Malaysian Prime Minister
-
మలేసియా ప్రధానితో జకీర్ నాయక్ భేటీ
కౌలాలంపూర్: భారత్‌కు చెందిన వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్‌నాయక్ మలేసియా ప్రధాని మహతీర్ మహ్మద్‌ను కలిశారు. ఉగ్ర కార్యకలాపాలు, మనీ లాండరింగ్‌కు సంబంధించిన కేసులు ఉండటంతో ఆయన్ను అప్పగించాలని మలేసియా ప్రభుత్వాన్ని భారత్ కోరుతోంది. అయితే, ఆయన్ను పంపబోమని ప్రధాని మహతీర్ శనివారం ప్రకటించడం తెల్సిందే. ప్రధాని మహతీర్‌తో జకీర్ సంక్షిప్త భేటీలో ఏం మాట్లాడారన్న విషయం వెల్లడికాలేదు. అయితే, మలేసియా ప్రభుత్వ నిర్ణయాన్ని అధికార పార్టీ సమర్ధించిందని మీడియా తెలిపింది. జకీర్‌నాయక్‌కు మలేసియాలో శాశ్వత నివాస హోదా ఉంది. దాని ప్రకారం అక్కడి చట్టాలను ఉల్లంఘించనంత వరకు నివాసం ఉండే హక్కు ఉంటుంది. భారత్ కోర్టుల్లో జకీర్‌పై నేరారోపణలు నమోదయితేనే రెండు దేశాల మధ్య ఉన్న నేరస్తుల మార్పిడి ఒప్పందం అమల్లోకి వస్తుందని ఆయన లాయర్ షహరుద్దీన్ తెలిపారు. జకీర్ విషయంలో ప్రధాని‡ నిర్ణయం సరైందేనని అధికార పార్టీ తెలిపింది. -
జకీర్‌ను అప్పగించం: మలేసియా
కౌలాలంపూర్: వివాదాస్పద ఇస్లాం ప్రబోధకుడు జకీర్ నాయక్(52)ను భారత్‌కు అప్పగించబోమని మలేసియా ప్రధానమంత్రి మహతీర్ బిన్ మొహమ్మద్ తెలిపారు. శుక్రవారం నాడిక్కడ జరిగిన ఓ మీడియా సమావేశంలో మహతీర్ మాట్లాడుతూ.. ‘జకీర్ మలేసియాలో శాశ్వత నివాసహోదా కలిగిఉన్నారు. జకీర్‌తో ఎలాంటి సమస్యలు రానంతవరకూ ఆయన్ను భారత్‌కు అప్పగించబోం’ అని స్పష్టం చేశారు. అక్రమ నగదు చెలామణితో పాటు విద్వేష ప్రసంగాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్‌ను తమకు అప్పగించాలని గత జనవరిలో ప్రభుత్వం మలేసియాను కోరింది. 2016, జూలైలో భారత్ నుంచి వెళ్లిపోయిన జకీర్.. తనపై విచారణ నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరుగుతుందన్న నమ్మకం కలిగినప్పుడే దేశానికి తిరిగివస్తానని ఇంతకుముందు ప్రకటించారు. -
మలేసియా ప్రధానిగా మరోసారి మహతీర్
కౌలాలంపూర్: మలేసియా ప్రధానమంత్రిగా మహతీర్ బిన్ మహమ్మద్(92) మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఇంతపెద్ద వయస్సులో ఎన్నికైన నేతగా రికార్డు సృష్టించారు. మద్దతుదారుల సంబరాల మధ్య మహతీర్ మహమ్మద్ గురువారం రాజధానిలోని ఇస్తానా నెగర ప్రాసాదంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. మలేసియాకు స్వాతంత్య్రం వచ్చిన 1957 నుంచి అధికారంలో ఉన్న బరిసాన్ నేషనల్(బీఎన్) సంకీర్ణానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు గట్టి షాకిచ్చారు. మొత్తం 222 సీట్లున్న పార్లమెంట్లో ప్రతిపక్ష ‘పకటన్ హరపన్’ కూటమికి 113 సీట్లు రాగా బీఎన్ కూటమి 79 సీట్లు గెలుచుకుంది. మహతీర్ మహమ్మద్ బీఎన్ కూటమి చైర్మన్‌గా ఉన్న సమయంలో 1981–2003 వరకు 22 ఏళ్లపాటు ఏకధాటిగా ప్రధానిగా పనిచేశారు. -
సూపర్ స్టార్ ఇంటికి దేశాధినేత
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసానికి శుక్రవారం ఓ విశిష్ట అతిథి వచ్చారు. రజనీని చూసేందుకు ఏకంగా ఓ దేశాధినేత వచ్చారు. భారత పర్యటనకు వచ్చిన మలేసియా ప్రధాని నజీబ్ రజాక్.. రజనీకాంత్‌తో సమావేశమయ్యారు. మలేసియా ప్రధాని మర్యాదపూర్వకంగా రజనీ ఇంటికి వెళ్లి కలసినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం రజనీ మీడియాతో మాట్లాడారు. కొన్నాళ్ల క్రితం మలేసియాలో ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నానని, అప్పుడు నజీబ్ రజాక్‌ను కలవలేకపోయానని చెప్పారు. దీంతో ఇప్పుడు ఆయన తనను కలిసేందుకు వచ్చారని తెలిపారు. మలేసియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని ప్రధాని నజీబ్ తనను కోరలేదని, ఇవన్నీ ఊహాగానాలేనని అన్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా రజనీ నివాసానికి వెళ్లారు. రజనీకాంత్‌కు దేశంలోనే గాక శ్రీలంక, జపాన్, సింగపూర్, మలేసియా తదితర దేశాల్లో అభిమానులు ఉన్నారు. రజనీ సినిమాలను అక్కడ బాగా చూస్తారు. రజనీ సినిమా విడుదల రోజున విదేశాల్లో కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సెలవులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో ఆయన విదేశాలకు షూటింగ్‌లకు వెళ్లినపుడు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు కలవడంతో పాటు విందు ఏర్పాటు చేశారు. -
అదృశ్యమైన విమానం జాడ ఒక్క సెకండ్లోనా.... ఎట్లా?
గత నెలలో అదృశ్యమైన మలేసియా విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతునే ఉన్నాయని ఆ దేశ ప్రధాని నజీబ్ రజాక్ వెల్లడించారు. విమాన జాడ కోసం ఇతరదేశాల సంపూర్ణ సహాయ సహకారాలు తీసుకుంటున్నామని తెలిపారు. తానే దేశ ప్రధాని అయి ఉంటే అదృశ్యమైన విమానం జాడ ఒక్క నిముషంలో కనుక్కోనే వాడినంటూ మలేసియా ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీం వ్యాఖ్యలను నజీబ్ ఖండించారు. అన్వర్ వ్యాఖ్యలు మతిలేనివిగా ఆయన అభివర్ణించారు. విమానం ఆచూకీ కోసం ఇప్పటికి చేయని ప్రయత్నం లేదని ఆయన మరోమారు స్పష్టం చేశారు. ఈ నెల 5న మలేషియా ప్రతిపక్ష నేత చైనా వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ... తాను దేశ ప్రధాని అయి ఉంటే ఒక్క నిముషంలో అదృశ్యమైన విమానం జాడ కనిపెట్టేవాడి నంటూ చెప్పారు. ఆ వ్యాఖ్యపై ప్రధాని నజీబ్ రజాక్‌పై విధంగా స్పందించారు. 2014, మార్చి 8న కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బందితో ఎమ్హెచ్ -370 విమానం బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన కొద్ది సేపటికే ఆ విమానం వినాశ్రయం ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయి. దాంతో నాటి నుంచి విమాన ఆచూకీ కోసం చైనా, బీజింగ్, అమెరికా, భారత్‌తో పాటు పలుదేశాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయిన ఇప్పటికి ఆ విమానం ఆచూకీ తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలో విమానం జాడ కనుగోనడంలో మలేసియా ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ప్రయాణికుల బంధువులతో పాటు స్థానిక ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అదృశ్యమైన విమానంలో ఐదుగురు భారతీయ ప్రయాణికులు కూడా ఉన్న విషయం విదితమే.