సనత్‌నగర్: యూఎస్‌కు వెళ్లేందుకు వీసా కోసం వచ్చిన నగరానికి వచ్చిన సాఫ్ట్‌వేర్ దంపతులకు విషాదం మిగిల్చింది. స్టార్ హోటల్‌లో బస చేసి అక్కడ విషాహారం తీసుకోవడంతో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. ఖమ్మం జిల్లా పెనుబోలు మండలం లింగగూడేనికి చెందిన ఏట్కూరి రవి నారాయణరావు, శ్రీవిద్య భార్యాభర్తలు. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లుగా బెంగళూరులో ఆరేళ్లుగా పనిచేస్తున్నారు. వీరికి వరుణ్ (7), విహాన్ (ఏడాదిన్నర) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 9న కుటుంబం మొత్తం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు యూఎస్ కాన్సులేట్‌లో వీసా ఫింగర్ ప్రింట్, స్టాంపింగ్ కోసం వచ్చి బేగంపేట మానస సరోవర్ హోటల్‌లోని 318 గదిలో బస చేశారు. 10వ తేదీ ఉదయం యూఎస్ కాన్సులేట్‌కు వెళ్లి పనిపూర్తి చేసుకుని హోటల్‌కు వచ్చారు. ఉదయం, మధ్యాహ్నం అక్కడే అందరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేశారు.
రాత్రి సమయంలో ఇండియన్ బ్రెడ్ బాస్కెట్, కడాయ్ పన్నీర్‌ను ఆహారంగా తీసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో చిన్న కుమారుడు విహాన్ వాంతులు చేసుకోవడం శ్రీవిద్య గమనించింది. అదే సమమంలో రవి నారాయణ కూడా కడుపు నొప్పితో బాధపడ్డారు. కొద్ది సేపటికి పెద్ద కుమారుడు, భార్య కూడా వాంతులు చేసుకున్నారు. ఈ విషయాన్ని రవి నారాయణ నగరంలోనే ఉండే బంధువు ప్రసాద్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన తెల్లవారు జామున 3.30గంటల సమయంలో హోటల్‌కు వచ్చారు. రవి నారాయణకు కడుపులో నొప్పి ఎక్కువ ఉండటం బంధువుతో కలిసి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అదే సమంలో పిల్లలు నిద్రపోతుండగా, భార్య హోటల్‌లోనే ఉండిపోయింది. ఉదయం 8గంటల సమయంలో ఆస్పత్రి నుంచి హోటల్‌కు రవినారాయణ రాగా చిన్న కుమారుడు విహాన్ అపస్మారక స్థితిలో ఉండటంతో పాటు పెదవులు నలుపు రంగులోకి మారి, శరీరం మొత్తం చల్లబడిపోయి ఉండటంతో వెంటనే సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. ఆస్పత్రి వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయాడని చెప్పారు. కిమ్స్ ఆస్పత్రి వైద్యులు బేగంపేట పోలీసులుకు సమాచారం అందించారు. రవి నారాయణరావు నుంచి ఫిర్యాదు స్వీకరించారు. మానస సరోవర్ హోటల్‌లో విషాహారం తిని తన కుమారుడు చనిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment