కూతురు సాక్షిగా వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు..!
శ్రీకాకుళం సిటీ: జిల్లా కోర్టు ప్రాంగణమే వేదికగా, జిల్లా జడ్జి సమక్షంలో ఓ ప్రేమ జంట కూతురు సాక్షిగా గురువారం ఒక్కటైంది. వివరాల్లోకి వెళ్తే.. రణస్థలం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన కొమర నీలవేణి, అదే మండలం జీరుపాలెం గ్రామానికి చెందిన వాసుపల్లి అప్పన్నలు ఒకరికొకరు ఇష్టపడ్డారు. కొన్ని నెలలు సహజీవనం చేశారు. దీనికి ప్రతిగా ఓ పాప కూడా జన్మించింది. ఇరువురు మత్యకార కుటుంబానికి చెందిన వారే. నీలవేణి స్థానికంగా అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. వివాహం చేసుకుంటానని చెప్పడంతో అప్పన్నకి రూ.2.30 లక్షల నగదు, రెండు తులాల బంగారాన్ని నీలవేణి కుటుంబ సభ్యులు ముట్టజెప్పారు.
ఒక్కసారిగా నగదు చేతికందే సరికి అప్పన్న చెప్పాపెట్టకుండా పరారయ్యాడు. దీంతో నీలవేణి రణస్థలం పోలీస్‌స్టేషన్‌లో అప్పన్నపై ఫిర్యాదు చేసింది. ఈ కేసు కోర్టులో విచారణకు రావడంతో లోక్‌అదాలత్‌ను ఆశ్రయించారు. నీలవేణిని వివాహం చేసుకుని, మూడేళ్ల కూతురు జాన్సీని అక్కున చేర్చుకునేందుకు అప్పన్న అంగీకరించాడు. దీంతో జిల్లా ప్రిన్సిపల్ జిడ్జి వి.అప్పారావు సమక్షంలో దండలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ చిన్నచిన్న మనస్పర్థలతో విడిపోవడం మంచిది కాదన్నారు. ఒకరినొకరు అవగాహన చేసుకొని మెలగాలని పిలుపునిచ్చారు. ఈనెల 13న నేషనల్ లోక్ ఆదాలత్ నిర్వహించనున్నామని, మోటరు వాహనాల కేసులకు సంబంధించి సత్వర పరిష్కారం చేయనున్నట్టు వెల్లడించారు.