maize cultivation
-
యాసంగి జోరు!
జిల్లాలో యాసంగి పంటల సాగు జోరుగా సాగుతోంది. రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారు. రబీలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1,83,426 ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 1,73,305 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. పంటల సాగు విస్తీర్ణం 94 శాతంగా నమోదైంది. మరో వారం రోజుల్లో వంద శాతం పంటలు సాగయ్యే అవకాశాలు న్నాయని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. సాక్షి, కామారెడ్డి: జిల్లాలో వరి సాగు లక్ష్యానికి మించి నాట్లు వేశారు. 54,360 ఎకరాల్లో వరి పంట సాగవుతుందని అధికారులు అంచనా వేయగా.. 61,510 ఎకరాల్లో వరి సాగైంది. మరో ఐదారువేల ఎకరాల్లో నాట్లు పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద 31,913 ఎకరాల్లో, పోచారం ప్రాజెక్టు కింద 3,806 ఎకరాల్లో, కౌలాస్‌నాలా ప్రాజెక్టు కింద 3,500 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. జిల్లాలో వరి సాగు విస్తీర్ణంలో సగం ప్రాజెక్టుల కిందనే ఉండగా.. మిగతా సాగు విస్తీర్ణం బోర్లు, బావులపై ఆధారపడి ఉంది. తగ్గిన మొక్కజొన్న సాగు... జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం సాధారణానికం టే తగ్గింది. యాసంగిలో సాధారణ సాగు విస్తీర్ణం 44,043 ఎకరాలుకాగా 39,554 ఎకరాల్లో మక్క వేశారు. మక్క దాదాపు బోర్లు, బావుల దగ్గరే సాగవుతోంది. 10,933 ఎకరాల్లో జొన్న సాగవుతుందని అంచనా వేయగా.. 7832 ఎకరాల్లో సాగైంది. శనగ పంట 44,903 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేస్తే 49,316 ఎకరాల్లో సాగు చేశారు. పొద్దుతిరుగుడు సాగు గణనీయంగా తగ్గిపోయింది. సాధారణ సాగు విస్తీర్ణం 2,458 ఎకరాలు కాగా.. 440 ఎకరాల్లో మాత్రమే పంట సాగు చేశారు. చెరుకు సాగు విస్తీర్ణం ఈసారి పెరిగింది. సాధారణ విస్తీర్ణం 5,883 ఎకరాలు కాగా 7,643 ఎకరాల్లో చెరుకు సాగు చేశారు. తగ్గుతున్న భూగర్భ జలాలు.. ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తుండడంతో బోర్లు ఎక్కువ సేపు నడుపుతున్నారు. దీంతో బోర్లలో నీటి ఊటలు తగ్గుతున్నాయి. ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటిపోతున్న పరిస్థితుల్లో 24 గంటల కరెంటు మరింత దెబ్బతీస్తోంది. కొన్నిచోట్ల ఇప్పటికే భూగర్భ జలమట్టం దెబ్బతిని యాసంగి పంటలకు నష్టం కలుగుతోంది. ఇదే పరిస్థితి ముందుముందు ఉంటే మరింత నష్టం తప్పదంటున్నారు. ఎకరం వరి వేసిన... ఎకరం వరి పంట వేసిన. బోరు మంచిగనే పోసేది. ఈ మధ్యన బోర్ల ఊట తగ్గింది. నీళ్లకు తిప్పలైతదనే కొంత బీడు పెట్టినం. వేసిన ఎకరం పంట గూడ ఎట్ల గట్టెక్కుతదోననే భయం ఉన్నది. 24 గంటల కరెంటుతోని కొంత ఇబ్బంది అయితుంది. – నాగరాజు, రైతు, పోల్కంపేట, లింగంపేట మండలం ఇప్పుడైతే మంచిగనే ఉన్నది... బోర్లు మంచిగ పోస్తున్నయని మూడెకరాలల్లో వరి వేసిన. అవసరం ఉన్నంత మేరకు బోరు నడుపుతున్నం. మిగతా సమయం బందు పెడుతున్నం. ఈసారి పంట మంచిగనే ఉన్నది. మా ఊళ్లె అన్ని బోర్లు బాగానే ఉన్నయి. బోర్లు ఎత్తిపోకుంటే ఏ ఇబ్బంది ఉండదు. – దేవేందర్‌రెడ్డి, రైతు, ఒంటరిపల్లి, లింగంపేట మండలం -
యూరియా...లేదయ్యా..!
తెనాలిటౌన్: తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని మండలాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు కంటి మీద కునుకు ఉండడం లేదు. పైరుకు సకాలంలో ఎరువు వేయలేక పంటను ఎలా కాపాడుకోవాలో అర్థంకాక అల్లాడుతున్నారు. యూరియాకు కృతిమ కొరత ఏర్పడటంతో రైతులు పలు ఇబ్బందులు పడుతున్నారు. మొదటి దశలో ఎరువులు వేయాల్సిన సమయం రావడంతో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతు లు పలు అవస్థలు పడుతున్నారు. యూరియా కోసం తెనాలి మార్కెట్ యార్డు ఆవరణలోని విక్రయ కేంద్రం చుట్టూ రైతులు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. సబ్ డివిజన్ పరిధిలోని తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల, కొల్లూరు, వేమూరు మండలాల్లో మొక్కజొన్న పైరు 30 నుంచి 35 రోజుల దశలో ఉంది. కొన్నిచోట్ల 25 నుంచి 30 రోజుల దశలో ఉంది. ఈ దశలో మొదటి దఫా ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది. డీఏపీతోపాటు యూరియా కూడా వేస్తారు. తెనాలి మండలంలో 8,750 ఎకరాలు, దుగ్గిరాలలో 8వేల ఎకరాలు, కొల్లిపరలో 8,500 ఎకరాలు, కొల్లూరులో 7,500 ఎకరాలు, వేమూరులో 7వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేపట్టినట్టు వ్యవసాయ సహాయ సంచాలకులు కె.జ్యోతిరమణి తెలిపారు. తెనాలి మార్కెట్‌యార్డు ఆవరణలో జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 50 కిలోల యూరియా బస్తా రూ. 298.50లకు విక్రయిస్తున్నారు. డివిజన్ పరిధిలోని మండలాలతో పాటు చుండూరు, చేబ్రోలు, అమృతలూరు రైతులు కూడా ఇక్కడకు వచ్చి యూరియా కొనుగోలు చేయడంతో డిమాండ్ పెరిగింది. రైతులు ఆటోలు, ట్రక్కు ఆటోల ద్వారా తీసుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు విక్రయ కేంద్రంలో నవంబర్, డిసెంబర్ నెలలకు కలిపి 9,140 బస్తాలు, జనవరిలో ఇప్పటి వరకు 1600 బస్తాలు విక్రయించినట్టు ఇన్చార్జి ఇన్నయ్య తెలిపారు. అలాంట్మెంట్ తక్కువగా ఉండటం, రవాణా సక్రమంగా జరగకపోవడంతో యూరియా కొరత ఏర్పడింది. మండల కేంద్రాల్లో వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా యూరియాను సక్రమంగా సరఫరా చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అక్కడ లేకపోవడంతో తెనాలి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రానికి రావాల్సి వస్తుందని, ఐతానగర్‌కు చెందిన సురేష్ అనే రైతు తెలిపారు. పైరుకు నీరు పెట్టాల్సిన సమ యం వచ్చిందని, ఎరువు వేసి నీరు పెడదామంటే యూరియా అందుబాటులో లేదని తెలిపారు. ముందస్తు నిల్వలు.. ఇదిలావుంటే , ప్రస్తుతం యూరియా కొరతగా ఉండటంతో రాబోయే రోజుల్లో మరింత ఇబ్బంది ఎదురుకావచ్చనే ఉద్దేశంతో కొందరు రైతులు ఇప్పుడే కొని నిల్వ చేసుకుంటున్నారు. ఒక్కొక్క రైతు 20 నుంచి 50 బస్తాల వరకు కొనుగోలు చేయడంతో మిగతావారికి అందడం లేదని ఇన్నయ్య తెలిపారు. రైతులందరూ ఒకేసారి అడుగుతున్నందున కొరత ఏర్పడిందని చెప్పారు. రైతులకు మొదటి దఫా ఎంతమేరకు అవసరమో అంతవరకే కొనుగోలు చేసి మిగతా రైతులకు అందేలా సహకరించాలని వ్యవసాయాధికారులు కోరుతున్నారు. ఇదిలావుండగా, బయట మార్కెట్లో యూరి యాను అధిక ధరకు విక్రయించినట్లయితే చర్యలు తప్పవని వ్యవసాయాధికారులు తెలిపారు. 30 వేల బస్తాల యూరియా అవసరం ... సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాలలో సాగవుతున్న మొక్కజొన్న, జొన్న పైర్లకు మరో 30 వేల బస్తాల యూరియా అవసరం కానుంది. ఇప్పటివరకు 10వేల బస్తాలకు పైగా విక్రయించారు. ఈ మ ండలాలతో పాటు పక్కన ఉన్న అమృతలూరు, భట్టిప్రోలు, చుండూరు, చేబ్రోలు రైతులు యూరియా కోసం ఇక్కడకు రావడంతో కొరత ఏర్పడింది. అధికారులు చర్యలు తీసుకుని రైతులందరికీ సకాలంలో యూరియా అందే విధంగా చూడాలని కోరుతున్నారు.