కోతలకు కత్తెర!
- విద్యుత్ సరఫరా మెరుగుదలపై దృష్టి సారించిన ఈపీడీసీఎల్
- సమూల ప్రక్షాళనకు ప్రతిపాదనలు
- రంగంలోకి ప్రత్యేక బృందాలు
సాక్షి, ఏలూరు : జిల్లాలో విద్యుత్ కోతలకు కత్తెర పడనుందా.. అవుననే అంటున్నారు తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) అధికారులు. వారు చెప్పేదానిని బట్టిచూస్తే పూర్తిగా కాకపోరుునా.. కొంతమేరైనా విద్యుత్ కోతలు తగ్గే అవకాశాలు లేకపోలేదు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో లోపాలను సరిచేయడం ద్వారా కోతలను చాలావరకు నివారించవచ్చని ఈపీడీసీఎల్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు అవసరమైన కసరత్తు మొదలుపెట్టామని చెబుతున్నారు.
ఇవీ లోపాలు
ఓ పక్క విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుంటే మరోపక్క వినియోగం పెరిగిపోతోంది. దీంతో కోత లు విధించడం అనివార్యమవుతోంది. అయితే విద్యుత్ కొరత వల్ల వచ్చే కోతల కంటే స్థానిక సమస్యలు, లోపాల వల విధించే కోతలే ఎక్కువగా ఉంటున్నాయి. సబ్‌స్టేషన్ నుంచి వినియోగదారుడికి విద్యుత్ చేరేలోపు చాలావరకూ వృథా అవుతోంది. పాడైన లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల వల్ల లో-ఓల్టేజీ సమస్య తలెత్తుతోంది. ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎయిర్ బ్రేక్ స్విచ్‌లు లేకపోవడంతో బ్రేక్‌డౌన్ ఇబ్బం దులు తలెత్తుతున్నారు. ఫలితంగా మెరుగైన విద్యుత్‌కు నోచుకోక వినియోగదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఈ సమస్యపై తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) దృష్టి సారించింది. ప్రత్యేక బృందాలను నియమించి జిల్లావ్యాప్తంగా లైన్లు, ఫీడర్ల తనిఖీలు నిర్వహిస్తోంది. లోపాల విషయంలో సమగ్ర ప్రక్షాళనకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
వృథాకు అడ్డుకట్ట
ప్రస్తుతం జిల్లాలో రోజుకు సుమారు 1.40 కోట్ల యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. కోటా తక్కువగా ఇవ్వడంతో గంటల తరబడి కోత విధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాకు వచ్చే ప్రతి యూనిట్‌ను వృథా కానివ్వకుండా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ప్రస్తుతం 196 విద్యుత్ సబ్స్టేషన్లున్నాయి. వాటిపై లోడ్‌ను తగ్గించేందుకు, విద్యుత్ సరఫరాలో హై-ఓల్టేజీ, లో ఓల్టేజీ సమస్యలు (లైన్‌లాస్) తగ్గించి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఈపీడీసీఎల్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందుకు జిల్లాలో కొత్తగా 27 సబ్స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ పనులు చేయడానికంటే ముందు విద్యుత్ వృథాను అరికట్టి సరఫరా మెరుగుపరచాలని భావిస్తున్నారు.
విస్తృత తనిఖీలు
ఇద్దరు సభ్యులు గల 100 ప్రత్యేక బృందాలు జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తున్నాయి. 1,189 ప్రాంతాల్లో లో-ఓల్టేజి సమస్యలు ఉన్నట్లు ఇప్పటివరకూ నిర్వహించిన తనిఖీల్లో తేలింది. 178 ఫీడర్లపై గల వ్యవసాయ విద్యుత్ సర్వీసులను ఇతర సర్వీసుల నుంచి వేరు చేయాల్సి ఉందని గుర్తించారు. 331 ఎయిర్ బ్రేక్ (ఏబీ) స్విచ్‌లను పాక్షికంగా బాగుచేయాలని, 1,020 ఏబీ స్విచ్‌లను లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద కొత్తగా ఏర్పాటు చేయడం ద్వారా బ్రేక్ డౌన్లు ఇతర అవసరాలకు అనుకూలంగా ఉంటుందని తేల్చారు. 33 కేవీ ఫీడర్లపై 27 లైన్లు, 11 కేవీ ఫీడర్లపై 50 లైన్లను ఇంటర్ లింకింగ్ చేయాలని గ్రహించారు. త్వరలోనే వీటి ప్రక్షాళన పనులు చేపట్టనున్నారు.