యూరియా...లేదయ్యా..!
తెనాలిటౌన్: తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని మండలాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు కంటి మీద కునుకు ఉండడం లేదు. పైరుకు సకాలంలో ఎరువు వేయలేక పంటను ఎలా కాపాడుకోవాలో అర్థంకాక అల్లాడుతున్నారు. యూరియాకు కృతిమ కొరత ఏర్పడటంతో రైతులు పలు ఇబ్బందులు పడుతున్నారు. మొదటి దశలో ఎరువులు వేయాల్సిన సమయం రావడంతో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతు లు పలు అవస్థలు పడుతున్నారు. యూరియా కోసం తెనాలి మార్కెట్ యార్డు ఆవరణలోని విక్రయ కేంద్రం చుట్టూ రైతులు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు.
సబ్ డివిజన్ పరిధిలోని తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల, కొల్లూరు, వేమూరు మండలాల్లో మొక్కజొన్న పైరు 30 నుంచి 35 రోజుల దశలో ఉంది. కొన్నిచోట్ల 25 నుంచి 30 రోజుల దశలో ఉంది. ఈ దశలో మొదటి దఫా ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది. డీఏపీతోపాటు యూరియా కూడా వేస్తారు.
తెనాలి మండలంలో 8,750 ఎకరాలు, దుగ్గిరాలలో 8వేల ఎకరాలు, కొల్లిపరలో 8,500 ఎకరాలు, కొల్లూరులో 7,500 ఎకరాలు, వేమూరులో 7వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేపట్టినట్టు వ్యవసాయ సహాయ సంచాలకులు కె.జ్యోతిరమణి తెలిపారు.
తెనాలి మార్కెట్‌యార్డు ఆవరణలో జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 50 కిలోల యూరియా బస్తా రూ. 298.50లకు విక్రయిస్తున్నారు.
డివిజన్ పరిధిలోని మండలాలతో పాటు చుండూరు, చేబ్రోలు, అమృతలూరు రైతులు కూడా ఇక్కడకు వచ్చి యూరియా కొనుగోలు చేయడంతో డిమాండ్ పెరిగింది. రైతులు ఆటోలు, ట్రక్కు ఆటోల ద్వారా తీసుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు విక్రయ కేంద్రంలో నవంబర్, డిసెంబర్ నెలలకు కలిపి 9,140 బస్తాలు, జనవరిలో ఇప్పటి వరకు 1600 బస్తాలు విక్రయించినట్టు ఇన్‌చార్జి ఇన్నయ్య తెలిపారు.
అలాంట్‌మెంట్ తక్కువగా ఉండటం, రవాణా సక్రమంగా జరగకపోవడంతో యూరియా కొరత ఏర్పడింది. మండల కేంద్రాల్లో వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా యూరియాను సక్రమంగా సరఫరా చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అక్కడ లేకపోవడంతో తెనాలి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రానికి రావాల్సి వస్తుందని, ఐతానగర్‌కు చెందిన సురేష్ అనే రైతు తెలిపారు. పైరుకు నీరు పెట్టాల్సిన సమ యం వచ్చిందని, ఎరువు వేసి నీరు పెడదామంటే యూరియా అందుబాటులో లేదని తెలిపారు.
ముందస్తు నిల్వలు..
ఇదిలావుంటే , ప్రస్తుతం యూరియా కొరతగా ఉండటంతో రాబోయే రోజుల్లో మరింత ఇబ్బంది ఎదురుకావచ్చనే ఉద్దేశంతో కొందరు రైతులు ఇప్పుడే కొని నిల్వ చేసుకుంటున్నారు. ఒక్కొక్క రైతు 20 నుంచి 50 బస్తాల వరకు కొనుగోలు చేయడంతో మిగతావారికి అందడం లేదని ఇన్నయ్య తెలిపారు. రైతులందరూ ఒకేసారి అడుగుతున్నందున కొరత ఏర్పడిందని చెప్పారు. రైతులకు మొదటి దఫా ఎంతమేరకు అవసరమో అంతవరకే కొనుగోలు చేసి మిగతా రైతులకు అందేలా సహకరించాలని వ్యవసాయాధికారులు కోరుతున్నారు.
ఇదిలావుండగా, బయట మార్కెట్‌లో యూరి యాను అధిక ధరకు విక్రయించినట్లయితే చర్యలు తప్పవని వ్యవసాయాధికారులు తెలిపారు.
30 వేల బస్తాల యూరియా అవసరం ...
సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాలలో సాగవుతున్న మొక్కజొన్న, జొన్న పైర్లకు మరో 30 వేల బస్తాల యూరియా అవసరం కానుంది. ఇప్పటివరకు 10వేల బస్తాలకు పైగా విక్రయించారు. ఈ మ ండలాలతో పాటు పక్కన ఉన్న అమృతలూరు, భట్టిప్రోలు, చుండూరు, చేబ్రోలు రైతులు యూరియా కోసం ఇక్కడకు రావడంతో కొరత ఏర్పడింది.
అధికారులు చర్యలు తీసుకుని రైతులందరికీ సకాలంలో యూరియా అందే విధంగా చూడాలని కోరుతున్నారు.