Madamji
-
భయమేం లేదు నాకు!
కథానాయికలు నిర్మాణ రంగంలోకి ప్రవేశించడం కొత్త కాదు. పూజా భట్, జూహీ చావ్లా, అనుష్కా శర్మ, దియా మిర్జా, అమీషా పటేల్.. ఇలా హిందీ రంగంలో పలువురు తారలు నిర్మాతలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. హాట్ గాళ్ ప్రియాంకా చోప్రా కూడా ఎప్పట్నుంచో నిర్మాతగా మారాలనుకుంటున్నారు. ‘మేడమ్‌జీ’ పేరుతో ఓ సినిమా ప్రకటించారు కూడా. ఇది జరిగి ఏడాది పైనే అయ్యింది. కానీ, ‘మేడమ్‌జీ’ని ప్రకటన వరకే పరిమితం చేసేశారు. కథానాయికగా కోట్లు తీసుకుంటున్నప్పటికీ నిర్మాతగా పెట్టుబడి పెట్టడానికి ప్రియాంక భయపడుతున్నారనీ, అందుకే వెనకడుగు వేసేశారన్నది కొంతమంది ఊహ. కానీ, భయమా? నాకా? అంటున్నారీ బ్యూటీ. ‘‘హిందీ చిత్రం ‘బాజీరావ్ మస్తానీ’, అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’తో బిజీగా ఉండడంవల్ల ‘మేడమ్‌జీ’ని మొదలుపెట్టేకపోయాను. ఎప్పుడు మొదలుపెడతానో చెప్పలేను కానీ, కచ్చితంగా ఈ సినిమా నిర్మిస్తాను’’ అని ప్రియాంక పేర్కొన్నారు. కొత్తవారికి ఆహ్వానం. ‘పర్పుల్ పెబల్స్ పిక్చర్స్’ పతాకంపై ఆమె సినిమాలు తీయాలనుకుంటున్నారు. కొన్ని చిత్రాల్లో తాను నటించాలనుకుంటున్నారు. స్టార్స్‌తో కొన్ని సినిమాలు నిర్మించాలనుకుంటున్నారు. కొత్తవారితో కూడా సినిమాలు తీయాలనుకుంటున్నానని ప్రియాంక తెలిపారు. కొంతమంది రచయితలతో కలిసి కొన్ని స్క్రిప్ట్స్ కూడా వర్కవుట్ చేశారట. అనుకూలమైన సమయం చూసుకుని, వాటి గురించి ప్రకటిస్తానని ఆమె అన్నారు. నిర్మాణ రంగంలోకి మాత్రమేనా? దర్శకురాలిగా కూడా మారాలనుకుంటున్నారా? అనే ప్రశ్న ప్రియాంక ముందుంచితే - ‘‘నా సినిమాల షూటింగ్ స్పాట్స్‌లో డెరైక్టర్స్ జాబ్‌ని గమనిస్తుంటాను. ఎలా చేస్తున్నారా? అని ఆశ్చర్యం కలుగుతుంది. డెరైక్షన్ అంత ఈజీ కాదు. ఇప్పుడు నేను ఉన్న బిజీలో దాని గురించి ఆలోచించలేను. కంటి నిండా నిద్రపోవడానికి కూడా టైమ్ దొరకడంలేదు. బాగా తీరిక చిక్కినప్పుడు డెరైక్షన్ గురించి ఆలోచిస్తాను. నాకు తెలిసి ఇప్పుడప్పుడే మాత్రం కాదు’’ అని చెప్పారు. -
కలల చిత్రం ఆగిందా..?
ప్రియాంకా చోప్రా కథానాయికగా మాధుర్ బండార్కర్ ‘మేడమ్‌జీ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాలనుకున్నారు. ఈ చిత్ర కథ బాగా నచ్చడంతో ప్రియాంక నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించాలనుకున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా ప్రియాంక పేర్కొన్నారు. అయితే ఇప్పుడా కలల చిత్రం ఆగిందనే వార్త వినిపిస్తోంది. హిందీ చిత్రాలు, అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’తో బిజీగా ఉన్నందున ఇప్పుడప్పుడే ‘మేడమ్‌జీ’కి తేదీలు కేటాయించలేని పరిస్థితిలో ప్రియాంక ఉన్నారట. దాంతో ఈ చిత్రం ప్రస్తుతం పట్టాలెక్కే అవకాశం లేదని సమాచారం. -
ప్రియాంక నిర్మాణ ఉల్లాసం..
హీరోయిన్గా అభిమానులను అలరిస్తున్న బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఇటీవల నిర్మాతగా మారింది. ఇన్నాళ్లూ నిర్మాతల నుంచి రెమ్యునరేషన్ తీసుకునే ఈ ముద్దగుమ్మ తొలిసారిగా ‘మేడమ్‌జీ’ సినిమా కోసం డబ్బు ఖర్చు చేస్తోంది. డబ్బులిస్తుండటంలో ఆనందం ఏముంటుందని అడిగితే.. ‘ఒక నిర్మాతగా నిర్ణయాలు తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది’ అని చెబుతోంది. ప్రస్తుతం సెట్లో ఉన్న ఈ సినిమా.. స్క్రీన్ మీద హిట్ కొడితేనే మేడమ్జీకి అసలు ఎంజాయ్మెంట్ అంటున్నారు బాలీవుడ్ జనాలు. -
మరో అస్త్రంతో మధుర్ భండార్కర్ రెడీ!
ఇంతకుముందు ఫ్యాషన్, పేజ్3 లాంటి సినిమాలతో నగరాల్లో విశృంఖలంగా సాగుతున్న సంస్కృతిని, అందులోని భిన్న పార్శ్వాలను ఎండగట్టిన బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ ఇప్పుడు మరో అస్త్రం బయటకు తీస్తున్నారు. 'మేరీ కోమ్' సినిమా విజయంతో దూసుకెళ్తున్న ప్రియాంకా చోప్రా తొలిసారిగా నిర్మాతగా మారి.. 'మేడమ్ జీ' అనే చిత్రం తీయబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్ర్రిప్టు, ఇతర వ్యవహారాలన్నింటినీ మధుర్ భండార్కర్ చూసుకుంటున్నారు. సినిమాలో ఎవరెవరు నటిస్తారన్న విషయం ఇంకా తేలాల్సి ఉందని, అవన్నీ అయ్యేసరికి నవంబర్ అవుతుందని ప్రియాంకా చోప్రా చెబుతోంది. మేడమ్‌జీ సినిమాలో ప్రియాంకా చోప్రా ఎటూ ప్రధానపాత్రలో నటిస్తుంది. మిగిలినవాళ్ల సంగతే తేలాలి. భండార్కర్ తీసిన 'ఫ్యాషన్' సినిమాలో కూడా ఆమె నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో నటనకు ఆమెకు జాతీయ ఉత్తమనటి అవార్డు కూడా వచ్చింది. తాను మొట్టమొదటిసారిగా తీసే సినిమాకు దర్శకత్వం వహించడానికి మధుర్ భండార్కర్ అంగీకరించినందుకు తానెంతో కృతజ్ఞురాలినై ఉంటానని ప్రియాంక చెబుతోంది. -
నూతన టాలెంట్‌ను ప్రోత్సహిస్తా
ముంబై : ప్రతిభావంతులైన కొత్త డెరైక్టర్లు, నటులు, రచయితలను ప్రోత్సహించేందుకు ముందుంటానని నిర్మాతగా మారిన ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తెలిపారు. ఆమె మాధురీ భండార్కర్ దర్శకత్వంలో ‘మేడంజీ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఆమె ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ నిర్మాతగా మంచి సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకున్నానన్నారు. తాను నిర్మాతగా మారాలని అనుకున్నాగాని తాను నటించే సినిమాకే నిర్మాతగా మారుతానని అనుకోలేదని చెప్పారు. మోడల్‌గా, సింగర్‌గా, నటిగా రాణించిన ప్రియాంక ఇప్పుడు నిర్మాతగా కూడా రాణిస్తాననే ధీమాను వ్యక్తం చేసింది. ‘నిర్మాతగా ప్రతిభావంతులైన కొత్తవారిని ప్రోత్సహించాలనుకుంటున్నా.. నటన, దర్శకత్వం, రచ న..ఇలా ఏ విభాగమైనా సరే.. ప్రతిభ ఉంటే కొత్తవారికి అవకాశం ఇవ్వడానికి వెనుకాడన’ని చెప్పింది. పరిశ్రమలో కొత్తవారిని ప్రోత్సహించడం చాలా అవసరమని అభిప్రాయపడింది. ‘మార్పును మనం ఆహ్వానించాల్సిందే.. భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆలోచించను.. ఎప్పుడేం చేయాలనిపిస్తే అదే చేస్తాను.. భవిష్యత్తులో నిర్మాతగా స్థిరపడతానో లేక సంగీత దర్శకురాలిగా మారతానో.. ఇప్పుడైతే నటిగా కొనసాగాలనే అనుకుంటున్నా..’ అని ప్రియాంక చెప్పింది. ఇక ‘మేడంజీ’ గురించి మాట్లాడుతూ... ఇది ఒక ఐటమ్ గర్ల్‌కు సంబంధించిన కథ.. ఆమె రాజకీయ నాయకురాలిగా ఎలా మారింది.. జీవితంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లను ఇందులో చూపిస్తున్నాం..’ అని చెప్పింది. నిర్మాతగా తనకు సహకరించేందుకు చాలా మంచి టీం ఉందని, వారి సహకారంతో భవిష్యత్తులో మంచి సినిమాలు తీస్తాననే నమ్మకాన్ని వెలుబుచ్చింది. అయితే ‘బాక్సాఫీస్ కలెక్షన్స్’ అనే దానిపై తనకు ఇంకా అవగాహన లేదని, తాను నటించిన సినిమా ఏదైనా విడుదలైనప్పుడు ఎవరో ఒకరు తనకు ఫోన్ చేసి బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి అడుగుతుంటారని, దానికి సమాధానం చెప్పడానికి తాను చాలా ఇబ్బంది పడుతుంటానని చెప్పింది. అయితే మున్ముందు అన్ని విభాగాల మీద పట్టు సంపాదిస్తానని ముక్తాయించింది. -
కథ నచ్చి నిర్మాతగా...
‘‘జీవితం చాలా విచిత్రమైనది. ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండదు. రేపు ఉన్నట్లు ఎల్లుండి ఉండదు. అందుకే ఎప్పుడేది అనిపిస్తే అది చేసేయాలి’’ అంటోంది ప్రియాంకా చోప్రా. కథానాయికగా మంచి స్థానంలో ఉన్న ప్రియాంక ఇటీవల మ్యూజికల్ ఆల్బమ్స్ కూడా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పడు ‘మేడమ్‌జీ’ చిత్రం ద్వారా నిర్మాతగా మారాలని నిర్ణయించుకుంది. మధుర్ బండార్కర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేయనుంది ప్రియాంక. రాజకీయ నాయకురాలిగా మారిన ఐటమ్ సాంగ్ డాన్సర్ కథతో ఈ చిత్రం సాగుతుంది. ఈ కథ ప్రియాంకకు బాగా నచ్చడంతో ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తానని మధుర్ని అడిగిందట. అందుకు మధుర్ కూడా పచ్చజెండా ఊపారని సమాచారం. మధుర్ దర్శకత్వం వహించిన ‘ఫ్యాషన్’లో ప్రియాంక నటించడం, ఆ చిత్రం నటిగా ఆమెకు ప్లస్ కావడం తెలిసిందే. అందుకే ఆయన దర్శకత్వంలో మరో సినిమాకి అవకాశం రావడంతో ఆనందపడుతోంది ప్రియాంక. పైగా, కథ కూడా బ్రహ్మాండంగా ఉండటంతో పెట్టుబడి పెట్టాలని ఫిక్స్ అయ్యింది. మరి... నిర్మాతగా ఈ సినిమా ప్రియాంకకు ఎలాంటి అనుభూతినిస్తుందో కాలమే చెప్పాలి. -
‘మేడమ్‌జీ’ ఎవరు?
వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించడం మధుర్ భండార్కర్ స్టయిల్. ఇప్పటివరకు ఆయన దాదాపు డజను సినిమాలకు దర్శకత్వం వహిస్తే, వాటిలో ఈ కోవకు చెందిన కథాంశాలే ఎక్కువ. మధుర్ సినిమాల్లో కథానాయికలకు నటనపరంగా నిరూపించుకోవడానికి మంచి స్కోప్ ఉంటుంది. అందుకే, ఆయన సినిమాల్లో నటించడానికి చాలామంది ఆసక్తి కనబరుస్తారు. స్టార్ హీరోయిన్లు తమంతట తాము ముందుకొచ్చినా తన కథకు నప్పితేనే తీసుకుంటారు మధుర్. ప్రస్తుతం ఆయన ‘మేడమ్‌జీ’ అనే సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజకీయ నాయకురాలిగా మారిన ఓ నటి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో టైటిల్ రోల్ పోషించే అవకాశం ఏ కథానాయికకు దక్కుతుంది? అనే విషయమై బాలీవుడ్లో చర్చ జరుగుతోంది. మధుర్ మనసులో మాత్రం విద్యాబాలన్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే ఉన్నారట. ‘మేడమ్‌జీ’ పాత్రకు ఈ ముగ్గురూ బాగుంటారని ఆయన భావిస్తున్నారట. త్వరలో ఈ లలనామణులకు ఆయన ఈ చిత్రకథ చెప్పబోతున్నారని సమాచారం. ఈ కథ విన్న తర్వాత ముగ్గురిలో ఎవరు ఎక్కువగా ఎగ్జయిట్ అయితే వాళ్లని తీసుకోవాలనుకుంటున్నారట.