ముస్లింల అభ్యున్నతికి కృషి
మహబూబ్‌నగర్ అర్బన్:
ఆంధ్రా పాలకుల వివక్ష వల్ల వెనుకబాటుకు గురైన తెలంగాణ ముస్లిం మైనార్టీలకు తమ ప్రభుత్వం వచ్చే పదేళ్లలో పూర్వవైభవాన్ని తీసుకొస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ అన్నారు. మహబూబ్‌నగర్‌లోని జేజేఆర్ గార్డెన్స్‌లో మంగళవారం రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా జిల్లాలోని మసీ దులు, ఈద్గాల మరమ్మతులకు మంజూరైన నిధులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1956 కంటే ముందు తెలంగాణలోని ముస్లింలు అన్నిరంగాల్లో ముందుండేవారని గుర్తుచేశారు. బలవంతంగా ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలిపారన్నారు. అప్పటి నుంచి సీమాంధ్ర పాలకులు చేసిన నిర్వాకం వల్ల ముస్లింలతోపాటు అన్నివర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. అందుకే నూతన రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దేశరాజకీయ చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా వినూత్న పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ప్రకటించడమే కాకుండా వాటి అమలుకు న్యాయపరంగా అడ్డంకులు కలగకుండా అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారన్నారు. గత ప్రభుత్వాలు మైనార్టీల సంక్షేమం పేరుతో బడ్జెట్ కేటాయించి ఆ నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేసేవారు కాదన్నారు. సీఎం కేసీఆర్ ముస్లింల సంక్షేమం కోసం వెయ్యి కోట్లను కేటాయించి తమ పట్ల ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. పేదింటి వధువుల వివాహం కోసం *51 వేల నగదును వారి పేర బ్యాంకులో జమచేయడానికి నిర్ణయించడం శుభసూచకమని అన్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాల్‌రాజ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ భాస్కర్లు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల కోసం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. అందుకోసం ముస్లింలంతా తమ ప్రభుత్వానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ ప్రియదర్శిని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలకు మహర్దశ కలగనుందన్నారు. జిల్లాలో రంజాన్, వినాయకచవితి పర్వదినాల్లో కలిసిమెలిసి ఉన్న హిందూ, ముస్లింలు ఈ నెల 24న జరగనున్న బతుకమ్మ రాష్ట్ర పండుగను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మసీదు కమిటీలకు ఆర్థికసాయంగా చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జేసీ శర్మన్, ఏజేసీ రాజారాం, డీఆర్ఓ రాంకిషన్, మైనారిటీ శాఖల అధికారులు శీరిష, షేక్ కరీముల్లా, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.