గాల్లోకి కానిస్టేబుల్ 22 రౌండ్ల కాల్పులు!
మంచిర్యాల: 13వ ఏపీఎస్పీ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ అనిల్ గాల్లో కాల్పులు ఘటన ఆందోళనకు కారణమైంది. విధుల పేరుతో అధికారులు వేధిస్తున్నారని కానిస్టేబుల్ ఆరోపిస్తూ గాల్లోకి 22 రౌండ్లు కాల్పులు జరిపిన ఘటన ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం గుడిపేటలో చోటు చేసుకుంది.
దీంతో ఆ కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఆకస్మిక ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానిస్టేబుల్ అనిల్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.