25 నుంచి ‘బడి పిలుస్తోంది’ : కలెక్టర్
విజయవాడ: జిల్లాలో 25వ తేదీ నుంచి ‘బడి పిలుస్తోంది’ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహించాలని కల్టెక్టర్ ఎం. రఘునందన్‌రావు విద్యాశాఖాధికారులను ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 25వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ‘బడి పిలుస్తోంది’ లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై జిల్లాలో ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులతో కలెక్టర్ బుధవారం నగరంలో తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రధానంగా బడి బయట పిల్లలను తప్పనిసరిగా బడిలో చేర్పించాలన్నారు. 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలను తప్పనిసరిగా బడిలోచేర్చాలని 2009 విద్యాహక్కు చట్టం నిర్దేశించిందన్నారు. ఇప్పటికే నమోదై బడిమానేసిన వారిని గుర్తించి తిరిగి వారిని బడిలో చేర్పించాలన్నారు. జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లాలో ప్రజాప్రతినిధులుతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు.
జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కమిటీలో ఉంటారని చెప్పారు. ముఖ్యంగా ఎస్.సి., ఎస్.టి. బలహీన వర్గాలు ఎక్కువగా నివశించే కాలనీల్లో ఈ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి డి. దేవానందరెడ్డి మాట్లాడుతూ 25వ తేదీన జిల్లా మంత్రివర్యులు కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. ఆగస్టు1న 10వ తరగతి వరకు విద్య కొసాగిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ణ చేయించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఐ.కె.పి. అర్బన్ పి.డి.హిమబిందు, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డెరైక్టర్ డి.పుష్పమణి పాల్గొన్నారు.