ప్రతిరోజు ఇంటి ఎదుట నుంచి దూసుకెళ్లే రైళ్లను చూసి అబ్బురపడింది. రైలుకు రథసారథి కావాలనే ఆమె కోరికకు అదే ఊపిరి పోసింది. మరి.. మహిళ రైలు నడపగలదా? అనే ప్రశ్న తలెత్తినప్పుడు... ఆమె ధైర్యంతో ముందుకెళ్లింది. అమ్మానాన్న అండగా నిలిచారు.. ప్రోత్సహించా రు. ఆమె సాధించింది. అసిస్టెంట్ లోకోపైలట్‌గా విధుల్లో చేరి... లోకోపైలట్‌గా ఎదిగింది. ఆమే సరిత. దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్‌లో రైళ్ల నిర్వహణలో క్రియాశీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సరిత ప్రస్థానం ఆమె మాటల్లోనే...
సాక్షి, సిటీబ్యూరో : మా సొంతూరు నాగ్‌పూర్. రైల్వే ఉద్యోగుల క్వార్టర్లకు ఆనుకొని, రైలు పట్టాలకు సమీపంలో మా ఇల్లు ఉండేది. నాన్న టెక్స్‌టైల్ కంపెనీలో పని చేసేవారు. అమ్మ గృహిణి. చాలా పెద్ద కుటుంబం. అన్నయ్య, ఇద్దరు చెల్లెళ్లు. నాన్నకొచ్చే జీతం చాలా తక్కువ. ఇంటి అవసరాలకే చాలా ఖర్చయ్యేది. ఇక నాన్న జీతంతో మేం పైచదువులు చదువుకోవడం చాలా కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. చదువుకుంటేనే మన కష్టాలు తీరుతాయని, ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడే వరకు చదువుకోవాలని చెప్పేది. అలా మా నలుగురినీ చదివించింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ నాన్న మా చదువు విషయంలో మాత్రం శ్రద్ధ చూపారు. నిజానికి నేను డిప్లొమాలో చేరేందుకు కావాల్సిన రూ.1,000 ఫీజు కూడాచెల్లించలేని పరిస్థితి. అప్పు చేసి కాలేజీలో చేరాల్సివచ్చింది. అప్పుడు అమ్మ అండగా నిలబడక.. ఇక చాల్లే చదువులని ఆపేస్తే ఇప్పుడు ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు.
ఈ పని సవాలే...
ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సికింద్రాబాద్ స్టేషన్‌లో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కొన్నింటిని శుభ్రం చేసేందుకు యార్డ్‌కు తరలించి, తిరిగి ప్లాట్‌ఫామ్‌కి తీసుకురావాలి. ప్లాట్‌ఫామ్‌లు ఖాళీగా లేని సమయం లో కొన్ని రైళ్లను వికారాబాద్, చర్లపల్లి తదిత ర దూరప్రాంతాలకు తరలించి హాల్ట్ చేయా ల్సి ఉంటుంది. ఈ క్రమంలో రైళ్లు నడుపుకుంటూ వెళ్లేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలు జరగొచ్చు. బోగీలు అటాచ్, డిటాచ్ చేయడంలో ఎంతో సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. విధి నిర్వహణ ఎంతో సవాల్‌గానే ఉంటుంది. ఆ సవాళ్లను స్వీకరించి పూర్తి చేయడంలో ఎంతో సంతృప్తి కూడా ఉంటుంది.
అమ్మానాన్నల స్ఫూర్తి..
అడుగడుగునా అమ్మ నన్ను ప్రోత్సహించింది. ‘నువ్వు రైలు నడపగలవు. ఆ ధైర్యం, పట్టుదల నీలో ఉన్నాయి. మగవాళ్లతో సమానంగా నిలబడగలవంటూ’ వెన్నుతట్టి ప్రోత్సహించింది. అమ్మాయిలు కూడా ఆర్థికంగా నిలబడాలని నాన్న ఎప్పుడూ చెప్పేవారు. ఆ స్ఫూర్తే నన్ను ఇంతదూరం తీసుకొచ్చాయి. మా ఇంటి ముందు నుంచే కోల్‌కతా వేళ్లే రైళ్లు నడిచేవి. పైగా చుటుపక్కలంతా రైల్వే కుటుంబాలు. దీంతో సహజంగానే రైల్వే ప్రభావం నాపై పడింది. చిన్నప్పటి నుంచి రైలు నడపాలనే కోరిక కూడా అందుకు ఊపిరి పోసింది. ఈ విషయం అమ్మానాన్నలకు చెబితే వాళ్లూ సరేనన్నారు. అలా డిప్లొమా పూర్తిచేసి 2006లో అసిస్టెంట్ లోకోపైలట్‌గా చేరాను. అప్పటి నుంచి సికింద్రాబాద్‌లోనే పని చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment