కూతబండికి వాళ్లే ఊపిరి...
కూతబండికి వాళ్లే ఊపిరి...
Published Thu, Aug 11 2016 11:34 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
కామారెడ్డి : రోజూ మూడు కోట్ల మంది ప్రయాణికుల చేరవేత.. లక్షల మెట్రిక్ టన్నుల సరుకు సరఫరా.. ఇదీ మన రైల్వేల ఘనత. అలాంటి రైలుబండి నడవాలంటే దాని వెనుక ఎంతో మంది నిరంతర శ్రమ దాగి ఉంది. సాధారణ గ్యాంగ్‌మెన్ నుంచి కీమెన్, గేట్‌మెన్, లోకో పైలెట్.. ఇలా ఎందరో నిరంతరం శ్రమించడం వల్లే రైలు కదులుతోంది. రైల్వేలో వివిధ విభాగాలకు చెందిన కార్మికులు, అధికారులు నిరంతరం శ్రమించడం వల్లే అది దూసుకెళ్తోంది. పట్టాలపై గ్యాంగ్‌మెన్లు, గేట్‌ల వద్ద గేట్‌మెన్‌లు మాత్రమే కనిపిస్తారు. కానీ రైలు ఇంజన్‌లను ఎప్పటి కప్పుడు పరిశీలించి మరమ్మతులు నిర్వహించే వారి నుంచి రైలు నడిపే వారి వరకు అందరూ ఎంతో బాధ్యతగా పని చేస్తేనే కూతబండి పట్టాలపై పరుగులు పెట్టేది.
గ్యాంగ్‌మెన్లే కీలకం..
రైల్వేలో సాంకేతిక విభాగమే అత్యంత కీలకం. ఇందులో ముఖ్యంగా గ్యాంగ్‌మెన్, కీమెన్‌ల పాత్ర కీలకమైనది. గ్యాంగ్‌మెన్లు, కీమెన్లు ప్రతీ రోజు తమకు నిర్దేశించిన దూరం వరకు పట్టాల వెంట నడక సాగిస్తూ పట్టాలు, వాటి కీలను పరిశీలించడం, తేడా ఉంటే సరిచేయడం వారి పని. పట్టాల కీలు, నట్‌బోల్టుల్లో ఏది దెబ్బతిన్నా రైలు ప్రమాదం తప్పదు. అందుకే నిత్యం ఒక్కో గ్యాంగ్‌మెన్, కీమెన్ కనీసం 7 కిలోమీటర్ల దూరం పట్టాలపై నడుస్తారు. ఎప్పటికప్పుడు వారు తమ రూట్లో తిరుగుతూ పర్యవేక్షించడం, లోపముంటే సరిచేయడం చేస్తారు. ఒకవేళ పట్టాలపై రైలు తిరిగే పరిస్థితి లేనిపక్షంలో వెంటనే అధికారులకు సమాచారం అందిస్తారు. వెంటనే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి అక్కడికి చేరుకుని మరమ్మతులు చేస్తాయి.
గేట్‌మెన్‌లూ అంతే..
రైల్వేల్లో గేట్‌మెన్లదీ కీలక పాత్రే. రోడ్లపై ఏర్పాటు చేసిన రైల్వే గేట్ల వద్ద వీరు కాపలాగా ఉంటారు. రైలు వచ్చే సమయంలో గేటు వేయడం, ఆ తర్వాత గేటు తెరవడం వీరి విధి. వీరు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలు జరగడం ఖాయం. రైల్వే గేటు వద్ద కాపలా లేకపోవడంతో రెండేళ్ల క్రితం మాసాయిపేట వద్ద జరిగిన ప్రమాదంలో అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోయిన విషాదం ఇంకా కళ్ల ముందు కదులుతోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడడంలో గేట్‌మెన్లదీ కీలక పాత్ర. రోజూ ఎనిమిది గంటల పాటు ఒక్కో గేట్‌మెన్ డ్యూటీ నిర్వహిస్తారు. షిఫ్టుల వారీగా నడిచే డ్యూటీలో తమకు కేటాయించిన సమయంలో తప్పనిసరిగా మెలకువతో ఉండాల్సిందే. రాత్రిపూట ట్రైన్లు తిరిగే సందర్భంలో అప్రమత్తంగా లేకుంటే ప్రాణాలు పోతాయి.
రోజూ ఏడు కిలోమీటర్లు..
నిర్దేశించిన ప్రాంతంలో ఏడు కిలోమీటర్ల పాటు పట్టాలపై నడుస్తూ పట్టాలు, జాయింట్లు, నట్‌బోల్టులను చూసుకుంటాం. ఏదైనా నట్‌బోల్టు లూస్ అయినట్టు అనిపిస్తే బిగిస్తాం. పట్టాలు డ్యామేజీ ఉన్నా, ఇతర ఏదైనా సమస్య ఉన్నా అధికారులకు సమాచారమిస్తాం. వెంటనే రాకపోకలు నిలిపివేసి, మరమ్మతులు చేయిస్తాం. – వెంకటేశ్, గ్యాంగ్‌మెన్
సమయం ప్రకారమే..
రోజూ నిర్దేశించిన సమయం ప్రకారం డ్యూటీకి రావలసిందే. ఏ సమయానికి ఏ రైలు వస్తుందో ముందే సమాచారం అందుతుంది. ఆ సమయంలో అప్రమత్తంగా ఉంటాం. రైలు వచ్చేముందే గేట్‌ను వేసేస్తాం. రైలు వెళ్లిన తరువాత అనుమతి వచ్చినపుడు గేట్ తీస్తాం. – రాజు, గేట్‌మెన్
Advertisement