ప్రాప్‌టైగర్ చేతికి మకాన్‌డాట్‌కామ్
న్యూఢిల్లీ : దేశీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో స్థానం పటిష్టం చేసుకునే దిశగా రియల్ ఎస్టేట్ పోర్టల్ ప్రాప్‌టైగర్ పోటీ సంస్థ మకాన్‌డాట్‌కామ్‌ను కొనుగోలు చేసింది. అయితే దీనికోసం ఎంత వెచ్చించినదీ ప్రాప్‌టైగర్ సహ వ్యవస్థాపకుడు ధృవ్ అగర్వాలా వెల్లడించలేదు. ఇందుకోసం కొత్తగా నిధులేమీ సమీకరించలేదని తెలిపారు. రీసేల్ మార్కెట్లో గట్టి పట్టు ఉన్నందున మకాన్‌డాట్‌కామ్‌ను కొన్నట్లు ఆయన వివరించారు. ఈ రెండు పోర్టల్స్ ఇకపై కూడా వేర్వేరుగానే కొనసాగుతాయని ప్రాప్‌టైగర్ మాతృ సంస్థ ఎలార టెక్నాలజీస్ పేర్కొంది.
డిజిటల్ మీడియాలో కార్యకలాపాలు విస్తరించే వ్యూహంలో భాగంగా మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ సారథ్యంలోని న్యూస్‌కార్ప్ గతేడాది నవంబర్‌లో రూ. 185 కోట్లతో ప్రాప్‌టైగర్‌లో 25% వాటాలు కొనుగోలు చేసింది. ప్రాప్‌టైగర్ ఇటీవలే బెంగళూరుకు చెందిన అవుట్ ఆఫ్ బాక్స్ ఇంట రాక్షన్ సంస్థను కొనుగోలు చేసింది.
2011 నుంచి ఇప్పటిదాకా దాదాపు 1.2 బిలి యన్ డాలర్ల విలువచేసే 12,000 గృహాల కొనుగోలు ప్రాప్‌టైగర్ ద్వారా జరిగిందని అగర్వాలా తెలిపారు. ప్రాప్టైగర్కి దేశవ్యాప్తంగా ఎనిమిది కార్యాలయాలు, 500 మంది ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు మకాన్ డాట్కామ్కి 50 నగరాల్లో 2,00,000 పైచిలుకు ప్రాపర్టీ లిస్టింగ్స్ ఉన్నాయి.