
తెలంగాణలో సమగ్రంగా రెవెన్యూ సర్వే
తెలంగాణలోని పది జిల్లాల్లో పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి సమగ్ర రెవెన్యూ రికార్డులను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్‌అలీ తెలిపారు.
ప్రణాళిక రూపొందించాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆదేశం
హైదరాబాద్: తెలంగాణలోని పది జిల్లాల్లో పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి సమగ్ర రెవెన్యూ రికార్డులను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్‌అలీ తెలిపారు. ఇందుకోసం అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని ఆధికారులను ఆదేశించినట్లు చెప్పారు. వందేళ్ల క్రితం నిజాం కాలంలోనే రెవెన్యూ సర్వే జరిగిందని, ఇప్పటికీ ఆ రికార్డుల మీదే ఆధారపడాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తాజాగా సర్వేపై దృష్టి సారిస్తున్నట్టు ఆయన చెప్పారు.
ఇందుకు అవసరమైన నిధులు, ఇతర అంశాలపై అధికారుల నుంచి నివేదిక కోరినట్లు మంత్రి తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. రెవెన్యూలాంటి కీలక శాఖలను గతంలో ఎన్నడూ మైనారిటీలకు కేటాయించలేదని, కేసీఆర్ తనకు ఈ బాధ్యతను అప్పగించడం ఆయన లౌకిక విధానాలకు నిదర్శనమన్నారు