చిరంజీవికి ఆ రెండు పాటలు అంటే చాలా ఇష్టం:మహతి స్వరసాగర్
‘‘నాన్నగారి (మణిశర్మ) బర్త్‌డేకి మెహర్ రమేష్‌గారు వచ్చారు. ‘చిరంజీవిగారి ‘భోళా శంకర్’కి నువ్వు సంగీతం అందిస్తున్నావ్’ అంటే జోక్ చేస్తున్నారేమో అనుకున్నా. ఆ తర్వాతి రోజు కథ చెప్పడంతో షాకయ్యా’’ అన్నారు సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భోళా శంకర్’. తమన్నా హీరోయిన్గా నటించారు. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా మహతి స్వరసాగర్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా కోసం తొలిసారి నాన్నగారి సలహాలు తీసుకున్నా. ట్యూన్ చేశాక నాన్నగారికి వినిపించాను. చిరంజీవిగారికి తొలిసారి ట్యూన్ వినిపించినప్పుడు ‘చెవిలో తుప్పు వదిలించావ్’ అని అభినందించడంతో మరింత ధైర్యంతో ముందుకు సాగాను. ఈ సినిమాలోని ‘జామ్ జామ్.., మిల్కీ బ్యూటీ..’ పాటలంటే చిరంజీవిగారికి ఇష్టం. నేపథ్య సంగీతంపైనా ప్రత్యేక దృష్టి సారించి, బాగా ఇచ్చాను. నాన్నగారి పాటల్లో ‘ఇంద్ర’లోని ‘రాధే గోవిందా..’ పాటని రీమిక్స్ చేయాలని ఉంది. అది రామ్చరణ్గారికే సరిపోతుంది’’ అన్నారు.