mac drill
-
సమర్థంగా రసాయన ప్రమాదాల నియంత్రణ
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: భారీపరిశ్రమల్లో సంభవించే రసాయన ప్రమాదాలను సైతం సమర్థంగా నివారించే శక్తిసామర్థ్యాలు మనకున్నాయని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ప్రతినిధి బ్రిగేడ్ బి.ఎస్.తకర్ చెప్పారు. అగ్ని ప్రమాదాలతో పాటు ఫ్యాక్టరీల్లో సంభవించే ఇతర ప్రమాదాల నివారణపైనా దృష్టిపెట్టినట్టు తెలిపారు. ఎన్డీఎంఏ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఎస్డీఎంఏ) సహకారంతో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఆఫ్‌సైట్, ఆన్సైట్ ఫ్యాక్టరీల్లో కెమికల్ ఎమర్జెన్సీ మాక్‌డ్రిల్ నిర్వహించారు. విశాఖపట్నంలోని ఈస్ట్ ఇండియా హెచ్‌పీసీఎల్ వద్ద నిర్వహించిన మాక్‌డ్రిల్‌ను బ్రిగేడ్ బి.ఎస్.తకర్, ఎస్డీఎంఏ ఎండీ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి.ఎస్.సి.వర్మ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తకర్ మాట్లాడుతూ ఇలాంటి మాక్‌డ్రిల్స్‌తో పరిశ్రమల్లో రసాయన ప్రమాదాలు జరిగినప్పుడు యాజమాన్యం, ఆయా జిల్లాల యంత్రాంగం స్పందించి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెరుగుతుందని చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ సహజ, మానవ తప్పిదాలతో జరిగే విపత్తులతోపాటు కెమికల్ డిజాస్టర్స్‌పైనా దృష్టి సారించినట్లు తెలిపారు. అవగాహన, ముందుజాగ్రత్త చర్యలతో పాటు ప్రణాళిక రూపొందించడం ద్వారా రసాయనిక ప్రమాదాల స్థాయిని తగ్గించవచ్చన్నారు. భవిష్యత్‌లో వరదలు, తుపాన్లపైనా మాక్‌డ్రిల్స్‌తో అవగాహన కలి్పస్తామని చెప్పారు. 17 జిల్లాల్లో నిర్వహించిన మాక్‌డ్రిల్స్‌లో.. ఫ్యాక్టరీల్లో రసాయనిక ప్రమాదాలు జరిగితే ఎలా ప్రతి స్పందించి చర్యలు తీసుకుంటారో ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యక్షంగా చూపించాయి. -
Visakhapatnam: ఎయిర్ పోర్టులో ఉత్కంఠ.. విమానం హైజాక్ వేళ..
సాక్షి, గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయంలో యాంటీ–హైజాక్ మాక్ డ్రిల్ ఆద్యంతం ఉత్కంఠ∙రేకెత్తించింది. గురువారం ఎయిర్‌పోర్టు ఐఎన్ఎస్ డేగాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. విమానం హైజాక్‌కు గురి కాకుండా ఏ విధంగా అడ్డుకోవాలో ఇక్కడ ప్రదర్శించారు. తమ సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు ఈ ప్రక్రియ దోహద పడుతుందని అధికారులు తెలిపారు. ఈ మాక్ఎక్సర్సైజ్ మెరైన్ కమాండోలు (మార్కోస్), సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో నిర్వహించాయి. క్షతగాత్రుల తరలింపు భారత నౌకాదళ డోర్నియర్ ఉపయోగించి రూపొందించిన మాక్ హైజాక్ ఆధారంగా కార్యక్రమం ప్రదర్శించారు. ఐఎన్ఎస్ డేగా కమాండింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏరోడ్రోమ్ కమిటీ స్టాండ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌వోపీఎస్) ప్రకారం మాక్ఎక్సర్సైజ్ కార్యక్రమం చేపట్టారు. డేగా ఏటీసీ, క్విక్ రియాక్షన్ టీమ్ (క్యూఆర్టీ), మెరైన్ కమాండో, సీఐఎస్ఎఫ్, ఏఏఐ, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం త్వరతిగతిన స్పందించే తీరును నేషనల్ సెక్యూరిటీ గార్డు, ఎస్‌వోపీఎస్ అధికారులు పరిశీలించారు. భవిష్యత్తులో సంభవించే ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనే నైపుణ్యం సామర్థ్యం కలిగి ఉన్నారని నిర్ధారించారు. హైజాక్‌ను ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్న సైనికులు -
వ్యాక్సిన్ రిహార్సల్!
మరికొన్ని రోజుల్లో మన దేశంలో కూడా కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టే ఒకటి రెండు వ్యాక్సిన్లకు అనుమతి లభించవచ్చునని వార్తలొస్తున్న నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ మాక్ డ్రిల్ సోమవారం మొదలైంది. రెండురోజులపాటు నిర్వహించే ఈ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, అస్సాంలలో ప్రారంభించారు. వ్యాక్సిన్ కేంద్రాలకొచ్చేవారికి టీకా ఇవ్వడానికి వాస్తవంగా ఎంత సమయం పడుతుంది... దానికి ముందు పూర్తి చేయాల్సిన లాంఛనాలు అమలు జరపడంలో ఎదురయ్యే ఇబ్బందులేమిటి... వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు తలెత్తే పక్షంలో చేయాల్సిందేమిటì అనే అంశాలు ఇందులో గుర్తిస్తారు. వ్యాక్సిన్ల భద్రత, వాటి తరలింపు, అందులో ఏర్పడే లోటుపాట్లు తెలుసుకోవటం... వ్యాక్సిన్ తీసుకోవటానికొచ్చేవారు నిబంధనల ప్రకారం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలూ పాటిస్తున్నారో లేదో పర్యవేక్షించటం ఈ డ్రై రన్ వెనకున్న ఉద్దేశం. ఈ కార్యక్రమం అమలుచేసే క్రమంలో వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిబ్బంది, అధికారుల మధ్య సమన్వయం ఎలావున్నదో కూడా చూస్తారు. వీటన్నిటినీ పరిశీలించి మరింత పకడ్బందీ విధానానికి రూపకల్పన చేస్తారు. ఈ బృహత్తర ప్రక్రియలో ప్రభుత్వానికి చెందిన అనేక విభాగాల్లో పనిచేసే కోట్లాదిమంది పాలుపంచుకుంటారు గనుక ఎక్కడా లోటుపాట్లు లేకుండా, సాఫీగా పూర్తయ్యేలా చూడాలి. ఇదొక పెద్ద సవాలు. వాస్తవంగా అవసరమైనవారికి టీకాలిచ్చే ప్రక్రియ ప్రారంభించినప్పుడు ఏ స్థాయిలోనూ గందరగోళం తలెత్తకుండా చూడాలంటే ఇలాంటి డ్రైరన్‌లు తప్పనిసరి. ఇప్పుడు డ్రైరన్‌లు అమలవుతున్నచోట గుర్తించిన అంశాలను క్రోడీకరించి ఈ నాలుగు రాష్ట్రాల్లోని టాస్క్‌ఫోర్స్‌లు సవివరమైన నివేదికలు రూపొందిస్తాయి. వాటి ఆధారంగా దేశవ్యాప్తంగా అమలు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలు రూపొందుతాయి. ఇప్పుడు ఎంపిక చేసిన నాలుగు రాష్ట్రాలూ నాలుగు జోన్లలో వున్నాయి. ఈ రాష్ట్రాల్లో వుండే జిల్లా ఆసుపత్రులు, కింది స్థాయిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోవుండే ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు వ్యాక్సిన్ విషయంలో ఏమేరకు సంసిద్ధతలో వున్నాయో ఈ డ్రైరన్‌లో వెల్లడవుతుంది. ఈ కార్య క్రమంలో ఇచ్చేది డమ్మీ వ్యాక్సినే అయినా ఇందుకోసం రూపొందించిన ఆన్లైన్ ప్లాట్‌ఫాంలో ప్రతి దశనూ నమోదు చేస్తున్నారు. ఇలా వస్తున్న డేటాను కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది. అంటురోగాల నివారణకు టీకాలివ్వటం మన దేశంలో సాధారణమైన విషయమే అయినా తొలిసారి 1978లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 1985లో దాన్ని సార్వత్రిక వ్యాధి నిరోధక కార్యక్రమం(యూఐపీ) గా పేరు మార్చి మరింత విస్తృతపరిచారు. గర్భిణులకు, పిల్లలకు వివిధ రకాల వ్యాధులు సోకకుండా ముందుజాగ్రత్త చర్యగా టీకాలివ్వటం అప్పటినుంచీ కొనసాగుతోంది. దేశంలో దాదాపు అన్నిచోట్లా కనబడే పోలియో, కోరింత దగ్గు, మశూచి, ఆటలమ్మ, క్షయ వంటి 12 రకాల వ్యాధుల నివారణకు జాతీయ స్థాయిలోనూ, నిర్దిష్ట ప్రాంతాల్లో కనబడే రోటావైరస్, మెదడు వాపు వ్యాధి, న్యూమోనియావంటి వ్యాధుల నివారణకు టీకాలిచ్చే కార్యక్రమాలు అప్పటినుంచీ కొనసాగుతున్నాయి. ఈ టీకాలను భద్రపరచటంలో, తరలించటంలో, అవసరమైనవారికి అందించటంలో అవలంబించాల్సిన విధివిధానాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. సాంకేతికత వృద్ధి చెందాక ఇదంతా సులభంగా పూర్తవుతోంది. వ్యాక్సిన్ల స్టాక్ ఎక్కడుందో, ఎంతుందో, అవన్నీ నిబంధనల ప్రకారం నిర్దిష్టమైన ఉష్ణోగ్రతల్లో వున్నాయా లేదా వంటి అంశాలను ఎప్పటికప్పుడు అన్ని స్థాయిల్లోని అధికారులూ తెలుసుకోవటానికి అనువైన విధానం రూపొందింది. అయితే ప్రక్రియలు దేశ జనాభాలో పరిమిత వర్గాలకు ఉద్దేశించినవి. కానీ కరోనా వ్యాక్సిన్ అలా కాదు. అది దేశంలో అన్ని ప్రాంతాలవారికీ, అన్ని వయసులవారికీ అందాల్సిందే. కనుకనే ఈ వ్యాక్సిన్ విష యంలో ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించటం తప్పనిసరైంది. కరోనా వ్యాక్సిన్‌పై జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన నిపుణుల బృందం తొలి దశలో వ్యాక్సిన్ ఇవ్వటానికి మూడు కేటగిరీలను గుర్తించింది. ఆరోగ్య రంగ కార్యకర్తలకు(దాదాపు కోటిమంది), కరోనాపై ముందుండి పోరాడే వారికి (దాదాపు 2 కోట్లు), ముప్పు అధికంగా వుండే వృద్ధులకు (దాదాపు 27 కోట్లు) ఈ వ్యాక్సిన్ ఇవ్వాలనేది ప్రభుత్వ సంకల్పం. ఇలా మొత్తంగా తొలి దశలో 30 కోట్లమందికి రెండు దఫాలు టీకాలివ్వాలి. అంటే 60 కోట్ల డోస్‌లను ప్రభుత్వాలు తరలించాలి. వాటికి అవసరమైన కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు, రవాణా, టీకాలిచ్చే వైద్య సిబ్బంది, ఇతరత్రా ప్రభుత్వ విభాగాల సిబ్బంది సహాయ సహకారాలు ఈ బృహత్తరకార్యక్రమానికి అవసరం. ఏడాదికాలంగా కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన భీతావహం అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల 14 లక్షలమందికి ఆ వ్యాధి సోకగా, దాదాపు 18 లక్షలమంది దానికి బలయ్యారు. మన దేశంలో ఇంతవరకూ కోటి 2 లక్షలమందికి ఆ వ్యాధి సోకగా లక్షా 48 వేలమంది మరణించారు. గత కొన్ని వారాలుగా అది క్రమేపీ ఉపశమిస్తున్న జాడలు కనబడుతుండగా అక్కడక్కడ కొత్త రకం కరోనా వైరస్ తలెత్తినట్టు వార్తలొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం అందరికీ ఎంతో ఉపశమనం కలిగించే పరిణామం. ఇప్పటికే బ్రిటన్, అమెరికా, రష్యా వంటి దేశాల్లో కరోనా వ్యాక్సిన్లివ్వటం మొదలైంది. అక్కడక్కడ కొందరిలో దుష్ప్రభావాలు కన బడిన ఉదంతాలు మీడియాలో వస్తున్నా, మొత్తంగా చూస్తే అవి సురక్షితమైనవేనని తేలింది. ఇలా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో రోగ నిరోధక వ్యవస్థ ఏమేరకు బలపడిందో, అది కరోనా నిరోధానికి ఎంతగా తోడ్పడిందో రాగలరోజుల్లో వెల్లడవుతుంది. ఈలోగా మన పౌరులకు టీకా అందించటానికి మన సన్నద్ధత ఎంతో మదింపు వేసుకోవటం అవసరం. అది ఈ డ్రై రన్ నెరవేరుస్తుంది. -
వచ్చే వారమే డ్రై రన్
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు యంత్రాంగం సన్నద్ధతను అంచనా వేసేందుకు ఈ నెల 28, 29వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్, పంజాబ్, అస్సాం, గుజరాత్ రాష్ట్రాల్లో కేంద్రం మాక్‌డ్రిల్ చేపట్టనుంది. టీకా లేకుండానే చేపట్టే ఈ ‘డ్రై రన్’ అచ్చంగా వ్యాక్సినేషన్ మాదిరిగానే ఉంటుంది. ఒక్కో రాష్ట్రం నుంచి రెండు జిల్లాలను ఎంపిక చేసుకుని జిల్లా ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం/కమ్యూనిటీ హెల్త్ సెంటర్, పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, ప్రైవేట్ ఆస్పత్రులు వంటి ఐదు విభాగాల్లో వ్యాక్సినేషన్ సన్నద్ధతను అంచనా వేయనుంది. ‘వ్యాక్సిన్ సరఫరా, కేటాయింపులు, పరీక్షలు, సిబ్బంది మోహరింపు, ‘డ్రై రన్’ చేపట్టే చోట ఏర్పాట్లు, మాక్ డ్రిల్ సమయంలో భౌతిక దూరం వంటి ముందు జాగ్రత్తలను పాటించడం, నివేదికల తయారీ, సంబంధిత అధికారుల సమీక్ష సమావేశం వివరాలను ‘కో విన్’ సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ‘యంత్రాంగం సమీకరణ, వ్యాక్సినేషన్ ప్రక్రియను పరీక్షించడం, క్షేత్రస్థాయిలో ‘కో విన్’ వినియోగం, ప్రణాళిక, అమలు, ఎదురయ్యే సవాళ్లు, వాస్తవ కార్యాచరణకు చేపట్టాల్సిన చర్యలను ఈ కార్యక్రమంలో గుర్తిస్తాం’ అని ఆరోగ్య శాఖ తెలిపింది. వివిధ స్థాయిల్లో అధికారుల అనుభవాలను కూడా సమీక్షిస్తామని వివరించింది. వ్యాక్సినేషన్ సందర్భంగా ఏమైనా అనుకోని అవాంతరాలు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియపై వివిధ రాష్ట్రాలకు చెందిన 7 వేల మంది జిల్లా స్థాయి ట్రైనర్లకు శిక్షణ ముగిసిందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. 17,831 బ్లాకులకు గాను 1,399 బ్లాకుల్లో వ్యాక్సినేషన్ బృందాలకు శిక్షణ పూర్తయిందనీ, మిగతా బ్లాకుల్లో శిక్షణ పురోగతిలో ఉందని తెలిపింది. ధారావిలో కొత్త కేసులు సున్నా ముంబై: ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరుగాంచిన ముంబైలోని ధారావి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మొన్నటి వరకు ప్రపంచంలోని కోవిడ్ హాట్స్పాట్లలో ఒకటిగా ఉన్న ధారావిలో గత 24 గంటల్లో ఒక్క కొత్త కరొనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఏప్రిల్ ఒకటి తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇక్కడ మొత్తం 3,788 కేసులు నమోదు కాగా, 3,464 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ యాక్టివ్ కేసులు 12 మాత్రమే. సుమారు రెండున్నర చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ మురికి వాడలో లక్షలాదిగా జనం నివసిస్తున్నారు. కొత్త కేసులు 23,067 దేశంలో కొత్తగా మరో 23,067 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 1,01,46,845కు చేరుకోగా కోలుకుని వారి సంఖ్య 97లక్షలు దాటింది. 24 గంటల్లో మరో 336 మంది కోవిడ్‌తో చనిపోగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,47,092గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా నుంచి ఇప్పటి వరకు 97,17,834 మంది కోలుకోగా రికవరీ రేటు 95.77%కి చేరుకుంది. -
ప్రకృతి విపత్తు.. ప్రళయ సహాయం
♦ వరద సహాయక చర్యలపై అవగాహన కల్పించనున్న ఆర్మీ ♦ ‘ప్రళయ సహాయం’ పేరుతో కార్యక్రమం ♦ సాగర్ వేదికగా ఈనెల 22, 23 తేదీల్లో మాక్‌డ్రిల్ ♦ పాల్గొంటున్న 500 మంది సైనికులు ప్రకృతి విపత్తులు వస్తే పరిస్థితేంటి? వరద ఉప్పొంగితే, నగరం జలమయమైతే ఏం చేయాలి? బాధితులను ఎలా రక్షించాలి? నష్ట నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సంయుక్తాధ్వర్యంలో హుస్సేన్‌సాగర్ వేదికగా ఈనెల 22, 23 తేదీల్లో మాక్‌డ్రిల్ నిర్వహించనున్నారు. ఇందులో దాదాపు 500 మంది సైనికులు పాల్గొంటున్నారు. – సాక్షి, సిటీబ్యూరో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ సహకారం అందిస్తోంది. ఈ మాక్‌డ్రిల్‌లో భాగంగా పీపుల్స్ ప్లాజాలో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వరద బాధితులను ఎలా రక్షించాలనే అంశంపై ఇక్కడ ప్రదర్శన ఉంటుంది. ఇప్పటికే సైనికులు సాగర తీరాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. సాగర్ చుట్టూ సైనికులు పహారా కాస్తున్నారు. సాగర్‌లో మూడు విభాగాలుగా గృహసముదాయాలు ఏర్పాటు చేశారు. నీటిలో ప్రమాద శాతం తక్కువగా ఉండే ప్రాంతాన్ని ఒకటో సముదాయంగా ఒడ్డుకు కొద్ది దూరంలో నిర్మించారు. ప్రమాదం మధ్యస్తంగా రెండో విభాగాన్ని ఒడ్డుకు ఇంకొద్ది దూరంలో నిర్మించారు. ఇక ప్రమాద తీవ్రత ఎక్కువున్న ప్రాంతంగా మూడో విభాగాన్ని సాగర్ మధ్యలో ఏర్పాటు చేశారు. ఈ మూడు ప్రాంతాల్లో మాక్‌డ్రిల్ నిర్వహించనున్నారు. నిఘా నీడలో.. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇందుకు అత్యాధునికి కెమెరాలు వినియోగిస్తున్నారు. విద్యుత్ సహాయంతో ఎడారి ప్రాంతాల్లో, మంచుకొండల్లో సైన్యం వినియోగించే ప్రత్యేక వైర్లెస్ పరికరాలను కెమెరా రికార్డింగ్‌ల కోసం ఇక్కడ అందుబాటులో ఉంచారు. ట్యాంక్‌బండ్ చుట్టూ దాదాపు 12 ప్రత్యేక కెమెరాలతో ఈ మాక్‌డ్రిల్‌ను డిజిటల్ స్క్రీన్‌పై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రవేశం ఉచితం.. ఈ ప్రదర్శనను తిలకించేందుకు అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. ఈనెల 22, 23 తేదీల్లో సంజీవయ్య పార్క్, హుస్సేన్‌సాగర్ వేదికగా సైనికుల విన్యాస ప్రదర్శనలు ఉంటాయి. అవగాహన వేదిక.. ప్రకృతి విపత్తులపై అవగాహన కల్పించేందుకు ఆర్మీ ప్రతి ఏటా ఏదో ఒక మహానగరంలో మాక్‌డ్రిల్ చేపడుతుంది. హైదరాబాద్‌లోని చాలా కాలనీలు తరచూ ముంపునకు గురవుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో నగరంలో ఈ మాక్‌డ్రిల్ నిర్వహించనున్నారు. సిటీ జలమయమైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వరద బాధితులను ఎలా రక్షించాలి? ఏ శాఖ ఏ పని చేయాలి? తదితర విషయాలపై ఇందులో అవగాహన కల్పిస్తారు. ఆర్మీ ఆఫీసర్లు, అంతర్జాతీయ వక్తలు ఇందులో పాల్గొంటారు.– బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ -
సచివాలయంలో అగ్నిమాపక బృందం మాక్‌డ్రిల్
హైదరాబాద్ సిటీ: రాష్ట్ర సచివాలయంలో అగ్నిమాపక సిబ్బంది గురువారం మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిప్రమాదం వంటి విపత్కర పరిస్థితుల్లో వెంటనే స్పందించి నష్టాన్ని వీలైనంత తగ్గించే దిశగా సాధన చేశారు. అగ్నిప్రమాదం సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి తమను తాము ఎలా రక్షించుకోవాలనే దానిపై ఉద్యోగులకు అగ్నిమాపక సిబ్బంది తగు సూచనలు చేశారు. వేసవి కాలం కావడంతో అకస్మాత్తుగా సంభవించే అగ్నిప్రమాదాల నిర్వహణపై సిబ్బందిని సమాయత్తం చేసేందుకు మాక్‌డ్రిల్ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.