ఆర్టీఏ ఆఫీస్కు ఆన్లైన్, కరెంటు కష్టాలు
నిలుస్తున్న సేవలు
తిమ్మాపూర్ : నిర్ధిష్ట కాల పరిమితి ఉన్న ప్రాంతీయ రవాణా శాఖ(ఆర్టీఏ) కార్యాలయంలో దరఖాస్తు దారులకు, ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదు. కార్యాలయంలో దరఖాస్తులు అందించేందుకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 2 గంటల వరకు సమయం కాగా అర్జీదారుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. అందరూ ఆ సమయంలోనే పని పూర్తి చేసుకునేందుకు వస్తుంటారు. ఇందు కోసం అర్జీదారులు బారులు తీరాల్సి వస్తోంది. ఈ కార్యాలయంలో పలు పనులు బ్యాంకు డీడీలతో ముడిపడి ఉంటాయి. బీఎస్ఎన్ఎల్ లైన్ కారణంగా ఆర్టీఏ కార్యాలయంలో నిత్యం ఆన్లైన్ సేవలు తరచూ నిలిచిపోతున్నాయని ఉద్యోగులు, దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు. ఒక్కోసారి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్లైన్ సమస్య కారణంగా పని చేసే సమయంలో ఒత్తిడి తీవ్రతమవుతోందని, విద్యుత్ కోతలతో సమస్య మరింత జఠిలవుతోందని ఉద్యోగులు అంటున్నారు. కరెంట్ పోయినపుడు, వచ్చినపుడు జనరేటర్ ఆన్, ఆఫ్ చేసినపుడు ఏసీ, డీసీని మార్చాల్సిన చేంజోవర్ పాడైపోయిందని, దీనిని మరమ్మతు చేయించాల్సిన కార్యాలయ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆన్లైన్ సేవలు నిలిచిపోతున్నా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ఆన్లైన్ సేవల్లో ఇదే పరిస్థితి ఎదురవుతోందని పలువురు పేర్కొంటున్నారు.
శనివారం బ్యాంకు సేవలు మధ్యాహ్నం వరకే అందుతుండడంతో దరఖాస్తుదారులు ఆర్టీఏ కార్యాలయ ఉద్యోగులపై మరీ ఒత్తిడి తీసుకొస్తున్నారు. నిత్యం ప్రజలతో సంబంధాలుండే ప్రభుత్వ కార్యాలయాలకు ఆన్లైన్ సౌకర్యంలో ఇబ్బందులు తలెత్తకుండా బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులు స్పందించాలని ఉద్యోగులు, దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఆన్లైన్, విద్యుత్ సమస్యలు ఇలా ఉంటే...కార్యాలయంలో కౌంటర్లు పని చేసే నిర్ణీత సమయంలోనే అవగాహన కార్యక్రమాల పేర ప్రైవేటు కార్యక్రమాలను ఆఫీసులోనే ఏర్పాటు చేయడం..అందులో అధికారులు, ఏవోలు పాల్గొనడంతో సేవలు అందించడంలో మరింత ఆలస్యమవుతుందని అర్జీదారులు పేర్కొంటున్నారు.