మనసు నేపథ్యంగా ‘మనలో మనం’
ఆసక్తికరంగా రచించిన డాక్టర్ రామారెడ్డి
ఆవిష్కరణసభలో ‘సైకాలజీ టుడే’ ఎడిటర్ సురేష్
సాక్షి, రాజమహేంద్రవరం : మానసిక ధోరణులు అంశంగా ఉండే కథలు పెద్దగా ఆసక్తిగా ఉండవని, కానీ డాక్టర్ కర్రి రామారెడ్డి వ్యక్తుల మనసుల నేపథ్యంలో రాసిన ‘మనలో మనం’ పుస్తకం మసాలాతో పాటు అద్భుతమైన శైలి ఆకట్టుకుంటోందని న్యూవిజన్ పబ్లిషర్, సైకాలజీ టుడే ఎడిటర్ డాక్టర్ ఎస్వీ సురేష్ అన్నారు. బీసీ రాయ్ అవార్డు గ్రహీత, ప్రముఖ మానసిక వైద్యనిపుణుడు డాక్టర్ రామారెడ్డి రచించిన ‘మనలో మనం’ పుస్తకావిష్కరణ ఆదివారం నగరంలోని మానస వైద్యశాలలో జరిగింది. ముఖ్యఅతిథిగా సురేష్ మాట్లాడుతూ రామారెడ్డి గతంలో రాసిన ‘మనలో ఒకరు’ పుస్తకాన్ని కూడా తామే ప్రచురించామని, ఆ పుస్తకం రెండో ముద్రణ వేసేలా విరివిగా అమ్ముడయిందని చెప్పారు. ‘మనలో మనం’ చదివేటప్పుడు మనం, మన చుట్టూ ఉన్న వ్యక్తులను చూస్తున్నట్లు ఉంటుందని విశ్లేషకులు ఫణి నాగేశ్వరరావు పేర్కొన్నారు. వైద్యునిగా సేవలందిసూ్తనే రామారెడ్డి ప్రసంగాలు చేయడం, వివిధ పత్రికలకు 3,500 వ్యాసాలు రాయడం గొప్పవిషయమన్నారు. డాక్టర్ రామారెడ్డి మాట్లాడుతూ ఇది తాను రాసిన మూడో పుస్తకమని, గతంలో ‘మనిషి మనసు’, ‘మనలో ఒకరు’ మాదిరిగానే ఈ పుస్తకాన్ని పాఠకులు ఆదరిస్తారన్న నమ్మకముందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి బీసీ రాయ్ అవార్డు అందుకున్న సైకియాట్రిస్ట్ తానే కావడం సంతోషంగా ఉందన్నారు.