జపాన్‌తో బంధానికి ఇది ఆరంభమే
పర్యటనతో పెట్టుబడులెన్ని వచ్చాయో ఇప్పుడే చెప్పలేం: సీఎం చంద్రబాబు
వచ్చే ఏడాది రాష్ట్రానికి జపాన్ ప్రధాని
విదేశీ పర్యటనలు కొనసాగుతాయి..
సాక్షి, హైదరాబాద్: తన జపాన్ పర్యటన వల్ల తక్షణం ఎన్ని పెట్టుబడులు వచ్చాయనే విషయా న్ని ఇప్పటికిప్పుడు లెక్కలేసుకొని చెప్పలేమని, దీర్ఘకాలిక ప్రణాళికల రూపకల్పనకు ఈ పర్యటన దోహదం చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. జపాన్‌తో సుదీర్ఘ బంధానికి ఇది ఆరంభంగా పేర్కొన్నారు. సోమవారం సచివాల యంలో సమావేశంలో ఆయన మాట్లాడారు. జపాన్ పర్యటన విశేషాలను వెల్లడించారు.
జపాన్ పర్యటన వల్ల రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులపై విలేకరుల ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. తన పర్యటన వల్ల వారిలో నమ్మ కం కలిగిందని వివరించారు. వచ్చే ఏడాది జపాన్ ప్రధాని భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఏపీని సందర్శిస్తానన్నారని చెప్పారు. రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ ముం దుకొచ్చారని చెప్పారు.
పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ఉత్పత్తి, వ్యవసాయం, ఆహార శుద్ధి, ఐటీ తదితర రంగాల్లో జపాన్ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి వీలుగా ‘మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ, ట్రేడ్, ఇండస్ట్రీ (ఎంఇటీఐ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఇంధన రంగంలో పరస్పర సహకారానికి ‘న్యూ ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డెవలెప్మెంట్ ఆర్గనైజేషన్’తో మరో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.
పెట్టుబడులను ఆకర్షించడానికి విదేశీ పర్యటనలు కొనసాగిస్తానని తెలిపారు. తన తదుపరి పర్యటన జర్మనీ లేదా దక్షిణ కొరియాలో ఉంటుందన్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్ సిద్ధమైన తర్వాత నిర్మాణంలో జపాన్ సహకారం ఉంటుందని తెలిపారు. మా స్టర్ ప్లాన్‌పై చర్చించడానికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఈ నెల 8న హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అభివృద్ధి జరిగితే జనాభా నియంత్రణ జరుగుతుందన్నారు.