
కౌలాలంపూర్: వివాదాస్పద ఇస్లాం ప్రబోధకుడు జకీర్ నాయక్(52)ను భారత్‌కు అప్పగించబోమని మలేసియా ప్రధానమంత్రి మహతీర్ బిన్ మొహమ్మద్ తెలిపారు. శుక్రవారం నాడిక్కడ జరిగిన ఓ మీడియా సమావేశంలో మహతీర్ మాట్లాడుతూ.. ‘జకీర్ మలేసియాలో శాశ్వత నివాసహోదా కలిగిఉన్నారు. జకీర్‌తో ఎలాంటి సమస్యలు రానంతవరకూ ఆయన్ను భారత్‌కు అప్పగించబోం’ అని స్పష్టం చేశారు. అక్రమ నగదు చెలామణితో పాటు విద్వేష ప్రసంగాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్‌ను తమకు అప్పగించాలని గత జనవరిలో ప్రభుత్వం మలేసియాను కోరింది. 2016, జూలైలో భారత్ నుంచి వెళ్లిపోయిన జకీర్.. తనపై విచారణ నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరుగుతుందన్న నమ్మకం కలిగినప్పుడే దేశానికి తిరిగివస్తానని ఇంతకుముందు ప్రకటించారు.