పాట్నా: లైంగిక దాడికి యత్నించిన ఓ వ్యక్తికి బిహార్‌లోని కోర్టు వింత షరతులో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆరు నెలలపాటు గ్రామంలోని మహిళలందరి బట్టలు ఉచితంగా ఉతకడంతోపాటు ఇస్త్రీ చేయాలని స్థానిక కోర్టు బుధవారం తీర్పిచ్చింది. దీనికి అవసరమైన డిటర్జెంట్, ఇతర ఖర్చులను అతడే భరించాలని పేర్కొంది. కోర్టు నిర్ణయంతో ఆ గ్రామంలోని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బిహార్‌లోని మజోర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల లాలన్ కుమార్ బట్టలు ఉతుకుతూ జీవనోపాధి పొందేవాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
చదవండి: తన పెట్ డాగ్ కోసం విమానంలోని బిజినెస్ క్లాస్ సీట్లన్ని..
అప్పటి నుంచి అతడు జైల్లో ఉండగా.. అతని తరపు న్యాయవాది బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కొన్ని వింత షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఆరు నెలల పాటు గ్రామంలోని 2 వేల మంది మహిళల దుస్తులు ఉతికి, శుభ్రంగా ఇస్త్రీ చేయాలని షరతు విధించింది. ఈ పనికి ఎటువంటి డబ్బులు తీసుకోరాదని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దుచేస్తామని కోర్టు హెచ్చరించింది.
చదవండి: వారెవ్వా ఆయుషి ! సర్దుకుపోలేదు.. సమస్యకు పరిష్కారం చూపింది
అయితే కోర్టు బుధవారం ఇచ్చిన ఈ తీర్పుపై గ్రామంలోని సుమారు 2 వేల మంది మహిళలు హర్షం వ్యక్తం చేసినట్లు గ్రామ సర్పంచ్ నసీమా ఖాటూన్ తెలిపారు. ‘ఈ తీర్పు చారిత్రాత్మకమైంది. మహిళల గౌరవాన్ని పెంపొందిస్తుంది. మహిళల గౌరవాన్ని కాపాడటానికి సహాయపడుతుంది’ అని ఆమె అన్నారు. అలాగే మహిళలపై జరిగే అఘాయిత్యాల గురించి సమాజంలో చర్చించడంపై ఇది సానుకూల ప్రభావం చూపుతుందని ఆ గ్రామంలోని మహిళలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment