ది లాస్ట్ స్పారో
చిన్నతనంలో పిచ్చుక కనిపిస్తే మచ్చిక చేసుకోవాలన్న ఉబలాటం. అది అందీ అందకుండా తుర్రుమంటుంటే... దాంతో మనసూ ఉరకలేసేది. మరి ఇప్పుడో... ఆ పిచ్చుకలు లేక ఇంటి చూరు చిన్నబోతోంది. తన జ్ఞాపకాలతో చేదబావి బోరుమంటోంది. ఆ పికిలి పిట్టల పాదముద్రల కోసం పచ్చని చెట్లు సైతం పరితపిస్తున్నాయి. ఇప్పటి తరానికి పిచ్చుకను చూపించాలంటే గూగుల్‌ను ఆశ్రయించాల్సిందే!
ఆ పిచ్చుకల కిచకిచను వినిపించాలంటే పాత టేపుల దుమ్ము దులపాల్సిందే! నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సంద ర్భంగా... - శిరీష చల్లపల్లి
మనసుకు ఉల్లాసాన్నిచ్చే ప్రకృతిలో పక్షులది మొదటిస్థానం. కిచకిచమంటూ ఇంటి చూరు చుట్టూ తిరిగే పిచ్చుకలంటే ఇష్టపడనివారుండరు. గడ్డిపోచలతో అవి గూళ్లు కడుతుంటే చూడటం, గుడ్లు పెట్టాక వాటిని లెక్కపెట్టడం, ఆహారం తెచ్చి పిల్లలకు పెడుతుంటే చూసిన ఆనందం, పిచ్చుక గూడు కూలినప్పుడు... కుమిలి ఏడ్చిన అనుభవం, వ్యవసాయంలో పురుగుల మందుల వాడకం, వాతావరణంలో మార్పులు... ఏవైతేనేం పిచ్చుకలు ఎగిరిపోయాయి. అవి అల్లుకున్న గూళ్లూ చెదిరిపోయాయి.
నిరాటంకంగా సాగుతున్న చెట్ల నరికివేత, తరుగుతున్న అడవులు, సెల్ టవర్ల రేడియేషన్... ఆ చిన్ని పక్షుల ఉసురు తీస్తున్నాయి. ఫలితంగా పిచ్చుకలు అంతరిస్తున్న పక్షుల జాబితాలోకి చేరుతున్నాయి. అయితే, మించిపోయిందేమీ లేదు.. ఇప్పటికైనా నిద్రలేచి పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే పిచ్చుకలను కాపాడుకోవచ్చంటున్నారు ఏఆర్‌పీఎఫ్ ఫౌండర్ నిహార్.
మనమే కాపాడాలి...
‘సిటీలో పిచ్చుకలకే కాదు... 28 రకాల ఇతర జాతి పక్షుల మనుగడకు భారీ ముప్పు వాటిల్లుతోంది. పొల్యూషన్ వల్ల పిచ్చుకలకు ప్రధాన ఆహారమైన క్రిమికీటకాలు చనిపోతున్నాయి. నగరమంతా కాంక్రీట్ బిల్డింగ్స్ నిండి... చెట్లు లేకుండా పోవడంతో పిచ్చుకలు కూడా లేకుండా పోతున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోగలిగితే... వాటిని కొంతమేరకైనా రక్షించుకోగలిగినవారమవుతాం. సరదాగా ఓ హాబీలాగా పనికిరాని చెక్కముక్కలు, అట్టముక్కలను గూడులాగా తయారు చేసి... ఆ బాక్సులను బంధుమిత్రులు, స్నేహితులు, ఇరుగుపొరుగుకు ఇవ్వండి.
ఇంటిబయట వెంటిలేటర్కో, కిటికీల మీద పెట్టడమో, ఇంటి ముందు చెట్ల కొమ్మలకు కట్టడమో చేయమనండి. ఒక్క పిచ్చుకలకే కాదు... ఇతర పక్షుల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలి. మొక్కలు నాటమని చెప్పడం కాకుండా.. గిఫ్ట్‌గా మొక్కలనే ఇవ్వాలి. సజ్జలు, నూకలు, జొన్నలు వంటి చిరుధాన్యాలని కూడా డాబాలపైన వెదజల్లండి. చిన్నచిన్న పాత్రల్లో వాటికి నీళ్లు పోసి ఉంచండి. ఇలాంటి చిన్నచిన్న పనులతో పర్యావరణాన్ని కాపాడితే మనతోపాటు పిచ్చుకలకూ బతుకునిచ్చినట్లవుతుంది. బయోడైవర్సిటీని కొంతైనా కాపాడినవారమవుతాం’ అని చెబుతున్నారు వాయిస్‌లెస్ బర్డ్స్ అండ్ యానిమల్స్ కోసం వాయిస్‌గా మారిన నిహార్.
ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం 9:00 గంటల నుండి 11:00 గంటల వరకు జలగం వెంగళరావు పార్క్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.