై అగ్రహించిన అమ్మాయి బంధువులు సచిన్‌తోపాటు సందీప్, రాహుల్‌ని 2013 జనవరి 1న అతి క్రూరంగా హతమార్చి, వారి శరీర అవయవాలను ముక్కలు ముక్కలుగా చేసి సెప్టిక్ ట్యాంకులో వేశారు. ఈ ఘటనలో రఘునాథ్, రమేశ్, ప్రకాశ్, గణేష్, అశోక్, సందీప్ కుర్హే లను దోషులుగా నిర్ధారించి ఊరి శిక్షతో పాటూ రూ. 20 వేల జరిమాను విధించింది. -
ఉగ్రవాదులకు మరణశిక్ష
కోల్‌కతా: పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులకు పశ్చిమబెంగాల్ స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. పాక్‌కు చెందిన మొహమద్ యూనస్, అబ్దుల్లాతో పాటు భారతీయుడైన ముజఫర్ అహ్మద్ రాథోడ్‌ను 2007లో బీఎస్ఎఫ్ జవాన్లు భారత్–బంగ్లా సరిహద్దుల్లో అరెస్ట్ చేశారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారని వీరిపై నమోదైన కేసును విచారించిన పశ్చిమబెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బాన్గాన్లోని న్యాయస్థానం వీరికి మరణశిక్ష విధించింది. అబ్దుల్లా కరాచీ నివాసి కాగా, యూనస్ స్వస్థలం హరిపూర్ అని చెప్పారు. ఇక రాథోడ్ జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ నుంచి వచ్చాడు. -
ఇంద్రాణి కస్టడీ పొడిగింపు
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాని నిందితురాలు షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా కస్టడీ మరింత పొడిగించారు. ఆమెతోపాటు ఆమె భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యాం రాయ్‌కు అక్టోబర్ 5 వరకు స్థానిక కోర్టు కస్టడీ విధించింది. 2012 ఏప్రిల్ నెలలో తన కన్న కూతురుని ఇంద్రాణి ముఖర్జీ దారుణంగా చంపేసి అనంతరం రాయఘడ్ అడవుల్లో పాతిపెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయం ఇటీవల వెలుగులోకి రావడంతో ఈ నెల ఓ రెండు రోజులపాటు సుధీర్ఘంగా ప్రశ్నించిన పోలీసులు అనంతరం ఆమెను సెప్టెంబర్ 7న స్థానిక కోర్టులో హాజరుపరిచారు. దాంతో కోర్టు ఈ నెల 21 వరకు కస్టడీ విధించగా అది నేటితో పూర్తయింది. దీంతో మరోసారి కోర్టుకు హాజరుపరిచి అక్టోబర్ 5 వరకు కస్టడీకి తీసుకున్నారు. -
మాజీ సీఎంకు ముందస్తు బెయిల్
పనాజీ: లూయీస్ బెర్గర్ లంచం కేసులో గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్‌కు కోర్టు బుధవారం ముందస్తుబెయిల్ మంజూరు చేసింది. లంచం కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉండడంతో కామత్ ముందస్తు బెయిల్ కోసం గోవా స్థానిక కోర్టును ఆశ్రయించారు. 2010లో గోవాలో తాగునీటి వనరుల అభివృద్ధి, మురుగునీటి పారుదల పైప్‌లైన్ నిర్మాణ ప్రాజెక్టు కన్సల్టెన్సీ కాంట్రాక్టు దక్కించుకునేందుకు న్యూజెర్సీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ లూయీస్ బెర్గర్ ఒక మంత్రికి లంచం ఇచ్చినట్టు ఇటీవల ఆమెరికా కోర్టుకు చెప్పింది. ఈ కేసులో ఇప్పటికే రెండుసార్లు కామత్‌ను పోలీసులు ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం జిల్లా, సెషన్స్ కోర్టులను ఆశ్రయించారు. గోవాలో నీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కించుకునేందుకు లూయీస్ బెర్గర్ కంపెనీ, గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మాజీ మంత్రి చర్చిల్ అలెమోలకు లంచంగా దాదాపు రూ. 6 కోట్లు ఇచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. లూయీస్ బెర్గర్ లంచం కేసులో ఇప్పటికే గోవా మాజీ మంత్రి చర్చిల్ అలెమోను అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసింది. -
ఆ రెండు రకాల అత్యాచారాలూ ఒకలాంటివే
న్యూఢిల్లీ: భర్త చేతిలో అత్యాచారానికి గురై భార్యను కూడా సాధారణ అత్యాచార బాధితురాలి మాదిరిగానే పరిగణించాలని స్థానిక కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. గర్భిణి అయిన భార్యతో అసహజ రతి జరిపిన భర్తకు బెయిల్ తిరస్కరిస్తూ అడిషనల్ సెషన్స్ జడ్జి కామినీలావు పైవ్యాఖ్యలు చేశారు. వైవాహిక జీవితాల్లో అత్యాచారాలకు బలవుతున్న మహిళలు మౌనంగా రోదిస్తున్నా చట్టం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ అత్యాచార బాధితురాలి మాదిరిగానే భర్తల వల్ల ఇబ్బందిపడే మహిళలకూ ప్రభుత్వ సాయమందించాలని అభిప్రాయపడ్డారు. తాను గర్భవతిగా ఉన్నప్పటికీ భర్త మద్యం సేవించి వచ్చి అసహజరతి కోసం ఇబ్బంది పెడుతున్నాడంటూ కేశవపురం మహిళ ఒకరు కోర్టుకు ఫిర్యాదు చేశారు. తొమ్మిదేళ్ల కొడుకుతోనూ శృంగారం గురించి మాట్లాడుతున్న నిందితుడి మానసికస్థితి సరిగ్గా లేనట్టు అర్థమవుతోందని కోర్టు పేర్కొంది. బాధితురాలికి భర్త అయినంత మాత్రాన అతనిపై జాలి చూపడం కుదరదని న్యాయమూర్తి కామిని స్పష్టం చేశారు. తాను భర్తపైనే ఆధారపడ్డందున అతణ్ని విడుదల చేయాలన్న బాధితురాలి విజ్ఞప్తిని తిరస్కరించారు. అత్తింటి వారి ఒత్తిడి మేరకే గర్భంతో ఉన్నా ఆమె స్వయంగా కోర్టుకు వచ్చి విజ్ఞప్తి చేసిందని పేర్కొన్నారు. ఈ కేసులో స్థానిక పోలీసుల దర్యాప్త సరిగ్గా లేదంటూ అక్కడి డీసీపీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసు నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి చర్యల కోసం బాధితురాలి ఆర్థిక, మానసికస్థితిని అంచనా వేసి నివేదిక సమర్పించాలని స్థానిక జాయింట్ కమిషనర్‌ను ఆదేశించారు. దీని ప్రతిని నగర కమిషనర్‌కూ పంపించాలన్నారు.