బస్సు ఎక్కకుండా జారుకున్నారు!
టీడీపీకి తెలంగాణలో బస్సుయాత్ర కలిచొచ్చినట్టు కనబడడం లేదు. చంద్రబాబు బస్సుయాత్ర గురించి ప్రకటన చేసిన నాటి నుంచే 'సైకిల్' టైరుకు పంక్చర్ పడడం మొదలైంది. తెలుగు తమ్ముళ్లు బస్సు ఎక్కకుండానే జారుకుంటున్నారు. ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ గులాబీ చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో బాబుగారి బస్సుయాత్ర ఆదిలోనే జావగారిపోయింది.
మొత్తానికి శుక్రవారం బస్సుయాత్ర బయలుదేరింది. ఇక్కడ కూడా సైకిల్ పార్టీకి ఉలికిపాటు తప్పలేదు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ధర్మారెడ్డి, ఆర్. కృష్ణయ్య... బస్సుయాత్రకు డుమ్మాకొట్టారు. బాబుగారి బస్సు ఎక్కకుండా జారుకున్నారు. మంచిరెడ్డి, కృష్ణయ్య కూడా సైకిల్ దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వచ్చాయి. మరికొంత మంది వరుసలో ఉన్నారంటూ టీఆర్ఎస్ నాయకులు చెబుతుండడంతో టీడీపీలో గుబులు రేపుతోంది. టీడీపీ శిబిరం పూర్తిగా ఖాళీ కావాలనే లక్ష్యంతో కేసీఆర్ పావులు కదుపుతున్నారని, త్వరలోనే మరికొందరు టీడీపీ సీనియర్లు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమన్న సమాచారం పచ్చ పార్టీని కుదిపేస్తోంది.
తమ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరకుండా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో టీడీపీ అధినేతకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అయితే బస్సుయాత్ర ప్రకటన చేసిన నాటి నుంచే తమ పార్టీకి అపశకునాలు ఎదురవుతుండడంతో తెలుగు తమ్ముళ్లు 'బాబోయ్ బస్సుయాత్ర' అంటున్నారు(ట).