love couple marriage
-
ఇంట్లో ఇల్లాలు.. పీజీలో ప్రియురాలు
మైసూరు: వివాహమై భార్యతో కాపురం చేస్తున్నా మరొక మహిళతో ప్రేమాయణం నడిపి గర్భవతిని చేయడమే కాకుండా రూ.9 లక్షలను తీసుకుని మోసగించిన ఘటన మైసూరులోని వీవీ మొహల్లాలో వెలుగుచూసింది. మోసపోయిన మహిళ జయలక్ష్మిపురం పోలీసు స్టేషన్లో బెంగళూరు నివాసి భరత్‌గౌడ, అతని తల్లిదండ్రులు సురే‹Ù, అంకితలపై ఫిర్యాదు చేసింది. వయసులో పెద్దయినా.. వివరాలు..బాధితురాలు భాగ్యలక్ష్మి (32) గోకులంలో ప్రైవేటు హాస్టల్ (పీజీ) నడుపుతున్నారు. 2022లో భరత్‌గౌడ (29)తో ఇన్‌స్టా లో పరిచయం ఏర్పడింది. తనకన్నా ఆమె పెద్దదైనప్పటికీ, ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. అప్పటికే అతనికి పెళ్లయింది. కానీ విడాకులు ఇచ్చానని బాధితురాలికి నమ్మబలికాడు. మోసగానికి అతని తల్లిదండ్రులు కూడా వంతపాడుతూ బాధిత మహిళను వలలోకి లాగారు. నమ్మిన మహిళ పెళ్లికి ఒప్పుకుంది. స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రుల సమక్షంలో 2023లో ఫంక్షన్ హాల్లో పెళ్లి జరిగింది. ఆ సమయంలో వ్యాపారం కోసమంటూ రూ.10 లక్షలు, 100 గ్రాముల బంగారు ఆభరణాలను భరత్‌గౌడ వరకట్నంగా తీసుకున్నాడు. ఆ తర్వాత రూ.8 లక్షలు ఇచ్చి కార్ వాషింగ్ సెంటర్‌ని పెట్టించింది. అంతేగాకుండా ఆమె క్రెడిట్ కార్డు నుంచి భరత్‌గౌడ రూ.1.25 లక్షలను డ్రా చేసుకున్నాడు. మొదటి భార్యకు తెలిసి ఇలా ఉండగా మొదటి భార్య మోనిక ఈ విషయాన్ని తెలుసుకుని భాగ్యలక్ష్మికి భరత్‌గౌడ మోసగాడు, జాగ్రత్తగా ఉండాలని మెసేజ్ చేసింది. దీనిపై భాగ్యలక్ష్మి నిలదీయగా, ఆమె మాటలు నమ్మవద్దని చెప్పాడు. మొదటి భార్యతో కాపురం చేస్తూనే నాటకమాడి తనను మోసగించినట్లు అర్థమైంది. దీంతో నిలదీయగా చంపుతానని ఆమెను బెదిరించాడు. ఈ నేపథ్యంలో అతని మోసాల గురించి భాగ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
పెళ్లయిన వ్యక్తితో ప్రేమాయణం..
రాయపర్తి: అతనికి పెళ్లయ్యింది. కానీ వరుసకు చెల్లె అయ్యే యువతితో చాలాఏళ్ల ప్రేమ.. పెద్దలు పలుమార్లు మందలించారు. చివరికి ఆ జంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలకేంద్రంలోని రామచంద్రుని చెరువు వద్ధ సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా పైడిపల్లి పరిధిలోని మధ్యగూడానికి చెందిన తిక్క అంజలి(25), అదే గ్రామానికి చెందిన సంగాల దిలీప్(30) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ దగ్గరి బంధువులు కావడం, అందులోనూ వరుసకు అన్నాచెల్లెళ్లు కావడంతో పెద్దలు ఒప్పుకోరనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం దిలీప్‌కు వరంగల్ జిల్లా నెక్కొండ మండలం జంజరపల్లికి చెందిన ఓ యువతితో వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. అయినా వీరి ప్రేమను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దిలీప్ వరంగల్ హంటర్‌రోడ్డులో ఓ మార్బుల్ దుకాణంలో సూపర్వైజర్గా పనిచేస్తుండగా, అంజలి ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా చేస్తుంది. వీరి ప్రేమ విషయం భార్యకు తెలియడంతో చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల భార్య తన పుట్టింటికి వెళ్లింది. దీంతో దిలీప్.. అంజలితో తిరగడం ప్రారంభించారు. విషయ పెద్దలకు తెలియగా నాలుగురోజులక్రితం మందలించారు. ఇప్పటినుంచి అలా తిరగమని చెప్పి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో దిలీప్ ఆదివారం ఉదయం 9:30 గంటల సమయంలో డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రి అయినా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎక్కడికో వెళ్లి ఉంటాడనుకున్నారు. సోమవారం ఉదయం రాయపర్తిలోని రామచంద్రుని చెరువులో రెండు మృతదేహాలు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ సూర్యప్రకాష్, వర్ధన్నపేట ఎస్సై ప్రవీణ్‌లతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పరిశీలించగా దిలీప్, అంజలిదిగా గుర్తించారు. క్లూస్‌టీంతో పరిశీలించి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ సూర్యప్రకాష్ తెలిపారు. -
అతడికి 19.. ఆమెకు 56.. పెళ్లికి సిద్ధమైన జంట
బ్యాంకాక్: ప్రేమ గుడ్డిది, దానికి వయసు, పరిధి, దూరం వంటి వాటితో సంబంధం ఉండదు అనే డైలాగులు చాలా సినిమాల్లో వినే ఉంటాం. దానిని థాయ్‌లాండ్‌కు చెందిన ఓ జంట నిజం చేసి చూపుతోంది. ఇద్దరి మధ్య 37 ఏళ్ల వయసు తేడా ఉంది. అయినప్పటికీ.. 19 ఏళ్ల యువకుడు, 56 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆమెతో నిశ్చితార్థం సైతం చేసుకున్నాడటా! ప్రస్తుతం వారి ప్రేమ, పెళ్లి అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చినీయాంశంగా మారింది. ఉత్తర థాయ్‌లాండ్‌లోని సఖోన్ నఖోన్ రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల వుతిచాయ్ చంతరాజ్ అనే యువకుడు, 56 ఏళ్ల వయసు ఉన్న జన్లా నమువాన్గ్రాక్ అనే మహిళను పెళ్లి చేసుకోబోతున్నాడు. అతని 10 ఏళ్ల వయసున్నప్పుడు ఆమెను కలిశాడు. ఇరువురు ఇరుగుపొరుగు ఇంట్లోనే ఉండేవారు. ఈ క్రమంలో ఇంటిని శుభ్రం చేసేందుకు తనకు సాయం చేయమని వుతిచాయ్ని కోరేది మహిళ. ఇలా.. చిన్న చిన్న పనుల్లో సాయంగా ఉంటుండంతో ఇరువురి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 37 ఏళ్ల వయసు తేడా ఉన్నప్పటికీ గత రెండేళ్లుగా వారు సహజీవనం చేస్తున్నారు. ‘రెండేళ్లుగా జల్నాతో ఉంటున్నాను. ఒకరు హాయిగా జీవించేలా చేయొచ్చని నా జీవితంలో తొలిసారి తెలుసుకున్నా. పాడైపోయిన ఆమె ఇంటిని చూశాను. ఆ తర్వాత ఆమెకు మంచి జీవితం అందించాలని ఆలోచించాను. ఆమె చాలా కష్టపడి పని చేసే వ్యక్తి, నిజాయితీగా ఉంటుంది. ఆమెను నేను ఆరాధిస్తాను.’ అని పేర్కొన్నాడు. మరోవైపు.. వయసులో తేడా పట్ల వారు ఆందోళన చెందటం లేదు. ఇంటర్వ్యూలు, బహిరంగంగా తమ బంధాన్ని వెల్లడించటంలో ఎలాంటి ఇబ్బందులు పడటం లేదు. నగరంలో బయటకి వెళ్లినప్పుడు చేతులు పట్టుకుని, ముద్దులు పెట్టుకుంటూ సరదాగా కనిపిస్తున్నారు కూడా. అయితే.. జల్నా తన భర్తతో విడిపోయింది. ఆమెకు ముగ్గురు 30 ఏళ్లకుపైగా వయసున్న పిల్లలు ఉన్నారు. వుతిచాయ్ తనలో యువతిననే ఆలోచన కలిగించాడని చెబుతోంది. ‘వుతిచాయ్ నాకు ఒక సూపర్ హీరో. ప్రతి రోజు నాకు సాయం చేస్తాడు.అతను పెద్దవాడయ్యాక మా ఇరువురి మధ్య భావాలు మొదలయ్యాయి.’ అని పేర్కొంది జల్నా. త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: వీడియో: చెంప దెబ్బకు డెలివరీబాయ్ ఇచ్చిన రియాక్షన్.. మరీ వయొలెంట్‌గా ఉందే! -
గండికోటలో ప్రేమజంట కథ విషాదాంతం
సాక్షి, జమ్మలమడుగు: కలిసి చనిపోదామని ఓ యువజంట చేసిన ప్రయత్నంలో ఒకరు విషాదాంతమయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గండికోటలో గురువారం ఈ సంఘటన జరిగింది. వివరాలివి. కడప నగరంలోని పెద్దదర్గా సమీపంలో ఉంటున్న మేడిశెట్టి నరసింహప్రసాద్, పద్మావతి దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. రెండో కుమార్తె పేరు భార్గవి. బీఎస్సీ చదివింది. ఎమ్మెస్సీ చదవాలనే ప్రయత్నంలో ఉంది. నరసింహప్రసాద్‌కు కంటి చూపు సమస్య ఉంది. దీంతో అతని భార్య పద్మావతి హోటల్లో పనిచేస్తోంది. ఇద్దరు కుమార్తెలను తల్లి కష్టపడి చదివిస్తోంది. భార్గవి కొద్దినెలలుగా చిన్నచౌక్ బుడ్డాయపల్లెకు చెందిన భోగ శ్రీనివాసులు అనే యువకుడిని ప్రేమిస్తోంది. అతడు డిగ్రీ పూర్తి చేశాడు. ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లా మహానందికి వెళ్లి వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులకు తమ పెళ్లి విషయాన్ని ఫోన్లో తెలియజేసినట్లు సమాచారం. రోదిస్తున్న మేడిశెట్టి భార్గవి కుటుంబ సభ్యులు గురువారం ఇంటికి వస్తామన్నారు. భార్గవి ప్రేమ వివాహం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. విషయం తెలిసి తమ కుమార్తెను వారు మందలించారు. ఇంటికి వెళ్లితే కుటుంబ సభ్యులు ఏం చేస్తారోనని వీరు భయపడ్డారు. దీంతో ఇంటికి వెళ్లలేదు. గురువారం ఉదయం జమ్మలమడుగు మండలం గండికోటకు వెళ్లారు. ముందే అనుకున్న ప్రకారం తమ వెంట పురుగుల మందు తెచ్చుకున్నారు. కలిసి చనిపోదామని ఇద్దరూ దానిని తాగారు. వెంటనే అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికులు వీరిని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108 వాహనంలో ఇద్దరినీ జమ్మలమడుగు ప్రభుత్వాసుత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భార్గవి మృతి చెందింది. శ్రీనివాసులు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇతడ్ని మెరుగైన చికిత్స కోసం కడపకు తరలించారు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉందని అర్బన్ సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. -
కూతురు సాక్షిగా వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు..!
శ్రీకాకుళం సిటీ: జిల్లా కోర్టు ప్రాంగణమే వేదికగా, జిల్లా జడ్జి సమక్షంలో ఓ ప్రేమ జంట కూతురు సాక్షిగా గురువారం ఒక్కటైంది. వివరాల్లోకి వెళ్తే.. రణస్థలం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన కొమర నీలవేణి, అదే మండలం జీరుపాలెం గ్రామానికి చెందిన వాసుపల్లి అప్పన్నలు ఒకరికొకరు ఇష్టపడ్డారు. కొన్ని నెలలు సహజీవనం చేశారు. దీనికి ప్రతిగా ఓ పాప కూడా జన్మించింది. ఇరువురు మత్యకార కుటుంబానికి చెందిన వారే. నీలవేణి స్థానికంగా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. వివాహం చేసుకుంటానని చెప్పడంతో అప్పన్నకి రూ.2.30 లక్షల నగదు, రెండు తులాల బంగారాన్ని నీలవేణి కుటుంబ సభ్యులు ముట్టజెప్పారు. ఒక్కసారిగా నగదు చేతికందే సరికి అప్పన్న చెప్పాపెట్టకుండా పరారయ్యాడు. దీంతో నీలవేణి రణస్థలం పోలీస్‌స్టేషన్‌లో అప్పన్నపై ఫిర్యాదు చేసింది. ఈ కేసు కోర్టులో విచారణకు రావడంతో లోక్‌అదాలత్‌ను ఆశ్రయించారు. నీలవేణిని వివాహం చేసుకుని, మూడేళ్ల కూతురు జాన్సీని అక్కున చేర్చుకునేందుకు అప్పన్న అంగీకరించాడు. దీంతో జిల్లా ప్రిన్సిపల్ జిడ్జి వి.అప్పారావు సమక్షంలో దండలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ చిన్నచిన్న మనస్పర్థలతో విడిపోవడం మంచిది కాదన్నారు. ఒకరినొకరు అవగాహన చేసుకొని మెలగాలని పిలుపునిచ్చారు. ఈనెల 13న నేషనల్ లోక్ ఆదాలత్ నిర్వహించనున్నామని, మోటరు వాహనాల కేసులకు సంబంధించి సత్వర పరిష్కారం చేయనున్నట్టు వెల్లడించారు.