‘మేడమ్‌జీ’ ఎవరు?
వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించడం మధుర్ భండార్కర్ స్టయిల్. ఇప్పటివరకు ఆయన దాదాపు డజను సినిమాలకు దర్శకత్వం వహిస్తే, వాటిలో ఈ కోవకు చెందిన కథాంశాలే ఎక్కువ. మధుర్ సినిమాల్లో కథానాయికలకు నటనపరంగా నిరూపించుకోవడానికి మంచి స్కోప్ ఉంటుంది. అందుకే, ఆయన సినిమాల్లో నటించడానికి చాలామంది ఆసక్తి కనబరుస్తారు. స్టార్ హీరోయిన్లు తమంతట తాము ముందుకొచ్చినా తన కథకు నప్పితేనే తీసుకుంటారు మధుర్. ప్రస్తుతం ఆయన ‘మేడమ్‌జీ’ అనే సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రాజకీయ నాయకురాలిగా మారిన ఓ నటి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో టైటిల్ రోల్ పోషించే అవకాశం ఏ కథానాయికకు దక్కుతుంది? అనే విషయమై బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. మధుర్ మనసులో మాత్రం విద్యాబాలన్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే ఉన్నారట. ‘మేడమ్‌జీ’ పాత్రకు ఈ ముగ్గురూ బాగుంటారని ఆయన భావిస్తున్నారట. త్వరలో ఈ లలనామణులకు ఆయన ఈ చిత్రకథ చెప్పబోతున్నారని సమాచారం. ఈ కథ విన్న తర్వాత ముగ్గురిలో ఎవరు ఎక్కువగా ఎగ్జయిట్ అయితే వాళ్లని తీసుకోవాలనుకుంటున్నారట.