lokopilots
-
రెల్వే రన్నింగ్ స్టాఫ్ అలవెన్స్ పెంపు
న్యూఢిల్లీ: రైల్వేలో రన్నింగ్ స్టాఫ్ (రైలుతోపాటు వెళ్లే ఉద్యోగులు) అయిన లోకో పైలట్లు, గార్డులకు ఇచ్చే రన్నింగ్ అలవెన్స్‌ను రెండింతలకు పైగా పెంచినట్లు సీనియర్ అధికారి బుధవారం చెప్పారు. రైలు డ్రైవర్లు (లోకో పైలట్), గార్డులకు రన్నింగ్ అలవెన్స్‌ను పెంచాలంటూ ఎన్నో ఏళ్లుగా డిమాండ్ ఉంది. ఇప్పటివరకు ప్రతి 100 కిలో మీటర్లకు వారికి 253.5 రూపాయలు చెల్లిస్తుండగా, ఇక నుంచి ఆ మొత్తం రూ. 525కి పెరిగింది. లోకో పైలట్లు, గార్డులు తరచుగా తమ ప్రధాన కార్యాలయానికి, కుటుంబానికి చాలా దూరంగా వెళ్లి, పని చేయాల్సి వస్తుంటుంది. వాళ్లు తిరిగిరావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. 7వ వేతన సంఘం సిఫార్సులను అనుసరించి మిగతా వర్గాల ఉద్యోగులకు అలవెన్స్‌లను 2016లోనే పెంచినప్పటికీ, రన్నింగ్ స్టాఫ్ అలవెన్స్‌ను మాత్రం ఇన్నాళ్లూ పెండింగ్‌లో పెట్టారు. ప్రస్తుతం రైల్వేలో దాదాపు 1.2 లక్షల మంది ఉద్యోగులు రన్నింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. -
‘వందే భారత్’ బ్రేక్ డౌన్!
న్యూఢిల్లీ: ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలు ‘వందే భారత్’కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. శుక్రవారం ఢిల్లీ నుంచి వారణాసికి బయలుదేరిన ఈ రైలు తిరుగు ప్రయాణంలో సాంకేతిక సమస్యతో తుండ్లా జంక్షన్ వద్ద నిలిచిపోయింది. పట్టాలను దాటుతున్న పశువులపై ఈ రైలు దూసుకెళ్లడంతో చక్రాలు పక్కకు జరిగాయని పశ్చిమ రైల్వే సీపీఆర్వో దీపక్ కుమార్ తెలిపారు. శుక్రవారం రాత్రి 10.30 గంటలకు వారణాసి జంక్షన్ నుంచి బయలుదేరిన ఈ హైస్పీడ్ రైలు.. శనివారం ఉదయం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని తుండ్లా జంక్షన్ వద్ద మొదటిసారి బ్రేక్ డౌన్ అయింది. దీంతో గంట సేపు అదే జంక్షన్‌లోనే రైలు నిలిచిపోయింది. ‘రైలు బ్రేక్ డౌన్ అయిన సమయంలో పలువురు జర్నలిస్టులు అందులో ప్రయాణిస్తున్నారు. రైలు తుండ్లా జంక్షన్‌కు వచ్చేటప్పుడు చివరి బోగీల్లో ఒకరకమైన శబ్దాలు వచ్చాయి. చివరి నాలుగు బోగీల్లో కరెంటు లేకపోవడంతో ఒక రకమైన దుర్వాసన వచ్చింది. దీంతో లోకో పైలట్లు అప్రమత్తమై కొద్ది సేపు రైలు స్పీడ్ తగ్గించారు. ఆ తర్వాత బ్రేక్‌లలో సాంకేతిక సమస్య తలెత్తిందని అధికారులకు పైలట్లు చెబుతుండగా తాను విన్నాను’అని ఓ ప్రయాణికుడు చెప్పాడు. ఆ తర్వాత ఉదయం 8.15 గంటలకు ఇంజనీర్లు సమస్యను పరిష్కరించారు. 8.55 గంటలకు మళ్లీ నిలిచిపోయింది. అందులో ప్రయాణిస్తున్న విలేకరులు, బోర్డు అధికారులను వేరే రైలులో ఢిల్లీకి పంపించారు. తర్వాత రైలుకు అవసరమైన మరమ్మతులు చేసి 100 కి.మీ.వేగంతో ఢిల్లీకి వచ్చిందని అధికారులు తెలిపారు. పశువులను ఢీకొట్టడం వల్లే రైలులో సాంకేతిక లోపం తలెత్తిందని రైల్వే ప్రతినిధి స్మితా శర్మ చెప్పారు. ఈ మేరకు సీపీఐ ప్రధాన కార్యదర్శి ట్విట్టర్లో స్పందిస్తూ.. ప్రధాని మోదీ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో ఈ రైలు ఓ మంచి ఉదాహరణ అని అన్నారు. ఈ రైలు గురించి ఎంతగా ప్రచారం చేశారో అంతా విఫలం అయిందని ఎద్దేవా చేశారు. -
ఆర్ఆర్బీ పరీక్షకు 3.59 లక్షల మంది
న్యూఢిల్లీ: రైల్వేశాఖలో అసిస్టెంట్ లోకోపైలెట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీలో భాగంగా విడతల వారీగా నిర్వహిస్తున్న పరీక్షలకు మొదటి రోజు దాదాపు 4 లక్షల మంది హాజరైనట్లు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) గురువారం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం మూడు షిఫ్ట్‌ల్లో మొత్తం 4.83 లక్షల మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 3.59 లక్షల మంది హాజరయ్యారని తెలిపింది. ఇప్పటి వరకు ఆర్ఆర్బీ నిర్వహించిన పరీక్షల్లో ఇదే రికార్డు స్థాయి హాజరు శాతమని వెల్లడించింది. ఆర్ఆర్బీ చరిత్రలోనే అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌గా భావిస్తున్న ఈ నోటిఫికేషన్లో.. మొత్తం 60వేల పోస్టులకుగాను దేశవ్యాప్తంగా 47.55 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 15 భాషలలో విడతల వారీగా ఈ నెల 31 వరకు జరగనున్న ఈ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. -
పలు పరీక్షల కోసం ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: లోకోపైలట్, టెక్నికల్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌కు 03242 నంబర్ గల సికింద్రాబాద్–దానాపూర్ ప్రత్యేక రైలు ఆగస్టు 9న సికింద్రాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి ఆగస్టు 11 ఉదయం 7.40కి దానాపూర్ చేరుకుంటుందని ద.మ.రైల్వే సీపీఆర్వో ఉమేశ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ముజఫరాబాద్, సికింద్రాబాద్ మధ్య.. 05289 నంబర్ గల ముజఫరాబాద్–సికింద్రాబాద్ స్పెషల్ ట్రెయిన్ ముజఫరాబాద్ నుంచి ఆగస్టు 8న మధ్యాహ్నం 12కి బయల్దేరి శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే 05290 నంబర్ గల స్పెషల్ ట్రెయిన్ ఆగస్టు 10న రాత్రి 9కి సికింద్రాబాద్ నుంచి బయల్దేరి, ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటలకు ముజఫరాబాద్ చేరుకుంటుంది.. చెన్నై సెంట్రల్ నుంచి అహ్మదాబాద్‌కు.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని చెన్నై సెంట్రల్ నుంచి అహ్మదాబాద్‌కు 16 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. 06051 నంబర్ చెన్నై సెంట్రల్–అహ్మదాబాద్ వీక్లీ స్పెషల్ ఫేర్ ట్రెయిన్లు చెన్నై సెంట్రల్ నుంచి ఆగస్టు 11, 18, 25, సెప్టెంబరు 1, 8, 15, 22, 29 తేదీల్లో (శనివారాలు) రాత్రి 8.10 నుంచి బయల్దేరి ఉదయం 5.45 గంటలకు (సోమవారాలు) అహ్మదాబాద్ చేరతాయి. 06052 నంబర్ అహ్మదాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ వీక్లీ వీక్లీ స్పెషల్ ఫేర్ ట్రెయిన్లు అహ్మదాబాద్ నుంచి ఈనెల 13, 20, 27, సెప్టెంబరు 3, 10, 17, 24, అక్టోబరు 1 (సోమవారాలు)న ఉదయం 9.40 నిమిషాలకు బయల్దేరి (మంగళవారాలు) సాయంత్రం 5.10కి చెన్నై సెంట్రల్ చేరుకుంటాయి. -
సారథి..సరిత
ప్రతిరోజు ఇంటి ఎదుట నుంచి దూసుకెళ్లే రైళ్లను చూసి అబ్బురపడింది. రైలుకు రథసారథి కావాలనే ఆమె కోరికకు అదే ఊపిరి పోసింది. మరి.. మహిళ రైలు నడపగలదా? అనే ప్రశ్న తలెత్తినప్పుడు... ఆమె ధైర్యంతో ముందుకెళ్లింది. అమ్మానాన్న అండగా నిలిచారు.. ప్రోత్సహించా రు. ఆమె సాధించింది. అసిస్టెంట్ లోకోపైలట్‌గా విధుల్లో చేరి... లోకోపైలట్‌గా ఎదిగింది. ఆమే సరిత. దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్లో రైళ్ల నిర్వహణలో క్రియాశీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సరిత ప్రస్థానం ఆమె మాటల్లోనే... సాక్షి, సిటీబ్యూరో : మా సొంతూరు నాగ్‌పూర్. రైల్వే ఉద్యోగుల క్వార్టర్లకు ఆనుకొని, రైలు పట్టాలకు సమీపంలో మా ఇల్లు ఉండేది. నాన్న టెక్స్టైల్ కంపెనీలో పని చేసేవారు. అమ్మ గృహిణి. చాలా పెద్ద కుటుంబం. అన్నయ్య, ఇద్దరు చెల్లెళ్లు. నాన్నకొచ్చే జీతం చాలా తక్కువ. ఇంటి అవసరాలకే చాలా ఖర్చయ్యేది. ఇక నాన్న జీతంతో మేం పైచదువులు చదువుకోవడం చాలా కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. చదువుకుంటేనే మన కష్టాలు తీరుతాయని, ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడే వరకు చదువుకోవాలని చెప్పేది. అలా మా నలుగురినీ చదివించింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ నాన్న మా చదువు విషయంలో మాత్రం శ్రద్ధ చూపారు. నిజానికి నేను డిప్లొమాలో చేరేందుకు కావాల్సిన రూ.1,000 ఫీజు కూడాచెల్లించలేని పరిస్థితి. అప్పు చేసి కాలేజీలో చేరాల్సివచ్చింది. అప్పుడు అమ్మ అండగా నిలబడక.. ఇక చాల్లే చదువులని ఆపేస్తే ఇప్పుడు ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు. ఈ పని సవాలే... ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సికింద్రాబాద్ స్టేషన్లో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కొన్నింటిని శుభ్రం చేసేందుకు యార్డ్‌కు తరలించి, తిరిగి ప్లాట్‌ఫామ్‌కి తీసుకురావాలి. ప్లాట్‌ఫామ్‌లు ఖాళీగా లేని సమయం లో కొన్ని రైళ్లను వికారాబాద్, చర్లపల్లి తదిత ర దూరప్రాంతాలకు తరలించి హాల్ట్ చేయా ల్సి ఉంటుంది. ఈ క్రమంలో రైళ్లు నడుపుకుంటూ వెళ్లేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలు జరగొచ్చు. బోగీలు అటాచ్, డిటాచ్ చేయడంలో ఎంతో సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. విధి నిర్వహణ ఎంతో సవాల్‌గానే ఉంటుంది. ఆ సవాళ్లను స్వీకరించి పూర్తి చేయడంలో ఎంతో సంతృప్తి కూడా ఉంటుంది. అమ్మానాన్నల స్ఫూర్తి.. అడుగడుగునా అమ్మ నన్ను ప్రోత్సహించింది. ‘నువ్వు రైలు నడపగలవు. ఆ ధైర్యం, పట్టుదల నీలో ఉన్నాయి. మగవాళ్లతో సమానంగా నిలబడగలవంటూ’ వెన్నుతట్టి ప్రోత్సహించింది. అమ్మాయిలు కూడా ఆర్థికంగా నిలబడాలని నాన్న ఎప్పుడూ చెప్పేవారు. ఆ స్ఫూర్తే నన్ను ఇంతదూరం తీసుకొచ్చాయి. మా ఇంటి ముందు నుంచే కోల్‌కతా వేళ్లే రైళ్లు నడిచేవి. పైగా చుటుపక్కలంతా రైల్వే కుటుంబాలు. దీంతో సహజంగానే రైల్వే ప్రభావం నాపై పడింది. చిన్నప్పటి నుంచి రైలు నడపాలనే కోరిక కూడా అందుకు ఊపిరి పోసింది. ఈ విషయం అమ్మానాన్నలకు చెబితే వాళ్లూ సరేనన్నారు. అలా డిప్లొమా పూర్తిచేసి 2006లో అసిస్టెంట్ లోకోపైలట్‌గా చేరాను. అప్పటి నుంచి సికింద్రాబాద్‌లోనే పని చేస్తున్నాను. -
‘మెట్రో’లో అలా భాగమయ్యా..
టీనేజ్‌లో ఉన్నవారికి పెద్ద బాధ్యత అప్పగిస్తే కంగారు పడతారు. ఆ బాధ్యత దేశ, రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించింది అయితే భయపడతారు. ఏ చిన్న పొరపాటు జరిగినా అందరి వేళ్లు అటువైపే చూపిస్తాయి. ఎంతో ఒత్తిడిలో కూడా ప్రతిభావంతంగా తనకు అప్పగించిన పని పూర్తి చేసి దేశప్రధాని చేత శభాష్ అనిపించుకుంది ‘సుప్రియా సనమ్’. ఈ పేరు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గతేడాది నవంబరులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి, ఇంకా రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ప్రయాణించిన మెట్రో రైల్‌ను విజయవంతంగా నడిపిన యువతి అంటే గుర్తుపడ్తారు. మహిళా దినోత్సవం సందర్భంగా సుప్రియ తన మనోగతాన్ని, తన విజయ రహస్యాన్ని ‘సాక్షి’కి వివరించారు. సాక్షి, సిటీబ్యూరో: సాహసమే శ్వాసగా సాగుతున్న సుప్రియ.. లక్ష్య సాధనలో సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. ఓటములను సమర్థంగా ఎదుర్కొని గమ్యాన్ని చేరుకోవాలని నేటి తరం అమ్మాయిలకు పిలుపునిస్తున్నారు. అవకాశాలు ఎవరో ఇస్తారని ఎదురు చూడటం కంటే ఎంచుకున్న మార్గంలో ఎన్ని కష్టాలు ఎదురైనా నిలిచి గెలిచి సాధించడమే ధీర వనితల లక్షణమంటున్నారు. లక్ష్య సాధనలో ఓసారి విఫలమైనా.. ప్రయత్నించడమే నేటి తరం అమ్మాయిలు నేర్చుకోవాల్సిన జీవితపాఠం అంటున్నారు. ప్రస్థానం మొదలైందిలా.. ‘మాది నిజామాబాద్ పట్టణంలోని కంఠేశ్వర్ ప్రాంతం. నాన్న ప్రమోద్‌కుమార్ ప్రైవేటు స్కూలు టీచర్. తర్వాత అదే పాఠశాలకు ఇన్చార్జ్గా పనిచేశారు. అమ్మ ప్రభావతి డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేసేవారు. నేను, అన్నయ్య ప్రసన్న కుమార్ పిల్లలం. చిన్నప్పుడు పాఠశాల చదువు నిజామాబాద్‌లోనే సాగింది. బీటెక్ హైదరాబాద్‌లోని విజ్ఞానభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ పూర్తిచేశాను. ఎంటెక్ సీబీఐటీలో చేశాను. ‘మెట్రో’లో అలా భాగమయ్యా.. ఎంటెక్ ఫైనల్స్‌లో ఉన్నప్పుడు నగరంలో మెట్రో బూమ్ మొదలైంది. సాహసం.. సవాళ్లను ఎదుర్కొనేవారికి ఎల్అండ్టీ సంస్థ ఆహ్వానం పలికింది. వెంటనే అప్లై చేశాను. నాలుగు దశల పరీక్షలను పూర్తిచేసి మెట్రో లోకోపైలెట్‌గా ఎంపికయ్యాను. ఏడాది పాటు శిక్షణ పొందాను. ఛాలెంజింగ్ జాబ్‌ను నిత్యం ఎంజాయ్ చేస్తున్నా. మా ఇంట్లో వివక్ష లేదు.. మా తల్లిదండ్రులు ఎప్పుడూ నాపట్ల వివక్ష చూపలేదు. నేను చదవాలనుకున్న కోర్సులో చేర్పించారు. అన్నయ్యతో పాటే నేనూ క్రికెట్, బాస్కెట్‌బాల్ ఆడాను. నేను ఆడపిల్లను అన్న కోణంలో ఎప్పుడూ చూడలేదు. లోకోపైలెట్‌గా జాబ్‌లో చే రతానంటే ఓకే అన్నారు తప్ప ఎక్కడా నో చెప్పలేదు. నా సక్సెస్‌లో నా తల్లిదండ్రుల పాత్ర మరువలేనిది. చిన్నప్పటి నుంచి వారు నాకు ఇచ్చిన స్ఫూర్తి, ప్రోత్సాహంతోనే ఎదిగాను. చిన్నప్పటి నుంచి సాహసాలు చేయడమంటే నాకు ఇష్టం. బైక్ డ్రైవింగ్ కూడా ఆ సక్తితో నేర్చుకున్నాను. లక్ష్య సాధనకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలన్నదే నా సిద్ధాంతం. నేటి యువతలకు నేను చెప్పే మాట కూడా అదే.. -
కూతబండికి వాళ్లే ఊపిరి...
కామారెడ్డి : రోజూ మూడు కోట్ల మంది ప్రయాణికుల చేరవేత.. లక్షల మెట్రిక్ టన్నుల సరుకు సరఫరా.. ఇదీ మన రైల్వేల ఘనత. అలాంటి రైలుబండి నడవాలంటే దాని వెనుక ఎంతో మంది నిరంతర శ్రమ దాగి ఉంది. సాధారణ గ్యాంగ్‌మెన్ నుంచి కీమెన్, గేట్మెన్, లోకో పైలెట్.. ఇలా ఎందరో నిరంతరం శ్రమించడం వల్లే రైలు కదులుతోంది. రైల్వేలో వివిధ విభాగాలకు చెందిన కార్మికులు, అధికారులు నిరంతరం శ్రమించడం వల్లే అది దూసుకెళ్తోంది. పట్టాలపై గ్యాంగ్మెన్లు, గేట్ల వద్ద గేట్మెన్లు మాత్రమే కనిపిస్తారు. కానీ రైలు ఇంజన్లను ఎప్పటి కప్పుడు పరిశీలించి మరమ్మతులు నిర్వహించే వారి నుంచి రైలు నడిపే వారి వరకు అందరూ ఎంతో బాధ్యతగా పని చేస్తేనే కూతబండి పట్టాలపై పరుగులు పెట్టేది. గ్యాంగ్మెన్లే కీలకం.. రైల్వేలో సాంకేతిక విభాగమే అత్యంత కీలకం. ఇందులో ముఖ్యంగా గ్యాంగ్‌మెన్, కీమెన్ల పాత్ర కీలకమైనది. గ్యాంగ్మెన్లు, కీమెన్లు ప్రతీ రోజు తమకు నిర్దేశించిన దూరం వరకు పట్టాల వెంట నడక సాగిస్తూ పట్టాలు, వాటి కీలను పరిశీలించడం, తేడా ఉంటే సరిచేయడం వారి పని. పట్టాల కీలు, నట్బోల్టుల్లో ఏది దెబ్బతిన్నా రైలు ప్రమాదం తప్పదు. అందుకే నిత్యం ఒక్కో గ్యాంగ్‌మెన్, కీమెన్ కనీసం 7 కిలోమీటర్ల దూరం పట్టాలపై నడుస్తారు. ఎప్పటికప్పుడు వారు తమ రూట్లో తిరుగుతూ పర్యవేక్షించడం, లోపముంటే సరిచేయడం చేస్తారు. ఒకవేళ పట్టాలపై రైలు తిరిగే పరిస్థితి లేనిపక్షంలో వెంటనే అధికారులకు సమాచారం అందిస్తారు. వెంటనే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి అక్కడికి చేరుకుని మరమ్మతులు చేస్తాయి. గేట్మెన్లూ అంతే.. రైల్వేల్లో గేట్మెన్లదీ కీలక పాత్రే. రోడ్లపై ఏర్పాటు చేసిన రైల్వే గేట్ల వద్ద వీరు కాపలాగా ఉంటారు. రైలు వచ్చే సమయంలో గేటు వేయడం, ఆ తర్వాత గేటు తెరవడం వీరి విధి. వీరు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలు జరగడం ఖాయం. రైల్వే గేటు వద్ద కాపలా లేకపోవడంతో రెండేళ్ల క్రితం మాసాయిపేట వద్ద జరిగిన ప్రమాదంలో అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోయిన విషాదం ఇంకా కళ్ల ముందు కదులుతోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడడంలో గేట్మెన్లదీ కీలక పాత్ర. రోజూ ఎనిమిది గంటల పాటు ఒక్కో గేట్మెన్ డ్యూటీ నిర్వహిస్తారు. షిఫ్టుల వారీగా నడిచే డ్యూటీలో తమకు కేటాయించిన సమయంలో తప్పనిసరిగా మెలకువతో ఉండాల్సిందే. రాత్రిపూట ట్రైన్లు తిరిగే సందర్భంలో అప్రమత్తంగా లేకుంటే ప్రాణాలు పోతాయి. రోజూ ఏడు కిలోమీటర్లు.. నిర్దేశించిన ప్రాంతంలో ఏడు కిలోమీటర్ల పాటు పట్టాలపై నడుస్తూ పట్టాలు, జాయింట్లు, నట్బోల్టులను చూసుకుంటాం. ఏదైనా నట్బోల్టు లూస్ అయినట్టు అనిపిస్తే బిగిస్తాం. పట్టాలు డ్యామేజీ ఉన్నా, ఇతర ఏదైనా సమస్య ఉన్నా అధికారులకు సమాచారమిస్తాం. వెంటనే రాకపోకలు నిలిపివేసి, మరమ్మతులు చేయిస్తాం. – వెంకటేశ్, గ్యాంగ్‌మెన్ సమయం ప్రకారమే.. రోజూ నిర్దేశించిన సమయం ప్రకారం డ్యూటీకి రావలసిందే. ఏ సమయానికి ఏ రైలు వస్తుందో ముందే సమాచారం అందుతుంది. ఆ సమయంలో అప్రమత్తంగా ఉంటాం. రైలు వచ్చేముందే గేట్‌ను వేసేస్తాం. రైలు వెళ్లిన తరువాత అనుమతి వచ్చినపుడు గేట్ తీస్తాం. – రాజు, గేట్మెన్