Manasa sarover
-
ఇది ధైర్యం కాదు... భయం లేకపోవడం!
ఎమ్మెస్సీ కంప్యూటర్స్, ఎకనమిక్స్‌లో ఎంఫిల్ చేసిన కవిత యాగ బుగ్గన యూఎస్‌లో సాఫ్ట్వేర్ నిపుణులుగా, ఇండియాలో డెవలప్మెంటల్ ఎకనమిస్ట్‌గా చేశారు. ట్రావెల్, ఫిక్షన్, నాన్ఫిక్షన్ రైటర్. రిషివ్యాలీ స్కూల్ ఆమెకు ప్రపంచాన్ని చదవడం నేర్పించింది. సునిశితంగా విశ్లేషించి, ప్రశ్నించగలిగిన నైపుణ్యాన్ని అలవరిచింది. ‘‘వీటన్నింటి నేపథ్యంలో నాకు తెలిసిందేమిటంటే... ఆధ్యాత్మికత అంటే జీవితాన్ని నిస్సారంగా గడపడం కాదు, సమాజం నుంచి దూరంగా వెళ్లిపోవడమూ కాదు. సమాజంలో జీవిస్తూ, వృత్తి ఉద్యోగాలలో కరుణపూరితంగా వ్యవహరించగలగడం’ అంటారామె. ఆ నీటిలో విషం లేదు! కవిత విస్తృతంగా పర్యటనలు చేస్తారు. అవి సాహసానికి లోతైన నిర్వచనాన్ని తెలియచేస్తుంటాయి. అవన్నీ జీవితాలను అర్థం చేసుకోవడానికే అయి ఉంటాయి. మూఢనమ్మకాలను తుడిచేయడానికి సాహసాలు చేశారు. మన్సరోవర్ సమీపంలోని రాక్షస్‌తాల్ ను స్థానికులు విషపు నీటి మడుగు అంటారు. రావణాసురుడు ఆ మడుగు దగ్గర తపస్సు చేసిన కారణంగా అవి విషపూరితమయ్యాయనే కథనంతో ఆ సరస్సు సామాజిక బహిష్కరణుకు గురైంది. కవిత తన పర్యటన సందర్భంగా ఆ నీటిని తాగి ‘నేను తాగాను, ఏమైంది’ అని ప్రశ్నించారు. కొంచెం ఉప్పగా ఉన్న కారణంగా ఆ నీటిని తాగవద్దు అని చెప్పడానికి ఇంత పెద్ద ట్యాగ్ తగిలించడం ఏమిటనేది ఆమె ప్రశ్న. అందరూ తీర్పరులే! ప్రయాణం అంటే ప్రదేశాలను చూసే వ్యాపకం కాదు, జీవితాలను చదివే సాధనం అంటారు కవిత. గుంటూరు జిల్లాలోని స్టూవర్ట్‌పురం మీదుగా ఎంతోమంది ఎన్నోసార్లు ప్రయాణించి ఉంటారు. స్టేషన్ పేరు విని ఆ పేరు రావడానికి కారణాలు తెలుసుకుని, ఆ గ్రామాన్ని ఏర్పాటు చేయడానికి దారి తీసిన పరిస్థితులను అన్వేషించారు కవిత. కులవ్యవస్థ మన సమాజంలో అభివృద్ధి నిరోధకంగా ఉన్న పెద్ద అడ్డంకి. అయితే ఏకంగా ఒక సామాజిక వర్గం మొత్తాన్ని దొంగలుగా ముద్ర వేయడాన్ని తీవ్రంగా నిరసించారామె. ‘‘ఒక వ్యక్తి గుణగణాలు ఆ వ్యక్తికే పరిమితం. ఒక వ్యక్తి దుర్గుణాలను ఆ కుటుంబం మొత్తానికి ఆపాదించడమే పెద్ద తప్పు, అలాంటిది ఆ కులమంతటికీ ఆపాదించడం ఏమిటి? సంస్కరణ పేరుతో వారిని బలవంతం గా ఒకచోటకు తరలించి, ఇక్కడే నివసించాలనే నిర్దేశించడం శిక్షార్హమైన నేరం’’ అంటారు కవిత. మన సమాజంలో అగ్రవర్ణాలుగా చలామణిలో ఉన్న వాళ్ల విషయంలో ఇలాగే చేసేవారా... అంటూ అప్పటి బ్రిటిష్ పాలకుల విధానాన్ని నిరసించారు. తన ప్రయాణ పరిశోధనలన్నింటినీ అక్షరబద్ధం చేస్తారామె. మన సమాజంలో ఉన్న పెద్ద అవలక్షణం... ఇతరుల జీవితానికి ప్రతి ఒక్కరూ తీర్పరులుగా మారిపోవడమే అంటారు కవిత. పాశ్చాత్య జీవనశైలిని మన జీవితాల్లోకి స్వాగతించినంత బేషరతుగా వారి ఆలోచన ధోరణిని అలవరుచుకోవడం లేదంటారామె. హిందూ, రివర్ టీత్, తెహల్కా, జాగరీ లిట్ వంటి వార్తాపత్రికలు, ఫిక్షన్– నాన్ ఫిక్షన్ జర్నల్స్‌లో ప్రచురితమైన రచనల్లో ఆమె తెలుగు నేల మీద విస్తరించిన బ్రిటిష్ కాలనీ బిట్రగుంటను కూడా ప్రస్తావించారు. చైనా పాలనలో టిబెట్ వాసుల అసంతృప్తినీ, నేపాల్‌లోని హమ్లా వ్యాలీ ప్రజల పేదరికాన్నీ రాశారు. అసలైన తాత్వికత శ్రీలంక, నేపాల్, టిబెట్, లెబనాన్, రుమేనియా, ఇటలీ, ఫ్రాన్స్, యూకే, యూఎస్, కెనడా,స్పెయిన్, చైనా, జపాన్, కాంబోడియా, మయన్మార్, థాయ్‌ల్యాండ్, టాంజానియావంటి అనేక దేశాల్లో పర్యటించిన కవిత అసలైన తాత్విక జీవనం సాగిస్తున్నది సంచార జాతులేనంటారు. ‘‘ఆదివాసీలు, అందులోనూ సంచార జాతుల ఫిలాసఫీ చాలా గొప్పది. ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, అందుకే ఈర్ష్య, అసూయ, వైషమ్యాలు ఉండవు. జీవితాన్ని యథాతథంగా స్వీకరిస్తారు. అడవుల్లో జీవించే వాళ్లు ప్రకృతి ఏమి ఇస్తే దాంతోనే జీవితం అనుకుంటారు, ప్రకృతికి హాని కలిగించరు. ప్రభుత్వాలు అడవి మీద ఆధిపత్యాన్ని హస్తగతం చేసుకోవడంతో వారి జీవితాల్లో ఒడిదొడుకులు మొదలయ్యాయ’’ంటారు కవిత. మగవాళ్లు సాహసించని ప్రదేశాలకు కూడా ఆమె చొరవగా వెళ్లిపోతారు, అక్కడి విషయాలను అంతే ధైర్యంగా రాస్తారు. అదే విషయాన్ని ఆమె ‘ఇది ధైర్యం కాదు, భయం లేకపోవడం’ అంటారు. జీవితం పట్ల ఆందోళన, భయం లేనప్పుడు ఏదీ భయపెట్టద’ని రిషీవ్యాలీ స్కూల్ నేర్పించిన ఫిలాసఫీని మరోసారి గుర్తు చేశారు. – వాకా మంజులారెడ్డి -
హోటల్లో పుడ్‌పాయిజన్,బాలుడి మృతి
-
విషాహారం తిని బాలుడి మృతి
సనత్‌నగర్: యూఎస్‌కు వెళ్లేందుకు వీసా కోసం వచ్చిన నగరానికి వచ్చిన సాఫ్ట్వేర్ దంపతులకు విషాదం మిగిల్చింది. స్టార్ హోటల్లో బస చేసి అక్కడ విషాహారం తీసుకోవడంతో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. ఖమ్మం జిల్లా పెనుబోలు మండలం లింగగూడేనికి చెందిన ఏట్కూరి రవి నారాయణరావు, శ్రీవిద్య భార్యాభర్తలు. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా బెంగళూరులో ఆరేళ్లుగా పనిచేస్తున్నారు. వీరికి వరుణ్ (7), విహాన్ (ఏడాదిన్నర) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 9న కుటుంబం మొత్తం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు యూఎస్ కాన్సులేట్‌లో వీసా ఫింగర్ ప్రింట్, స్టాంపింగ్ కోసం వచ్చి బేగంపేట మానస సరోవర్ హోటల్లోని 318 గదిలో బస చేశారు. 10వ తేదీ ఉదయం యూఎస్ కాన్సులేట్‌కు వెళ్లి పనిపూర్తి చేసుకుని హోటల్‌కు వచ్చారు. ఉదయం, మధ్యాహ్నం అక్కడే అందరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేశారు. రాత్రి సమయంలో ఇండియన్ బ్రెడ్ బాస్కెట్, కడాయ్ పన్నీర్‌ను ఆహారంగా తీసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో చిన్న కుమారుడు విహాన్ వాంతులు చేసుకోవడం శ్రీవిద్య గమనించింది. అదే సమమంలో రవి నారాయణ కూడా కడుపు నొప్పితో బాధపడ్డారు. కొద్ది సేపటికి పెద్ద కుమారుడు, భార్య కూడా వాంతులు చేసుకున్నారు. ఈ విషయాన్ని రవి నారాయణ నగరంలోనే ఉండే బంధువు ప్రసాద్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన తెల్లవారు జామున 3.30గంటల సమయంలో హోటల్‌కు వచ్చారు. రవి నారాయణకు కడుపులో నొప్పి ఎక్కువ ఉండటం బంధువుతో కలిసి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అదే సమంలో పిల్లలు నిద్రపోతుండగా, భార్య హోటల్లోనే ఉండిపోయింది. ఉదయం 8గంటల సమయంలో ఆస్పత్రి నుంచి హోటల్‌కు రవినారాయణ రాగా చిన్న కుమారుడు విహాన్ అపస్మారక స్థితిలో ఉండటంతో పాటు పెదవులు నలుపు రంగులోకి మారి, శరీరం మొత్తం చల్లబడిపోయి ఉండటంతో వెంటనే సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. ఆస్పత్రి వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయాడని చెప్పారు. కిమ్స్ ఆస్పత్రి వైద్యులు బేగంపేట పోలీసులుకు సమాచారం అందించారు. రవి నారాయణరావు నుంచి ఫిర్యాదు స్వీకరించారు. మానస సరోవర్ హోటల్లో విషాహారం తిని తన కుమారుడు చనిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
వెబ్ సిరీస్‌లో...
ప్రేక్షకులు ఎక్కడుంటే అక్కడికి వెళ్లడానికి వెనకాడటం లేదు యాక్టర్స్. అది బిగ్ స్క్రీన్ అయినా, స్మాల్ స్క్రీన్ అయినా, డిజిటల్ ఫ్లాట్‌ఫారమ్ అయినా ఆలోచించడం లేదు. వాళ్లను అలరించడమే అంతిమ లక్ష్యం అంటున్నారు. ప్రస్తుతం కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఇలాగే ఆలోచిస్తున్నట్టున్నారు. తన కుమార్తె నిర్మించే ఓ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారాయన. ‘మానస సరోవర’ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ సిరీస్‌ను ఎక్కువ శాతం ఫారిన్లో షూట్ చేయనున్నారని శాండిల్‌వుడ్ సమాచారమ్. ఈ వెబ్ సిరీస్‌లో కన్నడలోని స్టార్ యాక్టర్స్‌తో పాటు టీవీ ఆర్టిస్ట్‌లు కూడా కనిపిస్తారట. -
'వాట్సప్‌లో మానస సరోవర దర్శనం'
సీనియర్ నటుడు మోహన్ బాబుకు దైవ భక్తి కాస్త ఎక్కువన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన వారసులకు కూడా భక్తి భావం అధికమే. ప్రస్తుతం మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ మానస సరోవర యాత్రలో ఉన్నారు. యాత్రలో భాగంగా సోమవారం ఈశ్వర దర్శనం చేసుకున్న మంచు లక్ష్మీ వాట్సప్ లైవ్ ద్వారా తన తండ్రికి ముక్కంఠి దర్శనం చేయించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ పేజ్ లో వెల్లడించిన మోహన్ బాబు.. 'నా కుమార్తె లక్ష్మిప్రసన్న మానస సరోవర యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆ కైలాసనాథుని దర్శించుకుని ఆశీస్సులు పొందింది....వాట్స్‌యాప్ లైవ్ లో నాక్కూడా ఈశ్వరుని దర్శనభాగ్యం కలుగగా నా జీవితం ధన్యమయ్యింది. ఆ పరమశివుడు అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను.శంభోశంకర' అంటూ ట్వీట్ చేశారు. నా కుమార్తె లక్ష్మిప్రసన్న మానసరోవర యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుంది.ఆ కైలాసనాథుని దర్శించుకుని ఆశీస్సులు పొందింది.... — Mohan Babu M (@themohanbabu) 11 September 2017 వాట్స్‌యాప్ లైవ్‌లో నాక్కూడా ఈశ్వరుని దర్శనభాగ్యం కలుగగా నా జీవితం ధన్యమయ్యింది.ఆ పరమశివుడు అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను.శంభోశంకర — Mohan Babu M (@themohanbabu) 11 September 2017