పోస్టుమన్ ఉద్యోగాలకు దరఖాస్తుల వెల్లువ
వీరన్నపేట (మహబూబ్‌నగర్) : పోస్టల్ శాఖ తరపున ఉద్యోగ నియామకాల కోసం చేపట్టిన ప్రక్రియ వేగం పుంజుకుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తుండడంతో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులు పెద్దఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. పోసుమన్, మెయిల్గార్డ్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం 82 పోస్టులను మంజూరు చేయగా తెలంగాణ పోస్టల్ సర్కిల్ పరిధిలో ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 100 నామినల్ ఫీజుతో పాటు రూ. 10 సర్వీస్ ట్యాక్స్‌ని కలిపి పోస్టాఫీస్‌లో స్వీకరిస్తున్నారు. ఓబీసీ జనరల్ అభ్యర్థులకు రూ. 500, అదనంగా రూ.10 చూప్పున ఫీజులను స్వీకరిస్తున్నారు. ఫీజు చెల్లించిన అభ్యర్థులకు పోస్టల్ తరపున కోడ్ కేటాయించగా వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది. 18–27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, బుధవారానికి దాదాపు 2వేల దరఖాస్తులు వచ్చినట్లు హెడ్ పోస్ట్‌మాస్టర్ సుబ్రమణ్యం తెలిపారు.